ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
ఉత్తర గోగ్రహణము (సం. 4-33-1)
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 2
క. సూర్యోదయావసరమున | దుర్యోధనుబలము ప్రబల దోర్బల లీలా
ధుర్యగతి నడచె భీష్మా | చార్య రవి సుతాది యోధ సంఘోద్భటమై.
3
వ. ఇట్లు నడచి మత్స్యనగరంబున కనతి దూరంబున విరాటు పశుగణంబులం బొదివె; నట్టియెడ మ్రుక్కడి మూఁకలు సని యెక్కడెక్కడ యని తలపడినం గృపాశ్వత్థామ శకుని దుశ్శాసన కర్ణ వికర్ణ దుర్ముఖ ప్రముఖ రథిక జనంబులు గోపాల వర్గంబు ననర్గళ ప్రసారంబగు శరాసారంబునం గప్పినం గని కౌరవబలం బగుట యెఱింగి, బెగ్గలించి గవాధ్యక్షుండు రథంబు దోలికొని యాక్రోశించుచుం బురంబున కరుగుదెంచి రాజ మందిర ద్వారంబుఁ జొచ్చి రథావతరణంబు సేసి యంతఃపురంబున నున్న భూమింజయుం గాంచి ససంభ్రమంబుగా నిట్లనియె. 4
మ. ‘ధరణీచక్రము సంచలింపఁగ సముద్దాంతంబులై గ్రక్కునం
గురుసైన్యంబులు వచ్చి ముట్టికొనియెన్‌ గోవర్గమున్‌; వేగమై
మరలం దెచ్చుటకుం గడంగుము; రిపుక్ష్మాపాలలోకంబు నీ
శరజాలంబులపాలు సేయుము భుజోత్సాహంబు శోభిల్లఁగన్‌.
5
ఆ. తేరుఁ బూన్పఁ బంపు; తెప్పింపు దృఢ తను | త్రాణ, ముగ్రచాప బాణ పూర్ణ
తూణ ఘనగదాసి తోమర చక్రాదు | లనువుగా నొనర్పు మతి రయమున.
6
చ. విరటుఁడు నిన్ను నెప్డుఁ బదివేవురముందటఁ జెప్పుఁ బాహువి
స్ఫురితుఁడు, శౌర్యశాలి, కులభూతి విశేష విధాయకుండు, భూ
భరణ విశారదుండు, జనభవ్యతపఃఫలసంభవుండు, కా
తర పరిరక్షకుం డనుచు; దానికి నీడుగఁ జేయు మిత్తఱిన్‌’.
7
క. అని కాంతాజనములలోఁ | దను నగ్గించుటయుఁ బొంగి దర్పోద్ధతి ని
ట్లను నుత్తరుండు దన మన | మున సంగర కౌతుకంబు ముడివడుచుండన్‌.
8
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )