| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అట్టియెడ శమీవృక్ష సమీపంబున నరదంబు నిలుపంబంచి పార్థుం డుత్తరున కిట్లనియె. | 104 |
| క. |
‘ఇన్నగమునందు గాండివ | మున్నది; యదిగాని మద్భుజోద్రేక విలా సోన్నతి కోర్వవు పెద్దయు | నన్నువ లీవిండ్లు కుఱుచ లలఁతి బలంబుల్. |
105 |
| క. |
ఇవి నీ తెగకొలఁదివి; వీ | రవినోదము నప్పు డధిక రభసము లగు మ ద్వివిధాటోపములకుఁ జా | లవు; విల్లది నూఱువేల లావరయంగన్. |
106 |
| క. |
వీనిఁ గొని గట్టి మైమఱు | వేనుంగును మఱియు నెట్టి వేనియుఁ దునియం గా నేయ నగునె? కైదువు | లేని యలవు కలిమి పోర లెస్సై యున్నే? |
107 |
| వ. | కావున నిమ్మహీరుహం బెక్కి యమ్మహనీయ చాపంబు దెచ్చి యిమ్ము; ధర్మజ భీమార్జున నకుల సహదేవులు దమ దమ సమస్తాయుధంబులుఁ గూడంగట్టి యిందుఁ బెట్టిన వా; రాకట్ట విడిచి యందు గాండీవంబు వుచ్చికొని తక్కటియవి యెప్పటియట్ల బంధింపు, ‘మని చెప్పి శవాకారంబున నున్న శస్త్రాస్త్ర సంచయంబు సూపిన భూమింజయుం డతని కిట్లనియె. | 108 |
| క. |
‘పీనుఁగు నంటఁగఁ దగునే | భూనాథ తనూజుఁ డనక, పుయిలోడక, న న్నీ నీచపుఁ బనిఁ బనుపం | గా నీకుం దగునె? పాపకర్మము గాదే!’ |
109 |
| వ. | అనిన విని ధర్మనందనానుజుం డత్యాదరంబున. | 110 |
| ఆ. |
‘మనుజు లంటకుండ మఱువడఁ జేసిన | యస్త్ర శస్త్ర సంచయంబు గాని, శవము గాదు, మత్స్య జనపాలతనయ! యే | నట్టి దైనఁ బనుతునయ్య నిన్ను? |
111 |
| క. |
నమ్ముము కైదువు మోపగు, | జమ్మి వెసం బ్రాఁకి విడిచి చాపము నాకం ది’ మ్మనుఁడుఁ జేయునది లే | కమ్ముగ్ధుం డమ్మహీజ మలసత నెక్కెన్. |
112 |
| వ. | ఇ ట్లుత్తరుండు సమారూఢ శమీవృక్షుం డగుటయు, నరదంబు పయి నిలుచుండి పాండవమధ్యముండు ‘వేవేగ విడువు’ మనవుడు నతండు నాయుధ సంచయ బంధం బెడలించిన. | 113 |
| క. |
మెఱసి యుదయించు గ్రహముల | తఱచు ప్రభలఁ గ్రేణిసేసి దశదిశలం గ్రి క్కిఱిసి వెడలె నా, విండ్లన్ | మెఱుఁగులు, నృపతనయు దృష్‌ట్లు మిఱుమిట్లు గొనన్. |
114 |
| వ. | అట్టియెడ నయ్యాయుధంబులు. | 115 |
| క. |
పెనుబాముల చందంబున | నునికికి భయమంది వడఁకు నుర్వీశసుతుం గని తగుమాటలఁ గుంతీ | తనయుఁడు వెఱ వాపుటయు, నతం డచలితుఁడై. |
116 |
| వ. | పొదుపు విరియందట్టి కనుంగొని నిరూపించి, ‘సారథీ!’ యని సవ్యసాచిం బిలిచి యిట్లనియె. | 117 |
| క. |
‘ఇది యొక చాపము విస్మయ | మొదవించుచుఁ గొండచిలువయొకొ నాఁ దగి యు న్నది, ఖచిత కనక కమల స | ముదయద్యుతి సముపగూహనోజ్జ్వల మగుచున్. |
118 |
| వ. | దీనిం బాండవులయం దెవ్వరు ధరియింతు?’ రని మఱియు బహు విధంబులగు నాయుధంబు లుపలక్షించి వేఱు వేఱ వాని చందంబు లుపన్యసించి, ‘యివి యెవ్వ రెవ్వరి’ వని యడిగిన నర్జునుం డిట్లనియె. | 119 |
| తే. |
‘తొలుత నీవు న న్నడిగిన దొడ్డ విల్లు | గాండివము, ఫల్గునున కేడుగడయు నదియ; సమరమున దేవదానవ సమితినైన | గెలుచు నశ్రమమున దానివలన నతఁడు. |
120 |
| క. |
ఆద్యపురుషోపలాలిత | ముద్ద్యోతిత రోచిరుద్గమోగ్రం బరి ని ర్భేద్యము దివ్యజనన మన | వద్యం బిది కార్ముకైక వరము గుమారా! |
121 |
| వ. | ఇమ్మహనీయ చాపంబు బ్రహ్మ శతసహస్ర వర్షంబులు, ప్రజాపతి చతుష్షష్టి సహస్ర వర్షంబులు, నింద్రుండు పంచాశీతి హాయనంబులు, సోముండు పంచశతాబ్దంబులు, వరుణుండు శతశరత్సమితియుఁ గ్రమంబున ధరియించిరి; వరుణుచేత నగ్నిదేవుండు వేడుకపడి పుచ్చుకొని పదంపడి ఖాండవ దహనంబున నద్భుత కర్మంబునకు మెచ్చి వివ్వచ్చున కిచ్చె; నతండును నఱువదేనేండ్లు ధరియింపంగలవా; డిట్లిది త్రిలోక పూజ్యమహిమ నొప్పుచుండు. | 122 |
| సీ. |
నీలోత్పలచ్ఛాయ నెరసి సౌవర్ణ వృ | షావళి నొప్పు బాణాసనంబుఁ, దాళప్రమాణ సుందరమునై భర్మశా | ఖామృగాంచితమగు కార్ముకంబుఁ, దీవ్రకృశాను సందీప్తాకృతియుఁ గన | త్కనక మత్స్యంబులుఁ గలుగు ధనువుఁ, మెఱుఁగారు సారంబు మెఱయు కాంచనమయూ | రముల శోభిల్లు చాపమును వరుసఁ |
|
| ఆ. |
బాండవాగ్రజుండుఁ, బవనపుత్రుఁడు, నకు | లుండుఁ దదనుసంభవుండుఁ బట్టు నవి కుమార! య గ్గవాజిన కోశమ | హాశరంబు పార్థునదియ చూవె! |
123 |
| క. |
ఎద్దెసలం దనరుచులు స | ముద్దీప్తము లగుచునుండ, నుజ్జ్వల మగు న య్యుద్దండ గదాదండము | పెద్దయు నెడ మెచ్చి పట్టు భీముఁడు పోరన్.’ |
124 |