ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు దుర్యోధనునితో ధర్మరాజు సుగుణంబులఁ జెప్పుట (సం. 4-27-1)
వ. అనిన నాతని మాట లాదరించి భీష్ముం డిట్లనియె. 99
ఉ. ‘నల్లవొ! నిక్క మాడె నృపనందను ముందట ద్రోణుఁ డొక్కఁడుం;
దెల్లము; వారు బాహుబల ధీబల దైవబలంబు లొప్ప వ
ర్తిల్లుదు; రమ్మహాత్ముల కరిష్టము లేమిట నెందు నేల పా
టిల్లెడు? వారిఁ గాన్పను గడింది తదీయ మహానుభావతన్‌.
100
క. వారలును వీరలును నా | కారయఁగా నొక్కరూప యైనను గార్యం
బీ రెఱిఁగింప వలయునని | కౌరవపతి నన్ను నడిగెఁ గాన యితనికిన్‌.
101
క. కలరూ పెఱిఁగింపంగా | వలయుం; జెప్పెద మదీయ వచనములు హితం
బులు గాఁగ నిశ్చయ స్థితిఁ | దలఁచి యనుష్ఠింప బుద్ధి దలకొను నేనిన్‌.
102
సీ. బ్రాహ్మణభక్తియుఁ, బరహిత శక్తియు | నిర్మల మతియును, నీతి రతియు,
సత్యభాషణమును, సాధుపోషణమును | జిరవితరణమును, సేవ్యగుణము,
సన్మార్గరక్షయు, నున్మత్తశిక్షయు | నంచితోదయముఁ, గృపాతిశయము,
బంధు సంప్రీతియు, భవ్య విభూతియు | శాస్త్రోపగమము, నస్ఖలితదమము
 
తే. సజ్జన స్తవనీయ సౌజన్యములును | ధర్మసంచిత బహు ధన ధాన్యములును
గలుగు నక్షీణ పుణ్యదోహలుఁడు ధర్మ | సూనుఁ డున్న దేశంబున మానవులకు.
103
క. మఱియును నొక్క విశేషం | బెఱిఁగించెద; నతని యున్న యెడ గోధనముల్‌
మెఱుఁగెక్కి పాఁడి నేమిం | గొఱఁతవడక యుండఁజేఁపి కురియుచు నుండున్‌
104
వ. కావున నిట్టి దేశం బిప్పు డెయ్యది యగు నందుఁ గుంతీ తనయుల నరయం బనుపవలయు’ ననినఁ గృపాచార్యుం డిట్లనియె. 105
క. ‘అరయఁగ నయ్యెడు తెఱఁగుల | నరయుట కార్యంబు; వారి నాలస్యము లే
కరయునది; పెక్కు భంగుల | నరసినఁ దోఁచెదరుగాక! యది యట్లుండెన్‌.
106
ఉ. వారలు పూనినట్ల వనవాసము సల్పిరి, వీరు వేచి త
మ్మారయఁగా బయల్పడని యట్లుగ నుండెడు వత్సరంబునుం
జేరువ చేరువల్‌ గడచెఁ; జిత్తములుం గలుషంబు లమ్మహా
వీరుల కీ నృపాలునెడ, వీరికి నూరక యున్కి గర్జమే?
107
క. అలుచైనను బగతుని దెసఁ | దలఁపు గలుగవలయుననిన, దర్పోజ్జ్వల దో
ర్బలు లగు కౌంతేయుల మన | మెలమి కలిమి నచ్చి యిట్టు లేమఱ నగునే?
108
చ. మన బలమెంత యంతయు సమగ్ర సముద్యమ దుర్ధరంబుగా
మును మును గూర్చి, తోడుపడు మూఁకలకుం దగుమైఁ గ్రమ క్రమం
బున నెఱిఁగించి రాఁబనిచి, భూరి సముజ్జ్వల సైన్య జృంభణం
బున వెరవొంది యున్కి కురుభూపతి కిప్పటికార్య మారయన్‌.
109
ఆ. పాండురాజసుతులు బాసమై నడవడి | గడచి కయ్యమునకుఁ గాలుద్రవ్వ
కున్న యట్టులైన నన్నరనాథుతో | సంధిసేయు టొప్పు సముచితముగ.
110
క. ఏచి చలంబున నొంటికిఁ | జూచిన, నప్పటికి మనకుఁ జూడం గార్యం
బే చందంబునఁ దెఱఁగగు | నా చాలుట కోర్వవలయు; నది యట్లుండెన్‌.
111
క. వారలు లేరట పో, పెఱ | వారలఁ దగు భంగి మనకు వశ్యులఁ జేయన్‌
భూరి బలయుతుల మగుటయుఁ | గారణమను టనుమతంబు గాదే మనకున్‌.’
112
తే. ఇవ్విధంబునఁ దమ తమ యెఱుఁగు తెఱఁగు | లందఱును జెప్ప విని కురునందనుండు
దగ విచారించి కార్యంబు తెగువ గాంచి | యెలమి వారలఁ గనుఁగొని యిట్టు లనియె.
113
ఆ. ‘సింహబలుఁడు భీమసేనుండు శల్యుండు | హలధరుఁడు సమాన బలమువార,
లొండొరులను గెలుచు నుత్సాహమును గల | రుద్ధతులును బాహుయుద్ధపరులు.
114
క. ఈ నలువుర భుజశక్తుల | తో నెనయఁగఁజాలునట్టి దోర్బల మెందుం
గానము కావున వీరల | లోనన యొండొరుల కని గెలుపు సమకూరున్‌.
115
ఉ. తక్కినవార లాతనికి దవ్వుల చోటులవారు; వాయుజుం
డొక్కఁడ యింక సింహబలు నుద్ధతి మాన్చిన మాన్చువాఁ; డతం
డక్కడ నిల్చెఁ గావలయు; నాసతి ద్రౌపది గాఁగ నోపు; వే
ఱొక్కరుఁ డాజిఁ గీచకుల నోర్వఁగఁ జాలమి మీ రెఱుంగరే?
116
క. గంధర్వు లను నెపంబున | నంధతమసగూఢవృత్తి ననిలసుతుఁడు గ
ర్వాంధమతియైన సూతు స | బాంధవముగఁ జంపెఁ గాక, పరులకు వశమే?
117
వ. పితామహుం డుపదేశించిన లక్షణంబు లద్దేశంబున గలిగి యుండునని విందుము; పాండవులు ప్రచ్ఛన్న వేషంబున విరటు ప్రోల వసియించినవారు గావలయు; నతండును బ్రతిభటుం డయి భంగించుచుండుం; గావున నతని పయి నెత్తిపోయి తదీయ గోధనంబుల గ్రహించిన ధర్మతనయుండును దమ్ములు నడ్డపడం బఱతెంతు; రయ్యవసరంబున మనము సమయ భంగంబు చెప్పి వారలం గ్రమ్మఱఁ బండ్రెండు వత్పరంబులు వనవాసంబు సలుపంబుత్త; మట్లైన నప్రతిహతంబుగాఁ జితురంతభూచక్రం బాక్రమించి కీర్తనీయులమై వర్తిల్లుదుము; కుంతీనందను లందులేక తక్కిన మత్స్యపతి సమస్త వస్తువులను జూఱగొంద; మదియును లాభంబ; యెల్లభంగుల నిప్పటి కిదియె కార్యంబు; మీకు నందఱకుం జూడఁబోలునేని దీని కనురూపం బగు నుద్యోగంబు సేయుం ‘డనినఁ ద్రిగర్తాధీశ్వరుండగు సుశర్మ తొలుతఁ గర్ణ దుశ్శాసనులతోఁ గొండొక ప్రసంగించి వారల యనుమతి నవనీపతితో నిట్లనియె. 118
క. ‘కేకయ సాల్వులు తోడుగ | నా కీచకుఁ డాజి నన్ను నపజితుఁ జేసెం;
జాకుండమున్న యొకపరి | నా కాతని తోడ భండనము లేదయ్యెన్‌.
119
ఉ. భంగముతోడ నున్న ననుఁ బంపు విరాటునిమీఁద; భూమికిం
జెంగట నుండు నా దయిన జీతపు టూళ్ళును; సంతతంబు వా
నిం గడు గాసిసేయు నతనిం జెఱుపం దఱి యయ్యె; ముట్టి స
ప్తాంగముఁ జూఱఁదెచ్చెద నహంకృతి యెల్ల నడంచి వచ్చెదన్‌.
120
ఆ. ఉద్దవిడిన పసుల నూఁచముట్టుగఁ దెత్తు | నతఁడు వెనుకవచ్చి యడ్డుపడిన
చోటఁ బాండురాజు సూనుల నరయుదు | నెల్ల భంగి దీని కేన తగుదు.’
121
వ. అనవుడుఁ గర్ణుం డిట్లనియె. 122
క. ‘బరవసముమైఁ ద్రిగర్తే | శ్వరుఁ డిట్లను టుచిత; మింక జననాయకుఁ డె
ప్పరుసున నానతి యిచ్చెను | దొర లేమని రట్లచేయఁ దుదిఁ గార్య మగున్‌.’
123
చ. అను నినసూనుమాట విని యందఱఁ గన్గొని పెద్దలెల్ల ని
న్ననుమతిసేయ సైన్యముల నన్నిటిఁ బన్నఁగఁ బంపు; రెండుమై
ల నడత; మీ త్రిగర్తుల బలంబుల ముందటఁ బంచి, వానిపో
యిన మఱునాఁడు పోద’ మనియెం గురునాథుఁడు దుస్ససేనుతోన్‌.
124
చ. అనుటయు ఫాలభాగ కలితాంజలియై యతఁ ‘డట్ల చేయువాఁ
డ‘ ననిన, మేదినీశుఁడు దృఢం బగు నిశ్చయ మెల్లవారుఁ గై
కొనుటకుఁ గార్య బోధమునకుం దగఁ జుట్టుల నున్న వారలం
గనుఁగొని యాదరాధిక సగౌరవ భావనతోడ నిట్లనున్‌.
125
ఉ. ‘మున్ను సుశర్మ దాను బలముం జని గోవులఁ బట్టుఁ; బట్టినన్‌
వెన్నడి వచ్చు మత్స్య పృథివీపతి సేనల నెల్లఁ గొంచు శౌ
ర్యోన్నతి సూపువాఁడయి; సముద్ధతిమై నిట వేఱ కౌరవుల్‌
కొన్నిటిఁ బట్టఁ గయ్యమునకుం బఱతెంతురు పాండునందనుల్‌.
126
ఉ. కందువ సెప్పి యొక్కెడఁ ద్రిగర్తులు దాడికిఁ గూడువారు; మీ
రందఱు వేఱ యొక్కయెడ నాజికి సేనల గూర్పుఁ; డెల్ల వాఁ
డుం దనవారిఁ దోకొని కడున్‌ రభసంబునఁ గూడి వార్తకున్‌
ముందఱఁబోయి గోధనము ముట్టుకొనన్‌ వలయున్‌ మహోగ్రతన్‌.’
127
వ. అని చెప్పి వెండియు సుశర్మం జూపి. 128
క. ‘బహుళాష్టమి నీతఁడు స | న్నహనముతోఁ బసులఁ బట్టు, నవమిని మన గో
గ్రహణ’మని నిశ్చయించిన | నహికేతను పలుకులకు మహాహ్లాదమునన్‌.
129
వ. సమస్త పరిజనంబులును సముద్యుక్తులై; రట్టి సమయంబున. 130
ఆ. పాండురాజసుతులుఁ బాంచాలియును దమ్ము | నొరు లెఱుంగకుండఁ దిరుగవలయు
దుష్కరంపుటేఁడు దుదిసేరఁబాఱె, నె | వ్వరును దీనిఁ దలఁప వలను లేర.
131
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )