ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
పాండవులు సుశర్మ నోడించి విరాటుని విడిపించుట (సం. 4-32-26)
తే. తాను మున్నుగ శాత్రవసేనమీఁద | రథము లొక్కటఁ బఱపిరి పృథివి యద్రువ;
నుఱక యేచి త్రిగర్తులు నుద్ధతముగఁ | జెలఁగి మార్కొని పొదివి సంకులముగాఁగ.
212
క. ఏయుచుఁ బొడుచుచు వ్రేయుచు | డాయుచు నుద్వృత్తిఁ దఱుముటయుఁ బొడిసేసెన్‌
వాయుసుతుఁడు రథముల నిరు | వేయిటి రథి రథ్య సూత వితథంబులుగన్‌.
213
తే. ఏడు నూఱు రథంబులనేపు మాపె | నకులుఁ; డప్పుడు మున్నూటి నామ మడఁచె
నతని యనుజుండు; గుంతీసుతాగ్రజుండు | రథిక ముఖ్యుల వేవురఁ బృథివిఁ గూల్చె.
214
వ. అతండు మఱియును. 215
చ. తఱిమి సుశర్మఁ గిట్టి యతి దారుణ భంగి రణంబు సేయ, వాఁ
డుఱక నిశాత సాయకము లొక్క మొగిం బది మేనియందుఁ గ్రి
క్కిఱియఁగఁ జేసి నాలుగిట నేసెఁ దురంగములన్‌; యుధిష్ఠిరుం
డఱిముఱిఁ జంపె సారథిఁ దదశ్వములన్‌ వరబాణపాణియై.
216
వ. అయ్యవసరంబున మత్స్య మహీనాథుండు జనితోత్సాహుండై. 217
ఆ. ఆ సుశర్మ తేరియందున్న ఘనగదా | దండ మెత్తికొని యుదగ్రవృత్తి
జరఠదేహుఁ డయ్యుఁ దరుణ వయస్కున | ట్లవని కుఱికి పోయి యతని వ్రేసె.
218
క. అట్టి సమయమునఁ గరువలి | పట్టి త్రిగర్తేశు రథముపై కుఱికి వెసం
బట్టికొని, యతనిఁ బెడగే | ల్గట్టి పెలుచ నార్చెఁ దద ల్బము పెల్లగిలన్‌.
219
వ. ఇట్లు సుశర్మంబరాజితుం జేసినఁ జక్రరక్షకుండైన శోణాశ్వుండు మొదలుగా నాప్త భృత్య వర్గంబు, ననుజుండైన సుశర్మ లోనైన బంధు జనంబులు నాదిగాఁ గల పరివారంబు పలాయన పరాయణం బగుటయు, వెనుకొని యెయిది గోధనవర్గంబు మరల్చి, కరి తురగ రథంబులం దలమీఱి పొదివి తెచ్చి, యన్నపాలికి వచ్చి తాను మున్ను త్రిగర్తేశు రథంబు కడ నిలువ నియోగించియున్న తమ్ములం గూర్చుకొని, తమ యంతవట్టును నొక్కట విరాటునకుం బొడసూపిన. 220
క. ఆదరము సంభ్రమంబును | మోదంబును దన మనమున ముప్పిరిగొన నా
భూదయితుఁడు వివిధప్రియ | వాదంబుల గారవించె వారల నెల్లన్‌.
221
వ. ఇట్లు సంభావించి పాండవాగ్రజు నవలోకించి. 222
క. ‘మానముఁ బ్రాణముఁ గాచితి | దీనికి సరిగాఁగ నీ మదికిఁ బ్రియ మెసఁగం
గా నాకుఁ జేయనయ్యెడు | దాని నెఱుఁగఁగాన మత్పదము గైకొనవే!
223
తే. ఒడలు సిరియును నాకు నీయొసఁగినవియ | కానఁ దగ సమర్పించెదఁ; గరుణ నీవు
సమ్మతించి యిమ్మత్స్య దేశంబుఁ గావు | పంచి పనిగొని నన్ను రక్షించికొనుము.’
224
వ. అనిన విని యజాతశత్రుం డతని కిట్లనియె. 225
చ. ‘మనుజవరేణ్య! నావలని మన్నన యట్టిదకాదె; శత్రు మ
ర్దన మొనరించి మత్స్య నగరంబున కుత్సవ ముల్లసిల్ల నీ
చనుటయు నాకుఁ దేజమును సంపదయుం గరిమంబుఁగాక, యి
ట్లనఁ దగునయ్య? యే నిచట నైనది యేటిది? యింత యేటికిన్‌?’
226
క. అను పలుకులకును విస్మయ | మును సంతోషమును జిత్తమునఁ బెనఁగొన నా
జనపతి ధర్మతనూభవుఁ | గనుఁగొని యిట్లనియె మఱియు గౌరవ మెసఁగన్‌.
227
క. ‘ఉపకారమొ, బంటుతనమొ | కృపయో, పెంపో. సమగ్ర కీర్తి ప్రియమో,
రిపుదుస్సహమగు నీ రణ | నిపుణతకుం గారణంబు నెయ్యమొ, యెఱుఁగన్‌.
228
ఉ. మంటయుఁ బోని శాత్రవసమాజము నించుక యేని శంకలే
కంటఁగఁ దాఁకి, వెండి తెగటార్చె మహాద్భుతశక్తిశాలి యీ
వంటలవాని చేసిన యవార్య పరాక్రమ మొండుచోటులం
గంటిమె? వింటిమే? యితఁడ కాఁడె వెసన్‌ గెలిపించె న న్ననిన్‌.
229
క. కంధరములు దెగి తలలు వ | సుంధర నతిపక్వ తాల సుభగఫలాళీ
బంధురత రాలు దామ | గ్రంధి పగఱమీఁదఁ గినిసి కవిసిన యెడలన్‌.
230
క. ఎక్కడఁ జూచినఁ దానై | యక్కజమగు కడిమికలిమి నరిసేనఁ గరం
బుక్కఱఁ దంత్రీపాలుం | డొక్కఁడ పొలియించె నీ రణోత్సాహమునన్‌.
231
క. ఈ నలువురు తక్కఁగ మన | సేనల నొక్కరునినైనఁ జేడ్పడని భటుం
గానం జెలి కెడరైనం | బూని తగులు నతఁడచూవె పురుషుం డెందున్‌.
232
ఉ. కావున మీకు దంతి హయ కాంచన రత్న విభూషణంబులున్‌,
దేవనితంబినీజన సదృక్ష మృగాక్షులు నాదిగాఁగ నా
నావిధ వైభవంబులు మనంబుల వాంఛలకుం దగంగ నీ
కే విధి నీఁగువాఁడ ఋణ? మెయ్యది యేనియు వేఁడుఁ డిచ్చెదన్‌.’
233
క. అనవుడుఁ బాండుతనూభవు | ‘లనఘా! యి ట్లెంతయుం బ్రియంబున సంభా
వన సేసితి; మా కిది యా | ధనము వడయుదానికంటెఁ దక్కు వె? చెపుమా!
234
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )