ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
విరటుఁడు సుశర్మమీఁద యుద్ధం చేయఁబోవుట (సం. 4-30-8)
చ. సచివులఁ జూచి ‘యిప్పుడ వెసన్‌ మన మెయ్దక తక్కినం బశు
ప్రచయము తప్పిపోవుఁ; దుది భంగము సేఁగియు వచ్చుఁగాక మీ
రుచిత విధాన సత్వరత నుద్ధతయోధ సమగ్రవాహినీ
ప్రచలిత భూమి భాగముగఁ బన్నఁగఁ బంపుఁడు దండనాథులన్‌.’
141
వ. అని నియోగించి. 142
శా. యాన ప్రక్రమ సూచకంబు లగు తూర్యంబుల్‌ దిశాపాటన
ధ్వానస్వైరవిహార కల్పిత సముద్ర క్షోభముల్‌గా ధరి
త్రీ నాథుండు రణోచితోద్యమము సంధిల్లంగ శస్త్రా స్త్రవ
ర్మానీతిక్రమ దక్షులం బనిచె నయ్యై వారికిం గ్రక్కునన్‌.
143
ఉ. సారథిఁ జూచి ‘నీవు రభసంబునఁ బూన్పుము ఘోటకంబులం
దేరఁ; దదీయ వర్మము లతిస్ఫుట బంధముఁగాఁగ బెట్టు; నీ
వీరవచోవిలాసములు విందుము ము; న్ని దె వచ్చెఁ గయ్య; మే
పారఁగఁ జూపు నీ దగు నహంకృతికిం దగు ధైర్య మియ్యెడన్‌.’
144
వ. అని పనిచి తానును యోధవీరోచిత ప్రకారంబున సింగారంబు సత్వరంబుగాఁ జేసికొని ఖచిత కాంచన బిందు సందోహంబగు సన్నాహంబు వెట్టికొని, విరచితాలంకార చక్రంబును బద్ధపరికర కూబరాక్షయుగాద్యవయవంబును బ్రతికల్పిత తురంగంబును సన్నివేశిత వివిధాయుధంబును సన్నద్ధ సారథికంబును నైన రథంబెక్కి గోగణ హరణ ప్రదేశంబు పశు పాలకులం దెలియ నడుగుచు వెడలునప్పు డమ్మత్స్యపతి యనుజన్ముండు. 145
శా. లోకస్తుత్య విభూతి నన్యపృతాలుంటాక బాహా బల
శ్రీకల్మిన్‌ రథ దంతి ఘోటక భటశ్రేణీ సముద్దాంత సే
నా కల్పధ్వజ విభ్రమంబున సుహృద్య ప్రోద్యముండై శతా
నీకుం దుద్ధతి నేఁగుదెంచె నఖిలానీకంబు నుప్పొంగఁగన్‌.
146
ఉ. ఆతని తమ్ముఁడైన మదిరాశ్వుడు కర్ణ ఝళంఝళా సము
ద్ధూత బలోత్థరేణు పరిధూసరితాంబరమైన వారణ
వ్రాతము గొల్చి రాఁ గడఁగి వచ్చె సముజ్జ్వల హేమవర్మని
ర్యాత రుచిచ్ఛటా పటల రంజిత హేతి మహోగ్ర సైన్యుఁడై.
147
తే. అతని యనుజుండు సూర్యదత్తాహ్వయుండు | సమద సైనిక నానాస్త్ర శస్త్ర బహుళ
దీప్తిజాలక ప్రతిహత దినకరాంశు | రాజియై చనుదెంచె సంరంభ మెసఁగ.
148
ఉ. తెల్లని జోడు పెట్టుకొని తీవ్రగతిం జనుదెంచె మత్స్య భూ
వల్లభు నగ్ర నందనుఁడు వైరి మదాపహ విక్రమ ప్రకా
రోల్లసితుండు వన్యబల ముద్ధతిఁ గొల్చు మృగేంద్రురేఖ శో
భిల్లుచు నుండ శంఖుఁడు విభీషణ శంఖనినాద మొప్పఁగన్‌.
149
వ. మఱియు ననేక యోధవీరులు వివిధ వాహనారూఢులై గాఢసన్నాహంబులగు నిజవ్యూహంబులతో నేతెంచు చుండిరి; విరాటుండు బలంబులం గూర్చికొను తలంపునం బురబహిరంగణంబునం గొండొకసేపు నిలిచె; నట్టి సమయంబున ధర్మతనయుం డనిలతనయ మాద్రీతనయుల ‘నంతంతం బొడసూపి నిలువుం’డని నిపుణంబుగా నియోగించి, తానును మత్స్యమహీవల్లభు నల్లనఁజేరి యిట్లనియె. 150
చ. ‘ఒక ఋషిచేత నాయుధ సముత్కర మెల్లను సప్రయోగమం
త్రకముగ నభ్యసించి సమరంబునకుం గొఱయైనవాఁడ; గో
ప్రకరములన్‌ మరల్చుటకు బంధులు నీవును బోవ నాకు నిం
టికడన యున్కిపాడియె? ఘటింపఁగఁ బంపు రథంబు సయ్యనన్‌.’
151
క. అనిన విని యియ్యకొను న | మ్మనుజాధీశ్వరునితోడ మఱియు నతం డి
ట్లనుఁ, బవనతనయుఁ గవలం | గొని సమరంబునకుఁ బోవఁ గోరెడు మదితోన్‌.
152
సీ. ‘మన వలలుండు లావున బంటుతనమున | జను లెఱుంగఁగ సడిసన్నవాఁడు;
మంచిమగండు దామగ్రంథి యసమసం | గ్రామకేళీ గాఢ కౌతుకుండు,
వినుము, తంత్రీపాలుఁడును దుర్దమారాతి | మర్దనచాతుర్య మహిత భుజుఁడు;
మున్నును వీరలు మువ్వుర కడఁకల | కొలఁదు లే నెఱుఁగుదుఁ గొంతకొంత;
 
తే. యెక్కఁదగునట్టి యరదంబు లిచ్చి వీరి | ననికిఁ దోకొనిపోక కార్యంబు నాకుఁ
జూడ!’ ననవుడు మేదినీశుండు హర్ష | నిర్భరాత్మకుఁ డై శతానీకుఁ జూచి.
153
వ. కంక వలల దామగ్రంథి తంత్రీపాలురం జూపి యిట్లనియె. 154
మ. ‘రథముల్‌ మంచివి గాఁగ నాలు గతిశీఘ్రవ్యాప్తి సత్త్వంబులం
బ్రథితంబైన తురంగమోత్కరము సంగ్రామర్హ చాపంబు ల
శ్లథవర్మంబులు వీరికిమ్ము; రణలీలాదక్షతన్‌ మన్మనో
రథముం దీర్పఁగ వీర లోపుదురు దోర్గర్వం బఖర్వంబుగన్‌.’
155
వ. అనిన నతం’డట్ల చేయుదు’నని వారలం దోడ్కొని చని సమస్తంబును సన్నద్ధంబు గావించి, యంగరాగ మాల్యాంబరాభరణంబుల నలంకృతులం జేసినం గైకొని, తమయంతవట్టునుం గూడుకొని సూతకృత్యంబులకుం దార చాలి, రథంబులు దోలికొని చనుదెంచిరి; తదనంతరంబ. 156
సీ. గంధ దంతావళ కర్ణమారుతహతిఁ | గాంతారములు చాఁపకట్టువడఁగ,
రథ ఘోషమునఁ బ్రతిరవమిచ్చునద్రులు | భయమున వాపోవు భంగి నుండఁ,
దురగ ఖురోద్ధూత ధూళి దన్బెరసిన | వననిధి పిండలివండు గాఁగ,
బహుళపదాతి దుర్భరభార మడరిన | నురగకూర్మంబు లొండొదంటిఁ బొంద
 
తే. సైన్యముల నడిపించె నుత్సాహలీల | యతిశయిల్లంగ సంరంభ మగ్గలింప
బరవసము మిక్కుటంబుగఁ బసులు సన్న | జాడఁ గై కొని యమ్మత్స్యజనవిభుండు.
157
వ. ఇట్లు చని కూడముట్టిన. 158
క. విరటు బలంబుఁ ద్రిగర్తే | శ్వరు బలముం జెలఁగ నార్చి వడిఁ దాఁకె భయం
కరనాద మేదురములగు | శరనిధు లొండొంటిఁ దాఁకుచందం బమరన్‌.
159
మ. గుణరావంబుఁ గృపాణ ఘట్టన రవక్షోభంబునుం, గింకిణీ
క్వణన వ్యావృత హేషితస్వనములున్‌, ఘంటా నినాదాత్త పో
షణ నానాపటు బృంహిత ధ్వనియు, శశ్వద్గాఢమై పేర్చినన్‌
రణనం బించుక దోఁప లేద బహుతూర్యశ్రేణి నా సేనలన్‌.
160
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )