ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
ఉత్తరుఁడు బృహన్నలను దనకు సారథిగాఁ జేసికొనుట (సం. 4-35-10)
తే. అరుగుదెంచు బృహన్నల నంత నంతఁ | గని నృపాలసుతుం డను గారవమునఁ
‘గౌరవులతోడఁ గయ్యంబు గలిగె నాకుఁ | గడఁగి నేఁడు రథ మ్మీవు గడపవలయు.
33
క. వే రమ్ము; మై మఱువుఁ దొడి | తే రెక్కుము; దప్పఁ గ్రుంకఁ దీఱదు నీకున్‌;
సైరంధ్రి సెప్పె నీదగు | బీరమ్మును బెంపులావు వెరవును మాకున్‌.’
34
చ. అనుటయు, ‘నాట పాట గల యప్పటికిన్‌ ననుఁ గోరి పిల్పఁబం
చినఁ దగుఁగాక; సంగరము సేఁతకు సారథి గమ్ము, రమ్ము, నీ
వను టుచితంబె? యెల్లెడల నారసి బాహుబలాఢ్యుఁడైన యొ
క్కని రథ మేడ్తెఱం గడపఁగా నియమింపుము రాజనందనా!’
35
వ. అనిన విని వైరాటి కిరీటి కిట్లనియె. 36
ఉ. ‘ఖాండవ మేర్చునప్పుడు తగన్‌ రథచోదక వృత్తి సల్పి; యా
ఖండలసూతికిన్‌ జయము గల్గ నొనర్చిన యట్టి బుద్ధియున్‌
దండితనంబు నీ యెడన తక్కెనె? నా దెస మైత్రి పెన్పు; మిం
కొండొక మాట దక్కుము, రణోత్సహనం బొనరింపు గ్రక్కునన్‌.’
37
తే. అనిన, నాతని మాటకు నడ్డమాడ | వెఱచినట్టి తెఱంగు భావించి యల్ల
నియ్యకొనుటయు; నమ్మనుజేంద్రసుతుఁడు | దృఢ తను త్రాణ మతనికిఁ దేరఁ బనిచె.
38
క. తెప్పించి తొడుగు మీ వని | యొప్పించిన, నిట్టునట్టు నొఱవలుగా మైఁ
గప్పికొని, యా బృహన్నల | యప్పుడు నగుపించె నచటి యబలాజనమున్‌.
39
క. ఉత్తరుఁడు సత్వరంబుగఁ | దత్తనువున మఱువు దొడిగి తానును హృద్యో
దాత్తంబగు కంకట మిడి | చిత్తము పసిఁ గ్రమ్మఱింపఁ జిడిముడిపడఁగన్‌.
40
వ. బృహన్నల నవలోకించి. 41
క. ‘హయములఁ బూన్పుము రథమున, | రయమున సిడమెత్తు; మిపుడ రావలయును గో
చయము గొని, యస్మదీయ వి | జయ మభినందింపఁ బురముజను లెదురుకొనన్‌.’
42
తే. అనిన ‘నీ వేమి పనిచిన నట్ల చేయ | వలయు; నీ వున్నయెడ నుండవలయు; నీవు
సన్న దెసఁ జనవలయు; నా శక్తి యెఱిఁగి | పంచి పనిగొని కడిమిమైఁ బగఱ గెలుము.’
43
వ. అని పలుకుచు మనంబున ముదం బొదవ నా ధనంజయుండు. 44
క. కాంచనమాలాలంకృత | చంచత్తను లీల మెఱయ జవనాశ్వములం
బూంచి రథంబున మణిమయ | పంచాననకేతు వెత్తె బంధుర భంగిన్‌.
45
వ. ఇట్లు సన్నాహంబు మెఱసిన సారథిం జూచి యుత్తరయుం జెలులు నిట్లనిరి. 46
క. ‘కురువీరుల గెలిచి తదం | బరములలోఁ జిత్రవర్ణ భాసురములుగాఁ
దర మెఱిఁగి లోచనోత్సవ | కరములుగా బొమ్మపొత్తికలకుం దెండీ.’
47
క. అనుడు బృహన్నల యిట్లను, | ‘జనపాలకనందనుండు జయలక్ష్మిం జే
కొనునటె! చీరలు దెచ్చుట | పనియే! యటు సూడుఁ, డెల్ల భంగులఁ దెత్తున్‌.’
48
వ. అనుచు ధనుస్తూణీర కృపాణ ముద్గరాది వివిధ సాధనంబులు రథంబుపైఁ బదిలంబుగా నిడి నొగలెక్కి పగ్గంబుల స్రుక్కుసక్కంజేయ, నుత్తరుండును బసులం బట్టిన దెస గోపాలకు నడిగిన, వాఁడు పితృవణంబువలనని చెప్పిన వినుచు, రథారోహణంబు సేసి, వెడలి, పౌరవృద్ధ పుణ్యాంగనా భూసుర సమూహంబులు బృహన్నలం జూచి ‘తొల్లి ఖాండవ దహనంబున నర్జునునకు నీ కతంబున నయిన మాంగల్యం బెట్టి దట్టిద భవత్సాహాయ్యంబున భూమింజయున కయ్యెడు’ మని దీవించి సేసలు సల్లం బురంబు నిర్గమించి, నిరర్గళపరాక్రముం డయిన యా ఫల్గును నైపుణంబున వల్గ దశ్వంబగు రథంబు రయంబునకు మెచ్చుచుం బరేతనిలయ ప్రాంత ప్రదేశంబు సేరం జని. 49
సీ. అభినవ జలధర శ్యామంబు లగునెడ | లాకు జొంపంబుల ననుకరింప,
సాంధ్యరాగోపమచ్ఛాయంబులగు పట్లు | కిసలయోత్కరములఁ గ్రేణి సేయ,
రాజమరాళ గౌరములగు చోటులు | తఱచుఁ బూఁ బొదల చందంబు నొంద,
హారిద్రరుచి సమానాకృతులగు ఠావు | లడరెడు పుప్పొడులట్లు మెఱయఁ,
 
తే. గలయ నెగసి ధరాధూళి లలితవనము | దివికి నలిఁగాఁపు వోయెడు తెఱఁగు దాల్ప
గోగణము ముంగలిగ నేల గోడివడఁగ | నడచు కౌరవరాజు సైన్యంబుఁ గనియె.
50
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )