ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
భూమింజయుండు గోవుల విడిపింపఁ గౌరవులతోఁ బోరుటకుఁ బోనెన్నుట (సం. 4-34-1)
ఉ. ‘ఎత్తునఁ గొందుఁ గౌరవుల నెల్లను మార్కొనిరేని; గోవులం
దెత్తు ముహూర్త మాత్రమునఁ; దేరికి సారథి లేమిఁ జేసి నా
చిత్తమునన్‌ విచారదశ చెందెడు; నెవ్వఁడు గల్గునొక్కొ నా
కిత్తఱి ‘నేఁ గదా కడప నెంతయు నేర్తు రథం’ బనం బురిన్‌.
9
క. తగు సారథి దొరకొనినం | బగతుర భంజించు టెంతపని? కదుపుల ద
వ్వుగఁ గొని పోదురొకో! యి | ట్లగునె? కలండేని సూతు నరయుం డెందున్‌.
10
చ. కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజముఖ్యులు మత్సముద్యమ
స్ఫురణము చూచి పార్థుఁడను బుద్ధిఁ గలంగఁగ బెట్టు గిట్టి సం
గరమున నోర్చి యేఁ బసుల గ్రమ్మఱఁ దేరకయున్న నన్ను భూ
వరుఁడు సుహృజ్జనంబుఁ బరివారముఁ జిత్తములందు మెత్తురే?’
11
వ. అనునప్పుడు తత్ప్రదేశంబున నునికిం జేసి. 12
క. విని, ద్రుపద ధరణిపతినం | దన సామర్షాపహాస తరళ హృదయ యై
చని, తద్వృత్తాంతము మె | త్తని పలుకులఁ జెప్పె నింద్రతనయునితోడన్‌.
13
వ. అతండు నజ్ఞాతవాస వత్సరం బతీతంబగుట నిరూపించి, పాంచాలి కిట్లనియె. ‘నీవు పోయి వారలతో నిట్లనుము ‘మన బృహన్నలకు సారథ్యంబుసేయు సామర్థ్యంబు గలదు; దొల్లి ఖాండవ దహనంబునం బాండవ మధ్యమునకు సారథియై యతని చిత్తంబు వడసె; మఱియుఁ బెక్కెడలం దదీయంబగు రథంబు గడపఁ దానయై యుండు; నేను నెఱుంగుదుం, దత్సాహాయ్యంబునం గురుసైన్యంబుల జయింప వచ్చుటకు సంశయంబు వల దనుము. వా రేమనిరేని మఱియుం దగనాడి నన్నుం బిలిపించునట్టి తెఱంగు గావింపు’ మన ‘నట్లచేయుదు’ నని సైరంధ్రి యుత్తరయున్న యెడకుం బోయి. 14
చ. ‘జనపతినందనుండు తగు సారథి నారయుచున్నవాఁ డెఱిం
గిన పని సెప్పఁగా వలయుఁ, గ్రీడి మనంబున మెచ్చునట్టి నే
ర్పును భుజశక్తియుం గలిగి రూఢికి నెక్కిన సూతవృత్తి మై
నని సడిసన్న యేడ్తెఱ బృహన్నలకుం గల దంబుజాననా!
15
తే. అర్జునునకు ఖాండవ దహనాదులైన | విక్రమము లా బృహన్నల వెరవు లావు
గాదె! జయ మొనరించె లోకంబు లెఱుఁగ | నువిద! దీని నెఱింగింత ముత్తరునకు’.
16
క. అని యమ్ముదితయుఁ దానును | జని యతనికి నత్తెఱంగు సముచితముగఁ జె
ప్పిన నక్కుమారవరుఁ డి | ట్లనియెం బాంచాలితోడ నల్లన నగుచున్‌.
17
తే. ‘అకట సైరంధ్రి! నన్ను నిట్లాలి గొనఁగ | నేల? చక్కఁగఁ గనువిచ్చి యేను బేడిఁ
జూడరోయుదు; రణమున సూతకృత్య | భరముఁ దాల్చుట కెమ్మెయిఁ బనుచువాఁడ?
18
వ. అదియునుంగాక. 19
చ. కురుబల మేఁగుదెంచెనట గోవుల బిట్టఱఁబట్ట; దానిపైఁ
బరిగొని శౌర్యసంపదయు బాహుబలంబును జూపఁబూని యే
నరిగెద నట్టె; తేరికి బృహన్నల సారథియైన దీని న
వ్వరె? పురిలోన నింత కఱవా? రథచోదకు లింత యేటికిన్‌.’
20
వ. అనిన విని సైరంధ్రి యతని కిట్లనియె. 21
ఉ. ‘కౌరవసేన గాదు త్రిజగంబులు నొక్కట నెత్తి వచ్చినం
దేరు బృహన్నలా వశగతిం జరియించిన గెల్వ వచ్చుఁ; ద
ద్వీరగుణంబు సొంపు పృథివీవరనందన! ము న్నెఱుంగుదుం;
గారణజన్మమై తను వికారము వచ్చినఁ బెంపు దప్పునే?’
22
వ. అనవుడు. 23
క. మన మురియాడుచు నుండఁగఁ | దన కొరు లప్పటికి లేమి ధరణీశ్వరనం
దనుఁడు బృహన్నలఁ బిలువం | బనుచుట కొడఁబడిన పలుకు వలుకుటయుఁ దగన్‌.
24
వ. సైరంధ్రి దెసఁ గనుంగొని ‘యేను బోయి తోడ్కొని వచ్చెద’ నని పూని. 25
సీ. అడుగుల నునుఁగాంతి నయ్యెడఁ బద్మరా | గంబుల నెలకట్టు కరణినొప్పఁ,
బాలిండ్లు దను వెడ వ్రాలింపఁ జెన్నొందు | నసదుఁ గౌఁదీఁగె యల్లాడుచుండఁ,
దఱి వేచి వెనువెంటఁ దగులు కామాంధ కా | రములీలఁ గ్రొవ్వెద కొమరుమిగులఁ,
గర్ణభూషణ మౌక్తిక ప్రభాడోలన | మీక్షణ దీప్తుల నినుమడింప’
 
తే. నందియల మొరపంబున కరుగుదెంచి | ప్రోది రాయంచ రయమునఁ బోవు నవ్వి
ధంబు దగ నభ్యసించు చందమునఁ దోన | చనఁగ నుత్తర నర్తనశాల కరిగె.
26
ఆ. మెఱుఁగు మొగిలు సొచ్చు తెఱఁగున నాట్యమం | దిరము సొచ్చి తనదు గురువు కడకు
నరిగి నెమ్మి నిట్టు లను నింతి ప్రార్థనా | వినయ సంభ్రమములు పెనఁగొనంగ.
27
క. ‘ఇచ్చట నొకకయ్యంబునఁ | జచ్చె మదీయాగ్రజన్ముసారథి; తగువాఁ
డెచ్చోట లేమి నాతం | డచ్చు పఱుపఁడయ్యె నీ క్రియకు నొండొకనిన్‌.
28
వ. అది యట్లుండె; నేఁడు కౌరవులు పసులం బట్టిరని కూయి వచ్చిన, నన్న సన్నద్ధుఁడై వెనుకం దగుల సమకట్టి, సారథ్యంబు సేయువాఁడు లేమికి విషాదంబు నొందిన, నీ కందువ సైరంధ్రి సెప్పినం బ్రియంబంది నిన్నుఁ దోడ్తేర నన్నుఁ బనిచిన, నేనును నీ పాల నాకుఁ జనవు గలుగుటంజేసి,‘యెల్ల విధంబులం దెత్తు’ నని పూని వచ్చితి; నీవును నా పలుకులు కుఱుచసేయక, నీ పెంపునుం బ్రకటంబుగా నయ్యుత్తరకుమారునకు రథంబు గడప నియ్యకొని, యి య్యాపదఁ దలఁగ వలయు, నిట్లొడంబడక తక్కుట నా వలని వాత్సల్యంబు గొఱంతపఱుచుట’ యనిన నమ్ముద్దియ పలుకులు ముద్దు సేసి. 29
క. నగుచు బృహన్నల యిట్లను | ‘జగతీశ్వర పుత్రి! నాకు సారథ్యము నే
ర్పు గలదె? నీ మాటకు నే | మిగులంగా వెఱతుఁ; బొదము మీఁ దట్లుండెన్‌.
30
క. భవదీయ ప్రార్థనచేఁ | దివిరి పరమ దుష్కరములు దీర్చియయిన ను
త్సవ మొనరించెద సార | థ్య విధం బొకఁ డనఁగ నేల యంబుజవదనా!’
31
వ. అనుచు సంగీతనిలయంబు వెలువడి సలీలంబుగా మెత్త మెత్తన నడతెంచు మత్తశుండాలంబునుం బోలె. 32
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )