ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
విరాట సుశర్మల సైన్యంబు సంకులంబుగాఁ బోరుట (సం. 4-31-1)
వ. అట్టి సమయంబున. 161
సీ. ఒండొంటితోఁ దాఁకి మండెడునవియును, | జిందముల్‌ పొడిపొడి సేయు నవియు.
గట్టి మైమఱువులు దట్టముల్‌ గావించు | నవియును, నెఱను నోనాడునవియు,
నెట్టుపైఁ బడి మేని నెగయించునవియును | దల నేల డొల్లంగఁ దాఁకు నవియు,
నిరుమెయిఁ దొలిచి బె ట్టిలఁ దూఱు నవియును, | నలువుర నేవుర నాఁటు నవియు.
 
తే. నైన శరములు గనుఁగొని యాడి యాడి | నారదుఁడు పిచ్చలింపంగ వీరకేళి
సలిపె నుద్ధతిమై ధనుర్బలము లడరి | లావు వెరవును నెఱయఁ జలంబు మెఱయ.
162
వ. అప్పుడు సుభటులు గడంగి. 163
ఉ. ఏటుల మ్రొగ్గువారిఁగని యించుక కొంకక యర్ము పెంపునం
బోటుల వాతఁ బోవు భటపుంగవులన్‌ మది మెచ్చుచున్‌ వడిన్‌
వ్రేటులఁ గ్రీడ సల్పి, పృథివిం బడు వీరులఁ ద్రొక్కి కొంచు నె
చ్చోటులనైన నగ్గలికఁ జొత్తురు నెత్తురు వఱ్ఱు సేయుచున్‌.
164
సీ. ఒక్కఁడు పెక్కండ్ర కెక్కిన విచ్చియుఁ | బొదివి చెఱొకపోటు వొడుచు నెడలుఁ,
బలువు రొక్కనిమీఁదఁ బఱపిన సైరించి | నళికి పైఁ బెట్టక నిలుచు నెడలు,
దళము దళంబుతోఁ దాఁకి యగ్గలికమై | నీడఁబోవక వ్రేటులాడునెడలు,
నోహరి సాహరి నుయ్యాలచేరుగా | వెనుకొంచుఁ దెరలుచుఁ బెనఁగునెడలు
 
ఆ. నై యనేకభంగి నాశ్విక సేనలు | బొమ్మ లాడినట్లు పోరుచుండె
నమరగణము సిద్ధ సమితియు వేడుకఁ | జదల నిలిచి చూచి సంస్తుతింప.
165
వ. ఒక్కయెడ. 166
ఉ. ఒండొరు మీఱు కోర్కిమెయి నొక్కట బాసలవారు సొచ్చినన్‌
రెండయి పాయ యిచ్చిన యరిప్రకరంబులు వేఱువేఱ యు
ద్దండ భుజాబలం బలరఁ దాఁకిన సంగడిఁ బాఱుచుండఁగా
గం డమరంగ నిల్చి చెలికాండ్రయి క్రమ్మఱ వత్తు రిద్దఱున్‌.
167
సీ. కరశీకరంబులుఁ గరట గళద్దాన | తోయంబులును ధరాధూళి మ్రింగఁ,
బొడవుల సడిసన్న యొడళులడెక్కియ | మ్ముల పెంపు గగనంబు గొలఁదివెట్ట
బృంహిత ధ్వనులును బృథుల ఘంటావలీ | రవములు దిక్కుల నవులఁద్రోవ
రోషారుణాక్షుల రుచులును సిందూర | కాంతియు రవి దీప్తిఁ గ్రమ్మఱింప
 
తే. జోదు లొక్కట వా లంపసోన గురియ | రౌద్ర రస మాకృతులఁ దాల్చి రణ మొనర్చు
కరణి నత్యుగ్రముగఁ గరి ఘటలు గడఁగి | కలను పీనుంగు పెంటగాఁ గలయ బెరసె.
168
ఉ. అక్కజమైన శౌర్యమును నద్భుత సంపద నొందు శక్తులుం
జిక్కని మేనులున్‌ మొనకుఁ జెల్వగు కైదువులుం దగంగ ను
క్కెక్కిన యట్టి మేటి మగ లించుక వారణలేక ఖేచరు
ల్వెక్కస మంద నొచ్చియుఁ జలింపక పోరిరి పెక్కు భంగులన్‌.
169
సీ. నొగనొగతోఁ దాఁకి పగులంగ నరదంబుఁ | బఱపి యా తేరిపై కుఱుకువారు.
రథ్యముల్‌ వడ్డ విరథులయ్యు నసి ముద్గ | రాదుల నడరి పోరాడువారు,
సారథి నొచ్చినఁ దేరును గడపుచు | నేయుచుఁ గయ్యంబు సేయువారు,
నరదంబుపైవ్రాలి యాలోన దెలిసి త | న్నేసినాతనిఁ బడ నేయువారు
 
తే. నగుచు రథికనికాయంబు లడరి యప్ర | మత్త నిజచిత్తవృత్తులై మగతనంబు
ఘోరమూర్తులు గైకొని పోరునట్లు | సలిపె సంగ్రామకేళి సంకులముగాఁగ
170
వ. ఇ ట్లిరువాఁగును నరవాయి గొనక పెనంగుచుండ. 171
ఉ. భీకరబాణ వర్షముల పెల్లున వైరులు పెల్లగిల్ల మౌ
ర్వీకృత గర్జితంబు పృథివీ వియదంతరమెల్ల నిండ ను
గ్రాకృతి కల్ప సంక్షయ మహాభ్రముచందము నొందుచున్‌ శతా
నీకుఁడు దాఁకెఁ గంకటమణిద్యుతి విద్యుదుపాంతకాంతియై.
172
తే. అతఁడు నానాప్రకార శస్త్రాస్త్ర నిహతి | నతుల విక్రమ విభవ మనర్గళముగ
యోధసారథి యుగ్యసంయుతము గాఁగ | నూఱు రథములు వ్రేల్మిడి నుగ్గుచేసె.
173
మ. మదిరాశ్వుండు కడంగి యన్నకు బలోన్మాదంబు రెట్టింప స
ప్రదర జ్యా లతికాక్రియా సమభిహారక్రీడనం బప్పు డొ
ప్పిదమై యోగ వియోగ సంధులు నిరూపింపంగరాకుండఁ గ
ర్ణ దళోపాంతము వింతసేయ నడరెన్‌ రౌద్రంబు శోభిల్లఁగన్‌.
174
క. అడరివడి రథచతుశ్శతి | పొడిసేసి, పరాక్రమం బపూర్వంబై యే
ర్పడఁ గరిహయ నరనికరము | బడలుపడం దఱిమె నలి నభశ్చరు లార్వన్‌.
175
ఉ. మండలచారియై రథ మమానుషవిక్రమలీల నొప్ప ను
ద్దండ భుజాబలంబు ప్రథితంబుగ నత్తఱిఁ దాఁకి సూర్యద
త్తుం డనివార్య శౌర్యగుణ ధుర్యుఁడు వీఁడ యనంగఁ బేర్చి వే
దండ ఘటావిపాటనవిదగ్ధతఁ బొల్చె రణాంగణంబునన్‌.
176
ఉ. అప్పుడు శంఖుఁ డెంతయుఁ బ్రియంబునఁ బెండ్లికిఁ బోవునట్లు మో
మొప్పఁగ నస్త్రశస్త్రముల యుల్లసనంబున శత్రునేత్రముల్‌
కప్పఁగఁ జీఁకటుల్‌ రణముఖంబు సమస్తముఁ దానయై రథం
బుప్పర వీథిఁ దోలికొని యుగ్రగతిం బఱతెంచి తాఁకినన్‌.
177
తే. మందరాచల చటుల విమర్దనమున | ఘూర్ణమానమై గాఢ సంక్షోభ మెసఁగఁ
దలఁకు జలనిధి నాఁ ద్రిగర్తక్షితీశు | బలము తిరుగుడువడియె సంకులముగాఁగ.
178
వ. అయ్యవసరంబునం దక్కిన దొరలును దలపడి యతిభీమంబుగా సంగ్రామంబు సేయం దొడంగిన. 179
చ. అనుజ తనూజ మంత్రి సుభటాప్తజనంబుల పోరు చూచి నె
మ్మనమునఁ బొంగి మై పెనిచి మత్స్యమహీరమణుండు సారథిం
గనుఁగొని ‘యల్ల కంటె మొనఁ గ్రాలుచునున్న త్రిగర్తనాథు కే
తనమున చక్కటిన్‌ మన రథంబు వెసం జన నిమ్ము’ నావుడున్‌.
180
క. అగ్గలిక నతఁడు హయముల | పగ్గంబులు సడల విడిచి పటురయమున నా
మొగ్గరము దఱియఁ బఱపిన | మ్రగ్గెను రథపంచశతము మత్స్యాధిపుచేన్‌.
181
మ. అవనీనాయకుఁ జూచి యేచి నలి వీరావేశ దుర్దాంతమై
కవిసెం గుంత భుశుండి తోమర గదా ఖడ్గాది శస్త్రాస్త్ర తీ
వ్ర విహారంబు విరోధి దుర్విషహ సంరంభంబుగా నొక్క పె
ట్ట వడిం దద్బల మెల్ల నారదుఁడు వేడ్కం గుంచె సారింపఁగన్‌.
182
వ. ఇవ్విధంబున విరాటుండు తానును సేనయుం జేయం గలవారును, బరవసంబు సేసి యొక్కుమ్మడి నడరుటయుం, దెరలి మరలిన నిజసైన్యంబు దైన్యంబు గలయం గనుంగొని, కోపాటోపంబునం గెంపుగదురు లోచనంబులుం బెంపొలయు భుజశిఖరంబులుం గలిగి తానుం దమ్ముండును సంగడంబుగాఁ గోల్తలసేసి రథసమూహంబుతో విరాటవ్యూహంబు నెదురుకొని. 183
క. బలవిక్రమములు మెఱయఁగఁ | దలపడి రథ దంతి హయ పదాతి చయంబుల్‌
కలను సుడివడఁగఁ దామర | కొల నేనుఁగు సొచ్చినట్లు గురువుగఁ జొచ్చెన్‌.
184
ఉ. ఏలినవానిఁ గాంచి, మొనలెల్లను నెంతయు దర్ప మెక్కి యా
భీల నిశాత హేతిరుచి భీకరలీల నెదిర్చి, మత్స్య భూ
పాలక సైన్యరాజిఁ దలపడ్డ మహోగ్రతఁ బేర్చి, యా సమి
త్కేళి వియచ్చర ప్రతతికిన్‌ వెఱఁగందఁగఁ జేసె నెంతయున్‌.
185
తే. కడిమి మెఱయంగఁ బోరు త్రిగర్తనాథు | రథముఁ గనుఁగొని కడఁగి విరాటవిభుఁడు
వరవునకు నల్గినట్టుల సరకుగొనక | యతుల రభసాతిరేకత నతనిఁ దాఁకె.
186
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )