ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
అర్జునుఁ డుత్తరునకుఁ ద న్నెఱింగించుట (సం. 4-39-1)
వ. అనిచెప్పి మఱియు బాణ కృపాణ తనుత్రాణాదు లగు వివిధ సాధనంబులు వేఱువేఱ నిరూపించి గ్రక్కున నెఱింగించె; నప్పుడు మూఢాత్ముండగు నయ్యుత్తరుండు పాండవోత్తము నెఱుంగమి నిట్లనియె. 125
క. ‘ఈ యెడ ని ట్లిమ్మహనీ | యాయుధములు పెట్టి యెచటి కరిగిరి మన కౌం
తేయులు బృహన్నలా! తగ | నీ యెఱిఁగిన యంతవట్టు నిక్కము సెపుమా!’
126
వ. అని సస్నేహంబును, సగౌరవంబును, సవిషాదంబునుంగా మఱియును. 127
క. ‘ఏ నమ్మహానుభావుల | మేనల్లుఁడ; వార లార్యమిత్రులు, శత్రు
క్ష్మా నాయక గర్వ తమో | భానులు, బంధుహిత కార్య పరతంత్రాత్ముల్‌.
128
తే. అయ్యుధిష్ఠిరుఁ డెచ్చట నడఁగి యున్న | వాఁడొ? భీముని పార్థుని వర్తనంబు
లెయ్యెడల నేమి చందంబులయ్యె? నక్క | టా విధాతృండ! కవ లెందు దాఁగి రొక్కొ?
129
క. భూపాల వల్లభాజన | దీపిక యనఁ జాలు ద్రౌపదికి నెయ్యెడలం
దేపాటులు వాటిల్లెనొ? | కాపురుషులవలన నిట్టి కాఱియ పుట్టెన్‌.
130
క. కపట ద్యూత మొనర్చిన | నృపతియు దుర్యోధనాది నీచుల వలఁ బా
ఱి పడియెఁ గడుఁ బెక్కిడుమల | రిపుమర్దన వీర్యభుజ గరిష్ఠుం డయ్యున్‌.
131
క. వినఁబడ రెచ్చోటను దమ | వినుత మహీరాజ్య మహిమ విడిచి చనుట, నే
మని వినియెదనో నీచే?’ | ననుడు నతం డిట్టులనియె నాతని తోడన్‌.
132
వ. ‘వారలకు వగవ వలవదు; విధివశంబున వచ్చిన యాపదకు నోర్చి బాసతప్పక తారును బాంచాలియు నొక్కటఁ బండ్రెండేండ్లు వనంబున వసియించి పదుమూఁడగునేఁ డజ్ఞాతవాసంబు సలుప వలయుట నిట వచ్చి మనవీట నవ్యాపన్నులై యున్నవారు. వినుము వారి నెఱింగించెద. 133
క. కంకుఁడు ధర్మసుతుఁడు; వల | లాంకుఁడు భీముండు; కవలు హయశిక్షక గో
కింకరులు; సెప్పఁ దొడఁగితి | నింకఁ గొఱఁత వెట్ట నేల? యే నర్జునుఁడన్‌.
134
తే. అధిపనందన! మాలిని యనఁగఁ బరఁగు | కాంత ద్రౌపది; దానికై కాదె సింహ
బలునిఁ దమ్ముల గంధర్వపతులు సంపి | రనఁగఁ జంపె మహోగ్రత ననిలసుతుఁడు.’
135
వ. అనిన విని భూమింజయుండు సంభ్రమాశ్చర్య సంశయంబులు మనంబున ముప్పిరి గొనం దప్పక చూచి, సవ్యసాచికి వెండియు నిట్లనియె. 136
క. ‘చిరకీర్తి ప్రియుఁడగు న | న్నరునకుఁ బది గలవు భవ్యనామములు మనో
హరముగ నవి సెపుమా యొం | డరయక యే నమ్మెదను బృహన్నల! నిన్నున్‌.’
137
వ. అనుటయు నతండు సస్మితాననుం డగుచు, ‘నర్జునుండు, ఫల్గునుండు, పార్థుండు, కిరీటి, శ్వేతవాహనుండు, బీభత్సుండు, విజయుండు, జిష్ణుండు, సవ్యసాచి, ధనంజయుండు నను నివి పదియును నా పేళ్ళనవుడు, నుత్తరుండు పాండవమధ్యమున కిట్లనియె. 138
క. ‘ఏమి కతంబున నిట్లీ | నామంబులు సంభవిల్లె నరునకు? నవి చే
తో మోదంబుగఁ జెప్పుము | నీమది తత్తద్విధంబు నిశ్చితమేనిన్‌.’
139
వ. అనుటయు ‘నట్ల చేయుదు’ నని యతం డిట్లనియె. 140
ఆ. ‘ధరణి యెల్ల గెలిచి తగ ధనంబులు గొని | యునికి నే ధనంజయుండ నైతి;
నెట్టివారినైన నెదిరినఁ బోర జ | యంబు గొనుట విజయుఁ డండ్రు నన్ను.
141
తే. తెలుపులగు వాహనములు నాతేర సమర | భూములం దెప్డు నియతిమైఁ బూన్కిఁ జేసి
శ్వేతవాహన నామవిఖ్యాతి నాకు | సకలజన సమ్మతంబుగ సంభవించె.
142
చ. రవి యుదయించు నట్లు సమరంబున నా తలమీఁదఁ గాంతి మూ
ర్తి వెలుఁగు నింద్రుఁ డిచ్చిన కిరీట మభేద్యమహోగ్ర సుస్థిర
త్వ విభవ రూఢిమై; జనులు దానన నన్నుఁ గిరీటి నామ సం
స్తవన విశేష పాత్రముగ సమ్మతిఁ జేసిరి మాత్స్యనందనా!
143
తే. వీరులకుఁ జూడ బీభత్స విధము గలుగు | నట్టి కార్యంబు సేఁతకు నెట్టి సమర
భంగులను దడఁబడక బీభత్స సేయ; | దాన బీభత్సుఁ డను నభిధాన మయ్యె.
144
క. భండనమున నిరుగేలను | గాండీవముఁ దివియ నేర్పు గలిగిన నందు
ద్దండ మగు సవ్యకరము ప్ర | చండతఁ బరఁగుదును సవ్యసాచి యనంగన్‌.
145
తే. ధరణి దుర్లభమగు నవదాతవర్ణ | మారఁ గలుగుట నర్జునుఁ డండ్రు నన్ను;
ఫల్గునాహ్వయ ముత్తర ఫల్గునీ వి | శిష్టకాల సంజననతఁ జేసి గలిగె.
146
క. అని మొన మార్కొని వ్రణ మేఁ | గనుఁగొన ధర్మజుని మేనఁ గావింపఁగ న
య్యనిమిషులుఁ జాల రెవ్వరుఁ | జెనకినఁ బరిమార్తుఁ గాన జిష్ణుఁడ నైతిన్‌.
147
క. పృథ యను పేరు మదంబకుఁ | బ్రథితంబై యునికిఁ జేసి పార్థుఁడ నైతిన్‌;
వృథయుఁగఁ బలుకుదునే? యవి | తథవచనుండైన ధర్మతనయు ననుజుఁడన్‌.
148
వ. ఈ పది పేళ్ళును నివి కారణంబులుగాఁ బ్రకాశంబులయ్యె; సకలసుర నికరంబు లడ్డపడినం బుండరీకాక్ష సహాయుండనై ఖాండవం బేర్చి నప్పుడు మెచ్చి భద్రమూర్తులైన రుద్ర విరించులు సన్నిధి సేసినం బెన్నిధిఁ గన్న పేద చందంబున సంభ్రమించు నాకుం గరుణించి కృష్ణుండను నేకాదశ నామంబును, నప్రతిహత బాణంబులు నొసంగిరి. వారల యనుమతి నింద్రాదులయిన విబుధులును వివిధంబులగు దివ్యాస్త్రంబు లిచ్చిరి; పదంపడి గీర్వాణులకు నోర్వరాని యట్టివారి, వరదాన గర్వితుల నివాతకవచు లనియెడు దైతేయుల మాతలి సారథికంబగు నైంద్రస్యందనం బెక్కి యొక్కండన మూఁడు కోట్ల నిర్జించితి. దుర్జయులగు హిరణ్యపుర నివాసుల నఱువది వేవుర దేవారాతుల వారాశి తీరంబునం బరిమార్చితి; నప్పుడు ప్రీతుండై గిరిభేది కిరీటం బొసంగె; దేవసంఘంబు శంఖంబిచ్చె; నది కతంబుగా నచ్చిందంబు దేవదత్తం బనంబరఁగె. మఱియు నెయ్యెడల నెవ్వరు దొడరినం బొలివోని బలిమి కలిమి వెలుంగుదు. గాంధారీ నందనుండు గంధర్వరాజు చేతం బట్టువడిన యప్పుడు పదునాలుగువేల గంధర్వుల జయించి యతని విడిపించితి, నీ వోడకు; మీ కూడిన కురుబలంబుల గెలిచి, కర్ణ, గాంగేయ, కృప, ద్రోణ, ద్రౌణి, దుర్యోధనులు కనుంగొనుచుండఁ గదుపులం గ్రమ్మఱించెద’ నని సత్వరంబుగాఁ జెప్పిన, విని యుత్తరుండు చిత్తంబున నద్భుత హర్షంబులు వొదువ మ్రాను డిగ్గనుఱికి, సర్వాంగ సంగతోర్వీ తలంబగు దండప్రణామం బాచరించి, చేతులు మొగిచి నిలిచి యిట్లనియె. 149
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )