ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
దుర్యోధనుని వేగులవారు పాండవుల వెదకి కానక వచ్చుట (సం. 4-24-5)
ఉ. పాతకియై సుయోధనుఁడు పాండుతనూజులు సల్పుచున్న య
జ్ఞాత విధి వ్రతంబు కలుషంబుగఁ జేయఁదలంచి పంచినన్‌
భూతలమెల్లఁ జూచి మును వోయెడు నప్పుడు చెప్పుకొన్న సం
కేతపుఁ జోటఁ గూడఁబడి ఖేదముఁ బొందుచుఁ జారు లందఱున్‌.
73
వ. మగుడి వచ్చి హస్తిపురంబు చొత్తెంచి. 74
సీ. వరుస నేనుంగులు గురిసిన దాన ధా | రావలి దగు కలయంపి గాఁగ,
రాజులసందడి రాసిన తొడవులు | మురిసి రాలిన పొడి మ్రుగ్గుగాఁగఁ,
గాంతల సంకుల గతిఁ ద్రెస్సి తొరఁగిన | హారముల్‌ పుష్పోపహారములుగ,
నేమేమ యని యోలినెత్తిన పరదేశి | దొరల పావడములు తోరణముగ,
 
తే. సహజమైన యలంకార మహిమ నతిశ | యిల్లి మహనీయ వైభవ మెసక మెసఁగ
వఱలు నరపతి మందిర ద్వారభూమి | సేర నరిగి యా వేగులవారు ప్రీతి.
75
వ. సముచితంబుగాఁ బ్రవేశించి. 76
తే. ద్రోణ గాంగేయ భానుమత్సూను కృప సు | శర్మ దుశ్శాసనులు సర్వ సైన్యపతులు
నార్య జనములుఁ గొలువ మహార్హకాంచ | నోన్నతాసనమునఁ గొలువున్నవాని.
77
స్రగ్ధర మౌళిస్రక్సంగ రంగ న్మధుకరపటలీ మానసా కృష్టి విద్యా
శాలి స్ఫారాబ్జరేఖాంజలి పుట ఘటనాచారు ఫాలస్థల క్ష్మా
పాలశ్రేణీ విశా లాంబక కుముదవనీ బాంధవాయత్తచంద్ర
శ్రీలీలాగాఢ కాంతి స్మితవదనరుచి స్ఫీతు నాగేంద్ర కేతున్‌.
78
వ. కని జయజయశబ్దపూర్వంబుగా సాష్టాంగ దండ ప్రణామంబు సేసి. 79
క. మొగిచిన చేతులు ముందల | నిగిడించి నితాంత వినయ నిరతిం జారుల్‌
తగ విన్నవించి రిట్లని | జగతీశ్వరునకు నిజ ప్రచారం బెల్లన్‌.
80
క. ‘దేవర యానతిఁ బాండవు | లేవురు ద్రౌపదియు నున్న యెడ యే మరయం
గా వెడలి వారు సనిన మ | హావిపినంబులకుఁ దొలుత నరిగితిమి వెసన్‌.
81
వ. అందు. 82
ఆ. పరఁగు పొదరు పొదరు, పల్లంబు పల్లంబు | మ్రాను మ్రాను, దుర్గమంపుఁ జోటు
దుర్గమంపుఁ జోటు, దొన దొన, గుహ గుహ | యాదిగాఁగ నెందు నరసి యరసి.
83
వ. ఒక్క యెడ నరదంబు లరిగిన చొప్పు గాంచి దాని వెంబడిం జని చని. 84
క. కేవలసూతుల తోడన | పోవుట గని వానిఁ జేరఁ బోవక యవి యిం
కే వంకఁ బోవునొకొ! యను | భావనఁ బోయితిమి వానిపజ్జన యేమున్‌.
85
వ. అవియును ద్వారకా నగరంబున కరిగిన. 86
క. అందుల నుండుదు రను నా | సం దెల్లముగాఁగఁ బెక్కు చందంబుల ము
ట్టం దిరిగి తడవి కుంతీ | నందనులం గాన లేక నానా భంగిన్‌.
87
వ. విచ్చి పోయి సమస్త దేశంబులుం గలయం గ్రుమ్మరి, కొండొకయు నుపేక్షలేక వెరవుతోడిదకాఁ బరికించుచు. బయలనునాలస్యంబు దక్కియోలంబునట్ల శోధించుచుఁ గీడయిన నుదాసీనత యుడిగి మేలి చందంబునం భావించుచు, వివిధ ప్రకారంబు లయిన బహు ప్రదేశంబులు రోసి, కౌంతేయులం గానక సంకేత స్థలంబునం గూడికొని, మా వర్తించిన తెఱంగు దేవరకు నెఱింగించి, యట దివ్యచిత్తంబున నవధరించిన భంగి సేయువారమై చనుదెంచితిమి; మాకుం జూడఁ బాండవులు పొడ వడంగి లేకపోయిరిగాని యీ లోకంబున నునికి గలిగిన నగపడకుండ నేర; రిది యిక్కార్యంబు నున్నరూపు; మఱియొక్క విశేషంబునం బ్రియం బంది వచ్చితిమి; చిత్తగింపుము. 88
సీ. మత్స్యదేశాధీశు మఱఁదిఁ గీచకునిఁ బు | ణ్యోజ్జ్వలాకృతి యగు నొక్క వనిత
కతమున నడురేయి గంధర్వు లతిరహ | స్య ప్రకారంబునఁ జంపి; రదియు
నక్కజం బాయుధవ్యవహార మేమియు | లేదు, శిరంబు కా ల్గేలు డొక్క
లోనికిఁ జొరఁద్రోచి పీనుంగు ముద్దగాఁ | జేసివైచిరి దుష్టచిత్తులైన
 
తే. యతని తమ్ముల నొక్కరినైనఁ దప్పి | పోవనీక యా రాత్రియ పొదివి చిత్ర
నిహతిఁ దెగఁజూచి యనిరూపణీయ దుర్ని | వారవృత్తిమై నరిగిరి కౌరవేంద్ర!
89
వ. విరాటుండు పగతుండు గావునఁ దదీయవ్యసనం బెఱిఁగింపవలయు నని విన్నవించితి; మది యట్లుండె; బాండవులనన్వేషించుపని యిటమీఁదంజిత్తగించు తెఱంగానతిచ్చునది, యనిన విని ‘యట్ల చేయుదము గాక!’ యని వారలఁ బోవం బనిచి, కొంతసేపు చింతాక్రాంతుండై, య మ్మహీకాంతుండు మంత్రులం జూచి యిట్లనియె. 90
తే. ‘సమయ సముచిత కృత్యంబు చక్కఁ జేసి | పాండవులు రాజ్యమున కాసపడకమున్న
యరసి యెఱిఁగి యరణ్యంబు నందుఁ దొంటి | యట్ల యిడుమలఁ గుడువఁ బో నడుపవలయు.
91
క. ఎఱుఁగుట దుర్ఘట; మెవ్విధి | నెఱుఁగంగా వచ్చు? మీర లెల్లను మీమీ
యెఱిఁగిన చందంబున నా | కెఱిఁగింపుఁడు వారి వెదకి యెఱుఁగు తెఱంగుల్‌.’
92
వ. అనిన రాధేయుం డిట్లనియె. 93
ఆ. ‘వివిధ దుర్నిరూప వేషముల్‌ గైకొని | నిఖిల దిశలయందు నిపుణవృత్తి
నెఱుఁగునట్లుగా ననేకులఁ బుచ్చిన | నెల్లి నేఁటిలోన నెఱుఁగఁబడరె?’
94
క. అను పలుకులు విని దుశ్శా | సనుఁ డేమియు సరకుగొనక సమదవిలాసా
ననుఁడై నిజాగ్రజన్మునిఁ | గనుఁగొని యిట్లనియె గాఢ గర్వ స్ఫూర్తిన్‌.
95
చ. ‘వలవదు రోయఁ బాండవుల; వా రొక యూఱట లేని త్రిమ్మటన్‌
బల మఱి వన్య సత్త్వముల పాల్పడి చచ్చినచోటఁ బూరియు
న్మొలవదె యింత! కిం కిట మనోముద మస్ఖలితంబు గాఁగ వి
చ్చలవిడి రాజ్యలక్ష్మిఁ దగు చందమునం గొనియాడు మున్నతిన్‌.’
96
వ. అనిన విని దరహసితవదనుం డగుచుఁ గుంభసంభవుం డిట్లనియె. 97
ఉ. క్షాత్రసమగ్రు, లార్యనుత గౌరవదీప్త్తులు, వర్ణనీయ సౌ
భ్రాత్రు, లుదాత్త దైవబలభవ్యులు, దివ్యసమాను, లా పృథా
పుత్రులు; వారి నాపదలు వొందునె? యోపిన నింకనైన నీ
ధాత్రిఁ గడంగి యారయు విధంబులు సెప్పుఁడు నేర్పు లేర్పడన్‌.’
98
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )