ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
అర్జునుఁ డుత్తరసారథికంబైన రథంబెక్కి దేవదత్తంబు పూరించుట (సం. 4-41-1)
చ. ‘తడవగుదెంచె; జమ్మికిఁ బ్రదక్షిణవృత్తిగఁ దేరు వోవని;
మ్మెడ గలుగంగఁ బోయెఁ బసు; లిప్పుడ కూడుద’ మన్న నాతఁడున్‌
నడపఁ దొడంగుడున్‌ మనమునన్‌ రణకౌతుక ముల్లసిల్లఁగాఁ
బిడుగుల పిండు బిట్టులియు పెల్లునఁ బార్థుఁడు శంఖ మొత్తినన్‌.
171
మ. కలఁగెం దోయధి సప్తకంబు; గిరివర్గం బెల్ల నూటాడె, సం
చలతం బొందె వసుంధరావలయ; మాశాచక్ర మల్లాడెఁ; గొం
దల మందెం ద్రిదశేంద్రు పట్టణము; పాతాళంబు ఘూర్ణిల్లె; నా
కులమయ్యెన్‌ గ్రహతారకాకులము; సంక్షోభించె నవ్వేధయున్‌.
172
తే. అపుడు నిశ్చేష్టితంబులై హయము లవనిఁ | జాఁపకట్టుగఁ బడియె; మత్స్యక్షితీశ
నందనుండును నొగలపై మ్రందినట్లు | మ్రొగ్గతిలఁ జాఁగి బలితంపు మూర్ఛఁ బొందె.
173
చ. కనుఁగొని ఫల్గునుండు తురగంబుల వాగెలు వట్టి యెత్తి, త
త్తనువులు నూల్కొనన్‌ నివిరి, తత్పరతం దగ మత్స్యభూమిభృ
త్తనయుని నూఁదిపట్టి, వికృతంబగు రూపము చక్కఁజేసి, నె
మ్మన మొకభంగిఁ దేర్చి, గరిమంబుగఁ గౌఁగిటఁ జేర్చి, యిట్లనున్‌.
174
తే. ‘శంఖ భేరీ రవంబులు, సామజముల | బృంహితంబులు వింతలే పృథుల సైన్య
పరిచయోదాత్తులగు నరపాల సుతుల? | కెలమిఁ బొందుము దీనికి నింత యేల?’
175
చ. అనవుడు మత్స్యరాజసుతుఁ డాతని కిట్లనుఁ ‘దొల్లి శంఖ ని
స్వనములు విందు, భేరుల రవంబులు విందుఁ, గరీంద్ర బృంహిత
ధ్వనులును విందు, నద్భుత విధంబుగ ని ట్లవి యెల్లఁ జిత్తమో
హన మొనరింపఁ జాలునె! మహానినదం బిది యోర్వవచ్చునే?
176
చ. చెవు లవిసెన్‌, దిశల్‌ దిరిగెఁ, జిత్తము నీరయిపోయె నాకు నీ
రవమున; నిమ్మహోగ్ర కపిరాజు పతాకయుఁ జూడ్కిఁ జీఁకటుల్‌
గవియఁగఁ గ్రాలెడున్‌, భవదఖండిత తేజము పర్వి యాత్మకున్‌
వివశతఁ జేయుచున్నయది, విహ్వల భావము మాననేర్చునే?’
177
క. అన విని తగు మాటల నా | తని కొందలపాటు పాండుతనయుండు క్రమం
బున డిందుపఱిచి యరదము | సనఁగా నెఱిఁగించి పట్టె శంఖము మఱియున్‌.
178
వ. ఇత్తెఱంగున నయ్యుత్తర కుమారు ధీరుంగావించుకొని పాండవవీరుండు రథనేమి నిస్వన జ్యానాద మేదురం బగు శంఖారవంబు సెలంగ నడచు సమయంబున నాచార్యుండు దుర్యోధనున కిట్లనియె. 179
సీ. ‘శ్రవణ పుటంబులు వ్రయ్యంగఁ దాఁకి సం | క్షోభంబు గావించె గుణము మ్రోఁత;
బ్రహ్మాండ భాండంబు పగిలించి భూత ని | శ్చైతన్య మొనరించె శంఖ రవము;
గగనభాగం బెల్లఁ గప్పి క్రాలుచు బెగ | డడరించె నుగ్రంపుఁ బడగపఱపు;
మిఱుమిట్లు గొని చూడ్కి పఱివోవ వెలిఁగి ప | రి భ్రాంతి సేసెఁ గిరీట కాంతి;
 
తే. తెల్ల మిది గాండివంబును దేవదత్త | మును గపిధ్వజమును వాసవుని వరమునఁ
గన్న మకుటంబు నగు; వేఱ కొన్ని యైన | నుజ్జ్వలాద్భుత భంగులై యున్నె యిట్లు!
180
ఉ. అచ్చెరువైన విక్రమము నగ్గలికన్‌ సమరంబు గోరి యీ
వచ్చుచునున్నవాఁడు బలవద్రిపుభీషణబాహుఁ డైన వి
వ్వచ్చుఁడ; యింక మిన్నక వివాదము సేసినఁ బోవ; దియ్యెడం
బొచ్చెము లేని బల్మగలఁ బోరి కమర్పుము దర్పమేర్పడన్‌.’
181
వ. అని కృపాశ్వత్థామాది యోధముఖ్యుల నవలోకించి. 182
క. ‘మనమొనల దుర్నిమిత్తము | లనేకములు పుట్టఁ దొడఁగె; నట్లగుట జయం
బనుమానం; బొక కార్యము | వినుఁడా! మీకెల్లఁ జూడ వెరవగు నేనిన్‌.
183
ఉ. ముందర రాజుఁ బుచ్చి, బలముల్‌ గలయంబడి గోవ్రజంబులన్‌
దందడి పెట్టకుండఁ బిఱుఁదన్‌ నడిపింపఁగఁ బంచి, గట్టిమై
నందఱు నింతకున్‌ వెనుకయై మొనలేర్చి చనంగ, నెప్డు సం
క్రందనసూతి డగ్గఱియెఁ, గయ్యము సేయుట కప్పు డిమ్మగున్‌.’
184
వ. అనిన విని సుయోధనుండు భీష్మ కృప కర్ణ వికర్ణుల దెసం గనుంగొని ‘మున్నునుం జెప్పితిన కాదె! జూదంబునం బరాజయం బొంది, పాండునందనులు పండ్రెండు వత్సరంబులు వనంబున వసియింపను, బదుమూఁడగు నేఁడు జనపదంబున మన మెఱుంగకుండఁ జరియింపనుం బూని కాదె భూమి వెలువడిరి; యా పదుమూఁడవ యేఁటి కొఱంత గలుగం బార్థుండు దన్నెఱింగించి కొనియె నేని నెప్పటియట్ల వనవాసంబునకుం జనవలయు; నిది మనము మోహంబునం గానమి నొండె; వారు లోభంబున వచ్చుట నొండె నగుం గావున నెక్కువ దక్కువలు నిరూపించి భీష్ములు దీని నిశ్చయింప నర్హులు; రిత్త యుత్తరుండ కాక గాండీవియు నగుట మన కార్యంబు సఫలంబు; సుశర్మ నక్కడ గోవులం బట్టం బనిచి యిక్కడ మనమును బట్టుట మత్స్యనగరంబునం గౌంతేయులున్నవారని శంకించి వారలు కూయి వచ్చినం గనుటకుం గాదె? యిట్లు నిశ్చయించి చేసిన పనికి నిపుడు విచారం బేల?’ యని పలికి వెండియు నిట్లనియె. 185
ఉ. ‘అర్జునుఁడైన నేమి? సురలైనను నేమగు? విద్విషచ్ఛిదో
పార్జితమైన గోగణముఁ బట్టితి; మెవ్వరు వచ్చిరేని వి
స్ఫూర్జిత బాహుసంపదలు సూపుద మొండొరు మీఱి నిర్మలా
త్యూర్జిత కీర్తికారణ రణోద్ధతి; వెల్వెలఁ బాఱ నేటికిన్‌?
186
చ. మనసుల నూలుకొల్పి, యనుమానము లెల్లను బాచి, యేచి వా
హనములు నాయుధంబులును నాయిత మయ్యెడు భంగిఁ జేయుచున్‌
మొనలకు హెచ్చుగా మనము మున్ను గడంగినఁ గాక శత్రులం
గనుఁగొని యిట్టు లొండొరు మొగంబులు సూచుచునున్నఁ బోవునే?
187
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )