ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
అర్జునుఁ డుత్తరునిఁ దనకు సారథిఁగాఁ జేసికొనుట : (సం. 4-36-41)
వ. అని మఱియు నానావిధ దీనాలాపంబులం బ్రార్థించుచుండం బార్థుండు నగుచు నతనిం దేరు సేరం దెచ్చి. 82
చ. ‘వెఱవకు మన్న! పోటు కురువీరులతోడ నశక్యమేని, న
త్తెఱఁగది యేల నీ? కుడుగు; తేరికి సారథి గమ్ము నాకుఁ జి
చ్చుఱ పిడుగెట్టులట్టడరి శూరుల మొత్తము నుగ్గు సేసెదం;
బఱపెద సేన, రాజు ధృతిఁ బాపెద, గోవులఁ గ్రమ్మఱించెదన్‌.’
83
క. అనుచు నొడఁబాటు లేకు | న్నను, నయ్యుత్తరుని నొగల నడుకొన నిడి, తా
నును రథ మెక్కి రథికుఁ డయి | చనియె నరుఁడు జమ్మి సేర సమ్మదలీలన్‌.
84
వ. ఇట్లు సవ్యసాచి నిక్షిప్తాయుధంబయిన శమీవృక్ష సమీపంబున కరుగు నవసరంబునం గ్లీబరూపచ్ఛన్నుండయ్యును బ్రస్ఫురణ విశేష భీషణుం డగు నతనిం గనుంగొని కౌరవసైనికులు గలంగిన మనంబులతోడ నివ్వెఱపడి యుండ, వారలం గనుంగొని, తోఁచు నుత్పాతంబుల నాలోకించి, గురుం డిట్లనియె. 85
క. ‘మాసె నభోమణి; నక్కలు | కూసెం; గలయంగ దెసలకుం బలుచాయల్‌
సేసెం బఱమొయిళు లడరి; | మ్రోసెం దమయంతఁ దూర్యము లపధ్వనులై.
86
క. ఇగ్గజములు మిన్నకయును | మ్రొగ్గెడు; నుత్తమ తురంగములు బాష్పజలం
బగ్గలము విడుచుచున్నవి; | తగ్గెడుఁ గారణము లేక తడఁబడి పడగల్‌.
87
క. దగ్ధము లైనట్టులు స | మ్యగ్‌ధైర్యము లెడలె; మండె నాయుధ చయముల్‌;
దిగ్ధూమం బెసఁగె; నసం | దిగ్ధము మనకాజి యగుట; దీనికిఁ దగఁగన్‌.
88
క. మొన లొఱపుగఁ దీర్చికొనుఁడు; | దనతన వాహనము లాయుధము లెల్ల జనం
బును ననువు సేసికొనుఁ; డో | పిన యంతయుఁ గాచికొనుఁడు బెదరక పసులన్‌.’
89
వ. అని చెప్పి తానప్పు డర్జును నెఱింగినవాఁడు గావున నతనికి నజ్ఞాతవాస సమయభంగం బగునో యను భయంబున సురనదీసూను వదనంబు వీక్షించి సన్నవాఱ నిట్లనియె. 90
చ. ‘వెరవరి గాక వీఁడు కురువీరులకుం బొడ సూపువాఁడె? య
చ్చెరు, వొక మ్రానిపేర నిట సేరఁగ వచ్చుచునున్నవాఁ; డహం
కరణమ కాని యొండొకటి గానఁడు; మూర్తివిశేష మారయన్‌
సురపతి యట్ల; వీని మదిచొప్పది యెట్లొ యెఱుంగ నయ్యెడున్‌.’
91
క. అనిన విని యెఱిఁగికొని యా | తని మది సందియము మాన్పఁదలఁచి నరేంద్రుం
గనుఁగొనుచు నతనితోఁ జె | ప్పిన భంగి నిగూఢ వృత్తి భీష్ముఁడు వలికెన్‌.
92
క. ‘తలఁపఁగ రిపులకు నిమ్మగు | కొలఁది గడచి వచ్చితిమి; యకుంఠిత బాహా
బలము నెఱపఁ దఱియయ్యెను | జలింపవల దింక మనకు శత్రులవలనన్‌.’
93
వ. అనవుడు నాచార్యుం డయ్యర్థంబు గనికొని పార్థునకు సమయ భంగంబు వలని సంకటంబు లేకునికి మనంబునం బ్రియంబంది మొగంబునం దోఁపనీక పుయిలోట దక్కి యిట్లనియె. 94
శా. ‘సింగం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగ స్ఫూర్జిత యూథ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాసఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్‌.
95
ఉ. ఈతనితోడి కయ్యమున కియ్యకొనందగు వార లస్మదీ
యాతత సేనలోఁ గలుగు టారయ సంశయ; మెల్లభంగి గో
వ్రాతనివర్తనంబు సుకరంబ కిరీటి; కితండు రుద్రునిం
బ్రీతునిఁ జేసె నా వినమె! పెంపెసలారెడు బాహుసంపదన్‌.’
96
వ. అను పలుకు లాకర్ణించి కర్ణుండు కటకటంబడి కుంభసంభవున కిట్లనియె. 97
ఉ. ‘పాండవ పక్షపాతమునఁ బల్కుదు నోరికి వచ్చినట్లు, ని
న్నొండన రామిఁ జేసి; యిది యొప్పునె? కౌరవసేన కెల్ల నొ
క్కండవ మేటి; వీ బలము గర్వముఁ గుందఁగ నిట్లు శత్రుదో
శ్చండిమ కోహటించితి; నిజంబునకున్‌ నరుఁ డింత యెక్కుడే?
98
ఆ. అతఁడు వచ్చెనేని, నస్మచ్ఛిలీముఖ | పాతచలిత హృదయపద్ముఁ జేసి,
వెగడు పఱిచి, యోధవీరుల కెల్ల ను | త్సవ మొనర్తు బాహుదర్ప మొప్ప.’
99
వ. అనిన విని సుయోధనుండు రాధేయున కిట్లనియె. 100
ఆ. ‘తప్పఁ బలికి తీవు; చెప్పెద విను; మితఁ | డర్జునుండ యేని నడవి కేఁగి
భ్రాతృయుతము గాఁగఁ బండ్రెండు వత్సర | ములును నంద నిలువ వలయు మగుడ.
101
క. ఒరుఁడయ్యెనేని మామక | శరాసన క్షిప్త దీప్తసాయక పంక్తిం
బరిమార్చెద వ్రేల్మిడి న | చ్చెరువుఁ బ్రమోదంబు నొంది సేనలు వొగడన్‌.’
102
క. అనుపలుకులకును భీష్ముం | డును ద్రోణుఁడు ద్రోణసూనుఁడును గృపుఁడును మే
లని యియ్యకొనిరి హృదయా | ననురూపములైన తెలివు లాస్యముఁ బొందన్‌.
103
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )