ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
ఉత్తరుఁడు కురుసైన్యంబు గనుంగొని భయభ్రాంతుం డగుట (సం. 4-36-8)
క. కని యుత్తరుండు గరుపా | ఱిన మేనును, దలఁకు మనము, ఱిచ్చవడిన చూ
పును నై, తొట్రుపడుచు, ని | ట్లనియె, దిగులు సొచ్చి యా బృహన్నలతోడన్‌.
51
శా. ‘భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు, దుర్యోధన
గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు, శస్త్రాస్త్ర జా
లోష్మస్ఫార చతుర్విధోజ్జ్వల బలాత్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్త్వాకలితంబు సైన్య మిది యేఁ జేరంగ శక్తుండనే?
52
క. అకృతాస్త్రుఁడ, బాలుఁడఁ గా | ర్ముక విద్యా ప్రౌఢిమై నిరూఢులయిన యీ
శకుని జయద్రథ దుర్ముఖ | వికర్ణ కర్ణాది యోధ వీరుల కెదురే!
53
క. ఇట్టగు టెఱుఁగక వచ్చితి | మెట్టొకొ! మనభంగి; వీర లిందఱును గడున్‌
బెట్టిదులు; మనకు మార్కొను | నట్టి కొలఁది గాదు; భీతి యడరెడుఁ దోడ్తోన్‌.
54
ఉ. కౌరవసేనఁ జూచి వడఁకం దొడఁగెన్‌ మదితోన మేను; నీ
వూరక పోవుచున్కి యిది యొప్పునె? యిప్పటి భంగిఁ జూచిన
న్వీరల నేను మార్కొనమి నిశ్చయ, మట్లగుటన్‌ రయంబునన్‌
దేరు మరల్పు, ప్రాణములు దీపన మున్‌ వినవే బృహన్నలా!’.
55
వ. అనిన దరహసిత వదనుం డగుచు శతమఖతనయుం డతని కిట్లనియె. 56
చ. ‘అసదృశలీలఁ బొల్చు రథికావలి మీఁదఁ జనంగ వెఱ్ఱినే
మసలక యామిషంబు గొని మార్గము వట్టిన తుచ్ఛసైన్యమున్‌
వెసఁ జని ముట్టి గోధనము వేగ మరల్తము గాక; యిమ్మెయిం
బసు లటు వోవఁగా మరలఁ బాడియె నీకు నరేంద్రనందనా!
57
ఉ. అంతిపురంబులోనఁ గల యంగన లెల్లను నెమ్మనంబులన్‌
సంతసమందఁగాఁ బసులఁ జయ్యనఁ దెచ్చెద నంచుఁ బూని, నీ
వెంతయు మేటివై, యరదమెక్కి రయంబున వచ్చి, యిచ్చటన్‌
దంతితురంగ సద్భటకదంబముఁ జూచి కలంగు టొప్పునే!’
58
ఆ. అనిన పలుకులకు బృహన్నలఁ గనుఁగొని | యెలుఁగు వడఁక నాతఁ డిట్టు లనియెఁ
‘బసుల దయ్య మెఱుఁగుఁ బడఁతుల సంతోష | మేల నాకు? ననికిఁ జాల నేను.’
59
వ. అనవుడు. 60
చ. ‘తన భుజశక్తియున్‌ రిపుల దర్పము నేర్పడఁ జూచి చూచి యె
ట్లును దెగకున్నఁబోక యిది లోకము చక్కటి; శూరులైన దీ
నిని మది మెచ్చ; రీ బలము నీదెస దేఱియుఁ జూడ; దింతకున్‌
మును భయహేతువైన విధముం దగఁ జెప్పుము నాకు నిత్తఱిన్‌.
61
సీ. దెసలు బీఁటలు వాఱఁ దివురు చిందంబుల | కోలాహలఁములకుఁ గుదియఁ బడక,
యురవడి సేనలు దెరలఁ బైఁ దోఁతెంచు | ధూళి పెల్లడరినఁ దూల పోక,
చతురంగబల మతిసాంద్రతఁ గవిసిన | యగ్గలికమునకు బెగ్గడిలక,
శస్త్రాస్త్రములు రథ్య సారథి వర్మాంగ | తతి నాటు తఱచునఁ దల్లడిలక,
 
తే. బహువిధంబులఁ బగతుర బరవసమున | నిత్తెఱంగునఁ గలుగు క్రందెల్ల నోర్చి
నిల్చి గెల్చిన సత్కీర్తి నెగడుఁ గాక | దవ్వు దవ్వుల నిట్లైన నవ్వరెట్లు?’
62
చ. అను దివిజేంద్ర నందనున కమ్మనుజేంద్ర తనూజుఁ డిట్లనున్‌
‘వినుము! త్రిగర్తవాహినులు విక్రమసంపద సొంపు మీఱ, గో
ధనములఁ బట్టినం, బతి యుదగ్రత సైన్యము లెన్ని యన్నియుం
గొని యటు వోయెఁ, గాన మనకుం బురి బాసట లేర యెవ్వరున్‌.
63
తే. ఒంటిఁ దలపడి కురుసేన నోర్చువాఁడ | నే? యిదేటికి వెడమాట లిట్టు లాడ?
వారు గానక ముందఱఁ దేరు దోలు | కొని రయంబునఁ బురి కరుగుటయ నీతి.’
64
వ. అనినం బార్థుండు పార్థివనందనున కిట్లనియె. 65
క. ‘వెగడొంది యిట్లు వలుకఁగ | నగునే? పగతురు ప్రమోద మందఁగఁ బసులన్‌
దిగవిడిచి, పురజనంబులు | తెగడంగా మగిడిపోక దీనత గాదే!
66
వ. అట్లుంగాక. 67
మ. నను సైరంధ్రి గడంగి పేర్కొనియె, దానం బెంపుమైఁ బిల్చి, తో
డని తోడ్తెచ్చితి వీవు, బంటుతన మ ట్లగ్గించి పౌరాలి దీ
వన లిచ్చెం, దుదిఁ బోయి కౌరవులు గోవర్గంబు గొంపోవఁగాఁ
గని యేఁ గ్రమ్మఱి రిత్తవోదునె? భయోత్కంపంబు నీ కేటికిన్‌?
68
తే. చిత్తవృత్తి యొక్కించుక చిక్కఁ బట్టు, | మిపుడ కౌరవ సైనికు లెల్లఁ జూచి
వెఱఁగు పడ వేగమును లావు వెరవు మెఱయఁ | గదుపుఁ బెట్టించి పోదము క్రమ్మఱంగ.’
69
వ. అనుచు వివ్వచ్చుండు గడంగి తేరు వోవనిచ్చుటయు, నాననంబు పల్లటిల్ల, మానసంబు దల్లడిల్ల నా భూవల్లభు కుమారుండు. 70
క. ‘దవ్వుల విఱిగినఁ బౌరులు | నవ్వుదురటె! మేలు మేలు! నను నాఁగకు, నీ
క్రొవ్వఱుగదేనిఁ దలపడు | మెవ్విధిఁ జనితేని’ యనుచు నెత్తిన భీతిన్‌.
71
క. శరములు శరాసనము న | య్యరదముపై డిగ్గవిడిచి యతి రభసమునన్‌
ధరణికి లంఘించి వెసం | బురిదెసకును లజ్జ వీటిఁ బోవం బాఱెన్‌.
72
వ. ఇట్లు వాఱినం దనమనంబునం గుత్సించుచు బీభత్సుండు యుగ్యంబుల పగ్గంబుల నొగల ముడిచి రథంబు డిగ్గనుఱికి లంబకేశభారుండును, నాందోళిత రక్తాంబర యుగళాంచలుండును నగుచు వెనుకంబఱచు సమయంబున, నిలిచి కనుంగొను కౌరవబలంబునందు. 73
ఉ. అజ్ఞులు కొంద ఱప్పుడపహాసము సేయుచు గూఢరూప రే
ఖాజ్ఞత లేమిఁ దద్వికృత కాయము మీఁదను దృష్‌ట్లు నిల్పఁగాఁ;
బ్రాజ్ఞులు మూర్తి సౌమ్యతయు, బాహుల దీర్ఘతయున్‌, భటత్వ త
త్త్వజ్ఞతయున్‌, గతిస్ఫురదుదాత్తతయుం గని సంశయంబుతోన్‌.
74
తే. ‘ఆఁడు చందంబుఁ బురుష సమాకృతియును | గలిగియున్నవి’ యొప్పు నూష్మలత సొంపు
వికృత వేషావృతంబులై వెలయ కితఁడు | నివుఱు గవిసిన మెఱయని నిప్పువోలె.
75
ఉ. బాహుల చాయయున్‌, గమన భంగియు, నర్జునునట్ల; దీన సం
దేహము లే దితండు తన తేజము డాఁపఁగ మత్స్యభూమి భృ
ద్గేహమునందుఁ బేడి యనఁ గీడ్పడి యుండెనొ? కాక యీ కురు
వ్యూహముతోడి కయ్యమున కొండొకరుం డిటు లొంటి వచ్చునే?
76
చ. విరటుఁడు దక్షిణంబునకు వీరుల సారథులన్‌ నిజాజికై
పురిఁ గల వారినెల్లఁ గొనిపోయిన, నొండులు లేమిఁ జేసి యు
త్తరుఁడిట వచ్చుచుండి, యరదంబు దగం గడపంగ నెవ్వరుం
దొరకొనకున్నఁ దా నితనిఁ దోడ్కొని వచ్చినవాఁడు సూడఁగన్‌.
77
చ. పరి సనుదెంచి గోగణముఁ బట్టె ననన్‌ విని, పిన్నగాన మీఁ
దరయక రాజనందనుఁ డహంకృతిమైఁ బఱతెంచి, సైన్య వి
స్ఫురణముఁ జూచి, భీతిఁ దనబుద్ధి గలంగినఁ బాఱఁ జొచ్చె; ని
ప్పురుషుని శౌర్యసంపదయు భూరిబలంబు నెఱుంగఁ డేమియున్‌.’
78
వ. అనుచు నిశ్చయరహిత హృదయులగుచుండ శుండాలరయ లీలాసమరేఖంబగు గమనంబునం బురుహూత పుత్త్రుండు పదశత మాత్ర ప్రదేశ పలాయితుండైన భూమింజయు నెయిది పట్టికొనిన నతండు. 79
సీ. వెల వెలఁ బాఱుచు వెగడొందుఁ, బెదవుల | తడియాఱ నెంతయుఁ దల్లడిల్లుఁ,
జల్లన నంగంబు లెల్ల నిండఁ జెమర్చుఁ, | బదములుఁ గరములుఁ గుదియ వడఁకు,
హృదయంబు తటతట నదరంగఁ బెలుకుఱు, | దీన దృష్టుల మోముఁ దేఱి చూచు,
నెలుఁగు గద్గదికఁ దొట్రిల నేడ్చు, విడుమని | ప్రార్థించు మాటఁ గీడ్పాటు దోఁప,
 
తే. ‘నిష్కశతశుద్ధ హేమంబు నిర్మలోజ్జ్వ | లాష్ట వైడూర్యములుఁ దురగాఢ్య రథముఁ
గరటి దశకంబు నొకయూరుఁ బురము సొచ్చి | నపుడ యిచ్చెద నీ’ కను నార్తుఁ డగుచు.
80
క. ‘నాతోడి ప్రేముడిం గడు | నాతురయై యెదురుచూచు నంబకుఁ జేతః
ప్రీతిగఁ జని యాయమఁ బొడ | సూతుం బోనీఁ గదే విశుద్ధచరిత్రా!’
81
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )