ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
సుశర్మ దక్షిణ గోగ్రహణంబు చేయుట (సం. 4-20-27)
వ. సుశర్మయు నేలినవాని పనిఁ బూని జోడు పక్కెర కైదువు బిరుదు రవణంబు మొదలైన సవరణంబులం జూడ నక్కజంబుగాఁ గూడి, పరదేశం బాపోశనంబు గొనం దమకించు తన బలంబుల గజిబిజి యుడిపికొని, గోగణంబుల యగపా టూహించి, జతనంబుతో నడచుచుండియు వెసఁ గుందక వేగిరంపుఁ బయనంబు లయ్యును బ్రజల నోలాకుపడనీక, యెత్తెడుచోట్లను విడిదలల యందును లోనుగా నిస్సాణాదులైన యుద్భట చిహ్నంబులు ప్రకటింపక దాడిమెయిం జని, వేగులవారివలన విరాటు తొఱ్ఱులున్న యెడ యెఱింగి, గ్రద్దనం
గదుపులఁ గార్చిచ్చు చందంబునం బొదివి వెలిచిన.
132
శా. కూడంబాఱి సముద్ధతిం గడఁగి తద్గోపాలకుల్‌ మూఁక ల
ల్లాడం దాఁకి, నిశాతసాయక పటు వ్యాపార ఘోరంబుగా
నీడం బోక పెనంగినం గని, త్రిగర్తేశుండు చే వీచుడుం
గ్రీడాఘాత నిరూఢి నాశ్వికులు వారిం దున్మి తూఁటాడినన్‌.
133
వ. వారలలోన. 134
చ. అసదుగఁ దాఁకి మేనఁ దఱచై పొరి నెత్తురు గ్రమ్ము పోటులన్‌
వస మఱి తూలుచుండియును వారని భీతిఁ బదంబులం గడున్‌
వెస కలిమిం బురంబునకు వేగమె కొందఱు పాఱి, మత్స్యనా
థు సభకు నేఁగి, దీనదశతోఁ బ్రణమిల్లుచు నార్తమూర్తులై.
135
క. కారణ మెయ్యది యగు నొకొ! | వీరల దురవస్థ కనుచు వెఱఁగందెడు నా
భూరమణుఁడు సభయును విన | నీరెలుఁగు దలంకఁ బల్కి రిట్లని గోపుల్‌.
136
చ. ‘హయ రథ దంతి సంతతి నిరంతర దుర్దమలీలఁ బేర్చి నే
ల యవిసి మూఁగినట్లగుబలంబులతోడఁ ద్రిగర్తు లెంతయున్‌
రయమున గోవులం బొదివి, రక్షకు లొక్కట నార్చి తాఁకినన్‌
భయదమహాస్త్ర శస్త్ర పటుపాత పరంపరఁ దున్మి యుద్ధతిన్‌.
137
క. గోవులకు వెనుక యై వెసఁ | బోవుచునున్నారు; కడవఁబోవక యుండం
బోవలయు నడ్డపడియెడు | దీవసమెదఁ గలిగెనేని దేవర! కడఁకన్‌.’
138
వ. అనిన విని విరాటుం డదరిపడి. 139
శా. ‘ఏమీ నిక్కమె! మున్నెఱుంగఁడె త్రిగర్తేశుండు? మద్గోధన
స్తోమంబుం గొనిపోవు తెంపునకు నుద్యోగించెనే? మేలుమే;
లామై తోడనె పోవుఁగాక!’ యని వీరాలాపముల్‌ వల్కి యు
ద్దామ క్రోధ శిఖాకలాప వికటోద్య ద్భ్రూకుటి స్ఫూర్తియై.
140
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )