ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
ధర్మరాజు సుశర్మను సపరివారంబుగా విడిపించుట (సం. 4-32-46)
వ. మ మ్మెరవుగాఁ దలంచి యియ్యెడ నిట్టట్టన వలవదు; పురంబున కరిగి యయ్యెడ నీ కెట్లు ప్రియం బట్లు మన్నింపు’ మని; రందుఁ గంకుండు మఱియు నిట్లనియె. 235
క. ‘తగ నొక్కటి వేఁడెద నిను | జగతీశ్వర! యిచ్చు టొప్పు; సరథగజాశ్వం
బుగ విడిచిపుచ్చు మిప్పుడ | త్రిగర్తపతి; నిదియ నాకుఁ బ్రియ మెబ్బంగిన్‌.
236
వ. మన నగరంబునకు జంఘాలురం బంపుము; పురంబున వారలువోయి భవద్విజయ ఘోషం బాచరించి, శోభనధ్వజోన్నయనంబును, మంగళతూర్యనాదంబులును, బరస్పర గంధ సలిల సేచనంబులును, గీతవాద్య నృత్తంబులును నాదిగాఁగల వివిధ శుభాచారంబులం బ్రవర్తింప నియోగింప వలయు’ ననిన, విరాటుండును బనిచినం గాలరులు వేగునంతకు వీటికిం జని గెలుపు ప్రకటించి, పట్టణాలంకరణ ప్రముఖ నిఖిలభద్ర విధానంబులు చేయించి; రిట పాండవులును మత్స్య మహీవల్లభుండును సమస్త సేనాసమేతులై విభవం బెసఁగ విలసిల్లుచు, లజ్జావనతాననుం డగు సుశర్మ సపరిచ్ఛదంబుగా విడిచి పుచ్చి, గుత్తులకొలందికిఁ గృత్తంబులయి పడియున్న పాదంబుల వలనం గెందలిరుల సెజ్జల చందంబులగు చోట్లును, దునిసి చిక్కువడియున్న యూరు కాండంబుల వలన మదగజంబులు సొచ్చిన కదలీ వనంబులుం బోని యెడలును, బ్రోవులు గొనియున్న ప్రేవుల వలన లావుగల యంచపిండు పేరాఁకలి నఱిముఱిం బెఱికినఁ గుఱుకులు గట్టిన మృణాళ నాళంబుల నొప్పు కమలాకరోద్దేశంబులఁ గ్రేణిసేయు ప్రదేశంబులును, నంగుళీయకరుచు లడర నెఱిం జాఁగి పడియున్న బాహుదండంబుల వలన నురగ నివాసంబుల ననుకరించు తలంబులును, గీలాలజాలంబులపయిందేలుచు నవ్వినట్లున్న శిరంబులవలన వికచారవింద దీర్ఘికల విడంబించు తావులును, నవయవ భేదంబు లడంగునట్లుగాఁ దుత్తునియలై పడియున్న గాత్రంబుల వలనం గృతాంత మహానసశాలలపగిది నొప్పునట్లును గల పొలికలను గలయం గనుంగొనుచు వెడలి, చంద్రికాసుందరం బగు నొక్క సైకతస్థలంబున నారాత్రి వుచ్చిరని చెప్పిన విని, ‘మఱునాఁటి వృత్తాంతం బె ట్లయ్యెనో!’ యని సాదరంబుగా నవలోకించిన. 237
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )