ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
విరాటుఁడు సుశర్మమీఁదఁ దన రథంబు తోలించి పోరుట (సం. 4-31-17)
వ. ఇట్లు దలపడి. 187
మ. పటువేగంబగు శాతభల్లచయ సంపాతంబునన్‌ మింట మి
క్కుటమై మంట ధగద్ధగద్ధగ యనం గోపంబు రూపంబులై
చటులక్రీడఁ జరించు న ట్లిరువురున్‌ శౌర్యోన్నతిం బోరి రు
త్కట దర్పోద్ధతులై పరస్పర జయాకాంక్షం బ్రచండంబుగన్‌.
188
క. తదవసరంబున నొక్కటఁ | బది యమ్ములు తొడి త్రిగర్తపతి వక్షంబున్‌
వదనంబు నేసి విరటుఁడు | మదమునఁ దురగములనేసె మఱియుఁ బదింటన్‌.
189
క. ఇంచుకయు నీడఁబోవక | కాంచన పుంఖప్రకాండ కాంతి స్ఫాయ
త్పంచాశద్బాణంబులు | నించె నతఁడు మత్స్య మేదినీపతి మేనన్‌.
190
తే. దొరలు తలపడ్డ నాహవదోహలమున | నుభయ బలములుఁ దమకించి యోర్వలేక
కలయబెరసి భూ రేణువు కతన రాత్రి | గాకమున్న యొండొరువులఁ గానరైరి.
191
క. క్షతములఁ బెల్లు తొరఁగు శో | ణితము రజఃపటల మడఁచి నెఱపిన నరుణ
ద్యుతిఁ దమము వాపు వేకువ | గతిఁ దత్సమయం బతి ప్రకాశత నొప్పెన్‌.
192
ఉ. దానికిఁ జిత్తవృత్తులు ముదంబునఁ బొందఁగ, మేను లుబ్బఁగా
సేనలు రెండు నుద్భట విజృంభణతన్‌ వివిధాస్త్ర ఘట్టన
ధ్వానము దిక్కులం బరఁగఁ దాఁకి రణం బొనరించె; నత్తఱిన్‌
భానుఁడు పశ్చిమాద్రిఁ గనుపట్టెఁ దలిర్చిన మావిమో కనన్‌.
193
క. సమరంబున భటులు కడున్‌ | శ్రమమొందిరి, తమము గవిసినంగాని సము
ద్యమ సంరంభ ముడుగ, రిది | సమయం బని తొలఁగినట్లు సవితృఁడు గ్రుంకెన్‌.
194
వ. తదనంతరంబ. 195
క. ముఱిముఱి చీఁకటియప్పుడు | నఱిముఱి భటు లుడుగ కడరి యని సేయంగా
నెఱసి తమ మెల్లయెడఁ గ్రి | క్కిఱిసిన మఱి పాసి నిలిచి రింతను నంతన్‌.
196
వ. ఇట్లుభయ సైనికులు సాంద్ర సంతమసంబునం జేయునది లేక సంగ్రామంబు దక్కి తమకం బెక్క నొక్కింత సే పూరకున్నంత. 197
క. తన మనుమలు పాండుతనయు | లనిసేఁతకు వేడ్కసేయు టాత్మఁ గని తమం
బున వారు మెఱయ రని వ | చ్చిన క్రియ శశి పూర్వశైలశిఖరం బెక్కెన్‌.
198
క. వెలుఁగు గని కడఁగి యిరువాఁ | గులుఁ బోరికిఁ జొచ్చె; మత్స్య కుంజరుఁడును న
గ్గలమగు మగఁటిమి సొంపునఁ | దలపడియె సుశర్మతోడఁ దదనుజు తోడన్‌.
199
చ. తలపడి పోర వారి యరదంబు లనేకము లొక్క పెట్ట యి
ట్టలపు రయంబునం బొదివి డాసెఁ గడంగి వడిం ద్రిగర్తనా
థులు నిరుతేరుఁ దద్రథముతోఁ గదియించి తదీయ సారథిన్‌
బలువిడిఁ గూల్చి రథ్యముల ప్రాణములుం గొని రుగ్రమూర్తులై.
200
వ. ఇవ్విధంబున విరాటుండు విరథుం డగుటయు. 201
చ. అతిరభసంబుమై నడరి యాతనిఁబట్టి, సుశర్మ పెల్చ నా
ర్చి తన రథంబుపై నిడి, యశేష బలంబులు నల్దెసన్‌ భయ
ద్రుతగతిఁ బాఱినన్‌ విజయదుందుభు లొక్కట మ్రోయ విక్రమో
ద్ధతి విభవంబునన్‌ మది ముదం బొలయన్‌ మరలెన్‌ మహోద్ధతిన్‌.
202
వ. అట్టియెడ ధర్మతనయుం డనిలనందను నవలోకించి సత్వరంబగు చిత్తంబుతో మత్స్యవిభుని వలను సూపుచు నిట్లనియె. 203
తే. ‘ఇతని యాశ్రయమున మనమెల్ల బ్రదికి | యున్నవారము గావున నుగ్ర రిపుల
పాలువడకుండ విడిపింపఁ బాడి యితని | నెయిదు మెయిదుము రథరయ మెసకమెసఁగ.
204
చ. అనవుడు మేను పెంచుచు మహాబలనందనుఁ డప్పు డన్న కి
ట్లను ‘నిదె సాలవృక్షము; రయంబున దీన నరాతిసేన డొ
ల్ల నడిచి, యీ సుశర్ముని బలంబుఁ జలంబును మాన్పి, యవ్విరా
టుని విడిపించెదన్‌ రణపటుత్వము వైరులు పిచ్చలింపఁగన్‌.
205
తే. నీవుఁ దమ్ములు నొక్కెడ నిలిచి చూచు | చుండుఁ ‘డని పల్కుటయుఁ బుయిలోట తోడఁ
గీచకారాతిఁ దప్పకచూచి నగుచు | నతని కిట్లని చెప్పె ధర్మాత్మజుండు.
206
క. ‘తరువు వెసఁ బెఱికికొని నీ | వురవడిమైఁ గవిసితేని నుభయబలము న
చ్చెరువందుచుఁ జూచి వృకో | దరుఁడ వగుట యెఱుఁగకున్నె! తద్విధ మేలా?
207
వ. కవలు నీకుఁ జక్రరక్షకులుగా లోకసామాన్యంబులైన చాప కృపాణ గదాదులగు నాయుధంబుల విరోధివధం బాపాదించి వేవేగ విరాటు విడిపింపుము.’ 208
చ. అను పలు కంకుశంబున క్రియం గుదియించిన నిల్చి, భూరుహం
బున దెస వోక, మత్తగజపుంగవు చందమునన్‌ సమీరనం
దనుఁడు శరీర దోలన విధా పరిశోభిత విక్రమోద్యమం
బున విలసిల్లి యిట్టు లను భ్రూకుటి ఫాల మలంకరింపఁగన్‌.
209
క. ‘మీ పనిచినట్ల చేసెద | నేపారిన వైరిబలము నెల్లను బాహా
టోపమున నోర్చి మత్స్యమ | హీపతి విడిపించి తెచ్చి యిచ్చెద మీకున్‌’.
210
వ. అనిన విని కౌంతేయాగ్రజుండు సంతసిల్లి తమయంతపట్టునుం గూడుకొని. 211
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )