ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
ఉత్తరుఁడు బృహన్నల నర్జునుఁగా నెఱుంగుట (సం. 4-39-21)
ఉ. ‘బాహు సమగ్ర శత్రు మదభంజన శౌర్య! సమస్తలోక చే
తోహర మూర్తి! నీ విటులు దోఁచుట నాకుఁ బ్రసన్న విస్ఫుర
ద్దేహముతోడ భాగ్యమయ దేవత సన్నిధిసేఁత గాదె; స
మ్మోహము పాసెఁ; జిత్తము ప్రమోద రసత్వముఁ బొంది పొంగెడున్‌.
150
క. ని న్నెఱుఁగక యే నే మే | నన్న పలుకులెల్ల మఱచి యాశ్రిత రక్షా
సన్నద్ధ భావ మేర్పడ | నన్నుం గృపఁ జూడవే సనాథుఁడ నగుదున్‌.’
151
క. అన వినుచుఁ దేరు డిగి గ్ర | క్కునఁ గౌఁగిటఁ జేర్చె విరటుకొడుకును గుంతీ
తనయుఁడు సమ్మదమునఁ దన | కనుఁగవఁ గడు నశ్రువారి కడలుకొనంగన్‌.
152
వ. ఇట్లు సమాలింగితుండై. 153
చ. ‘మనము కలంకదేఱె రిపుమర్దన విక్రమ! యెక్కు తేరు; నీ
ఘనభుజశక్తి ప్రాపున నఖండిత శౌర్య మహోన్నతుండనై
యనిమొన సారథిత్వము మహత్త్వము వైరులు మెచ్చఁ జూపెదన్‌
ననుఁ బనిగొమ్ము, లెమ్ము, కురునాథు నదల్పు, మరల్పు గోవులన్‌.
154
క. మనమునఁ గోరుదు నే న | ర్జునునకు సమరమున రథ్యచోదక భావం
బునఁ బని సేయవలయు నని | యనిశము; విధికరుణ నాకు నది సిద్ధించెన్‌.’
155
వ. అని పలుకు నుత్తరు నత్యాదరంబునం జూచి సవ్యసాచి యతని కిట్లనియె. 156
మ. ‘ప్రియ మక్షీణము నాకు నీ దెస; మదిన్‌ భీతిప్రదోద్వేగ సం
శయముల్‌ సేరఁగ నీను నీకు; ఘనరక్షా కల్పనా బుద్ధి ని
శ్చయ సంపాదిని నాదు దృష్టి; నిను నశ్వవ్రాతముం జోఁక గా
లియు రానీను; దృణీకరింపు రిపుదోర్లీలాసముల్లాసమున్‌.’
157
వ. అనిన విని భూమింజయుండు సవినయంబుగా నిట్లనియె. 158
క. ‘నిను నర్జునుండని యెఱిం | గిన యంతన పాసె నెల్ల కిల్బిషములు; నీ
తను వేల షండభావం | బునఁ బొందెనొ యెఱుఁగవలయుఁ బుంస్త్వాభరణా!
159
చ. అనవుడు నాతఁ డిట్లను, ‘మదగ్రజుపంపున బ్రహ్మచర్య వ
ర్తనకయి పూర్వశాపవిహితంబగు రూపముఁ దాల్చి యేకహా
యన పరిపాలనీయ మగునట్టి వ్రతంబు సమాప్తిఁ బొందఁ జ
ల్పిన జతనంబు లోకులకుఁ బేడితనంబయి తోఁచె నిమ్మెయిన్‌.
160
వ. అదియును నిటమీఁద లే’దనినఁ బ్రమోదమాన మానసుండయి, మత్స్యపతిసూనుండు పాండుసూనున కిట్లనియె. 161
ఆ. ‘ఇట్లు తెలియఁ జెప్పుటెల్ల నాదెస దయ | పెంపుతోడి కూర్మి పేర్మిఁ గాదె!
యింక సురలకైన శంకింతునే? భవ | ద్బాహువప్రగుప్తి బలుపు గలుగ.
162
వ. నాకుం బని యెయ్యది పనుపు ‘మనిన నతండును’ గాండీవంబును, గాంచన పుంఖంబులగు బాణంబులు గల తూణీర యుగళంబును, మదీయ తను త్రాణ కృపాణంబులును బుచ్చికొని తక్కిన వాని నెప్పటి భంగిన కట్టి పెట్టి ర’ మ్మని నియోగించిన, నాతండు నట్ల చేయుటయు, నమ్మహాత్ముండు నియాతాత్ముండయి యధి దేవతలకుం బ్రాణమిల్లి, భక్తితోడ దివ్యకోదండాదులగు సాధనంబులు గైకొని, సవిశేషస్ఫూర్తి యగు మూర్తి నత్యంత దర్శనీయత్వంబు నొంది. 163
క. బలరిపుఁ డిచ్చిన కుండల | ములు నుష్ణీషంబుఁ జిత్తమున భక్తి మెయిం
దలఁప నవి వచ్చె; వెండ్రుక | లలవడగాఁ బాచి ముడిచె నమర దృఢముగన్‌.
164
క. తలచుట్టు చుట్టెఁ; గుండల | ములు వెట్టెను; ద్రిండు గాఢముగఁ గట్టెఁ; గరం
బుల వలయంబులు గనుఁగొని | యెల నవ్వొలయంగ నెక్కె నేడ్తెఱ రథమున్‌.
165
వ. అట్టి యెడ వరదాన మహానుభావంబునం జేసి. 166
క. పెట్టక కట్టక మౌళిం | బుట్టిన క్రియ దీధితులు నభోభాగంబున్‌
ముట్టి వెలుంగఁగ నింద్రుని | పట్టి కిరీటంబు పొలిచెఁ బ్రస్ఫురితంబై.
167
వ. ఇవ్విధంబున సన్నద్ధుండై యతిరథశ్రేష్ఠుండు రథం బెక్కి యం దాయుధంబులు పదిలంబుగా నిడి, తనుత్రాణ తలత్రాణంబులు తాల్చి, కవదొనలం బూని, గాండీవంబుఁ బుచ్చికొని యెక్కువెట్టి, ముష్టి నలవరించి గుణధ్వని సేసిన. 168
తే. పక్షి మృగజాతు లెల్లను బ్రమసి యిట్టు | నట్టుఁ గలగొనఁ జెదరె; వృక్షాళి యదరెఁ;
గురుబలంబును బెదరె; నంబరము దిశలు | బూరటిల్లంగఁ దొడఁగెఁ దదారవమున.
169
వ. తదనంతరంబ యగ్నిదేవుం దలంచిన, నతండును దన వరంబున మున్న కలిగి విశ్వకర్మ నిర్మితంబును, మాయామయంబును, వానరాకారంబును నగు మహోగ్ర కేతనంబును, తదాశ్రితంబులైన వికృతాభీల నానావిధ భూతంబులఁ బుత్తెంచిన, నుదాత్త చిత్తుండయి యుత్తరు సింహపతాక శమీవృక్షంబునం బెట్టించి, నిజ ధ్వజంబు రథంబునం గట్టించి, దివ్యంబు గావున దేవదత్తంబు చిత్తజ్ఞత్వంబున సన్నిధి సేసిన సవినయంబుగాఁ గైకొనియె; నక్కుమారుండును నాయితంబై నొగలెక్కి పగ్గంబు లమర్చికొని యగ్గలిక తోడం దురంగంబుల యంగంబులు తొడయుచు వాని జవసత్త్వంబులు వేఱు వేఱ వర్ణించిన. 170
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )