ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
దుర్యోధనుఁడు ద్రోణాచార్యుల నధిక్షేపించుట (సం. 4-42-20)
ఆ. హరుల హేషితములు ననుకూల వాయు సం | చారములును మనకు జయము కలిమిఁ
దెలుపుచున్నయవి; యుధిష్ఠిరానుజుఁ డొక్కఁ | డీ బలంబు గెలువ నెట్లు నేర్చు?
188
క. ఎవ్వరు వినినను దీనికి | నవ్వుదురని యెఱుఁగఁ డకట! నా యెదురెదురన్‌
వివ్వచ్చుఁ జూపి సేనలు | క్రొవ్వఱఁ బలుపలుకులిట్లు ద్రోణుఁడు పలికెన్‌.
189
తే. రోష మొండెను రాజ్యాభిలాష మొండెఁ | గాక యీతని రాకకుఁ గారణంబు
పెఱ యెఱుంగమ; యెదిరిని బెద్దఁ జేసి | పూని వంది విధంబునఁ బొగడ నేల?
190
వ. ఆచార్యులైన వారలు కార్యంబు దవ్వులం గనియెడు వారు గాన కయ్యంబు తెఱంగు వారల నడుగ వలవదు; బుద్ధిమంతు లిండ్లకడనుండి భోజనావసరంబుల, నాయుధ శ్రమ సమయంబుల, నీతిశాస్త్ర గోష్ఠీకాలంబుల నుచితాలాపంబులు పలుకుదురు గాని పోట్లాడెడువారు గారు; వారిం గలనం గలసి నిలువనీక పిఱిందిదెస నిలిపిన మనకు వారు విజయంబు గోరుచుండుదు; రది లెస్స’ యనిన విని యశ్వత్థామ యతని కిట్లనియె. 191
ఉ. ‘కావలివారిఁ దోలి, యెసకంబున గోవులఁ బట్టికొంటి నం
చీ వెడమాట లేల ధరణీశ్వర! యింతకుమున్న వీటికిం
బోవవు, శత్రునే పుడిపి పోయెడు వాఁడవు గావు నీవు; సై
న్యావలి యైనఁ జేడ్పడక యాతల కెయ్దుట లేదు నేనియున్‌.
192
క. సమరమున గెల్చి, యొరు రా | జ్యము గొనియును సుజనుఁ డిట్టు లాడఁడు; సిరి జూ
దమునఁ గొని రజ్జు లేటికి? | సమయం బరుదెంచెఁ దొంటిచందము గలదే!
193
ఉ. పాండవవీరులం గలన బాహుబలంబున నోర్చియే సము
ద్దండత నీవు దొల్లి ద్రుపదక్షితిపాత్మజఁ గొల్వులోనికిం
దెండని పుచ్చి? తద్దెసకుఁ దెచ్చుట సౌబలు నీతిఁ గాదె? యా
తండ మరల్చుఁ గాక సముదగ్రత వచ్చు విరోధి నిప్పుడున్‌.
194
వ. అబ్భంగి నవమానింపం బడినవాఁడు గావున ధార్తరాష్ట్రకుల ధూమకేతు వగు కపికేతనుండు దోఁచె; నీకు దుర్మదంబున ద్రోణాచార్యుల నధిక్షేపింపవచ్చు నంతియకాక దేవదానవుల కయినను దుర్జయుండగు నర్జునునకుం దలసూప వచ్చునే! నయ విక్రమంబుల నతిలోకుండగు నతని నెవ్వరికేనియుం బొగడవలయు ననినం బుత్రనిర్విశేషుండగు నిజ ప్రియ శిష్యుని నగ్గించుట గురునకుం గొఱంతయె? యింక సిగ్గుమాలి రణంబు సేసెనేనియు ద్రోణుండు సేయుంగాని యే నిట్టి దాని కోర్వ; నదియునుం గాక. 195
క. ప్రళయాంతకుండు బడబా | నలమును మృత్యువును నెదిరినం గొఱఁతవడన్‌
నిలిపినను నిలుపు; మార్కొని | చెలఁగిన నరుశరము లనవశేషము సేయున్‌.
196
ఆ. కుటిలబుద్ధు లిచటఁ గొనవు; నెట్టన ఘన | దోర్బలంబు మెఱసి తొడర వలయు;
నతఁడు గాండివమున నడ్డసాళులు వైవఁ; | డురుల నంపవాన గురియుఁ గాని.
197
క. విను మట్టులు గాకున్నం | దన గోవుల వెనుక మత్స్యధరణీశుఁడు వ
చ్చిన మార్కొందుము; నరుఁ డే | పున ముట్టిన నతని పొంతఁ బోదుమె? యధిపా!’
198
వ. అనిన విని, రాధేయుండు సక్రోధుండై యోధవీర లోకంబు నాలోకించి. 199
చ. ‘వడిగొని గోగణంబుఁ బొదువం బఱతెంచితి రెల్లవారు ము
న్నొడఁబడి పాండునందనుల యున్నెడ యిమ్మెయిగాన వేఁడి; యి
ప్పుడు నరుఁ గాంచి మీ రతని పోటు నుతించుచు భీతి నిట్లు వా
విడిచి యనేక భంగిఁ బృథివీపతి వీఱిఁడిఁ జేయు టొప్పునే?
200
చ. వెఱచితిరేని నిల్వుఁ; డొకవీరున కొక్కఁడ చాలుఁ గాక యెం
దఱు వలయుం? గపిధ్వజము దవ్వుల వ్రేల్మిడిఁ ద్రుంచి వైచెదం;
బఱపెదఁ దత్పిశాచముల; భగ్నము సేసెదఁ దేరు; సారథిన్‌
నెఱఁకులు నొంచెదం; బొదులు నించెద నర్జును గాత్రశాలలోన్‌.
201
శా. జ్యాఘోషం బతిభీషణం బయి, దిశాచక్రంబు నిండన్‌, శర
వ్యాఘాతంబున శాత్రవుండు వికలస్వాంతుండుగా, నారద
శ్లాఘాపాత్రమునై; యనర్గళ భుజాసంరంభతన్‌ రౌద్రరే
ఖా ఘోరాకృతి యేన చూపెద; నశంకం జూడుఁడీ యేర్పడన్‌.
202
క. క్రోధజ్వాలలు నిగుడ, వి | రోధి బలేంధనముఁ బొదువు క్రూరతమై దు
స్సాధమగు నర్జునాగ్నిని | సాధించెద నేన పూని శరవర్షమునన్‌.
203
వ. పాండవమధ్యముండు పదుమూఁడు వత్సరంబులు పూఁచి పట్టి కయ్యంబునకు వచ్చె; నతని లావును బీరంబును లోకంబునకు నెక్కియున్న యవి; యేనును గురుసేనయందు శక్తి శౌర్యంబులు గలవాఁడన పోలె వర్తించెదం, గావున నే మిరువురము నొండొరులకు బాహుబల విలాసంబును, విక్రమ క్రీడా కౌశలంబును బ్రకటించుట యుచితంబు గాదె’ యని వెండియు నిట్లనియె. 204
సీ. ‘అనుదినంబును నంతకంతకుఁ బెరిఁగెడి | యధిపతి మన్నన యప్పుఁ దీర్ప,
నర్జును నోర్చెద ననిలోన నే నని | యతనితోఁ బలికిన ప్రతిన నెఱపఁ,
గర్ణార్జునులయందు ఘనుఁ డెవ్వఁడగు నొక్కొ | యను జనంబుల సందియంబు మాన్ప,
జమదగ్నిసుత కృపాశ్రయమునఁ బడసిన | విలువిద్య కలరూపు వెలయఁ జేయఁ
 
ఆ. గనుట నేఁడు పుణ్యదిన మయ్యె నాకు; మీ | కెల్లఁ బోరు సూడ నిష్టమేనిఁ
జూడుఁ; డట్లు గాక వేడుక లేదేని, | సంతసమునఁ బసుల జాడఁ బొండు.’
205
వ. అనిన నమ్మాటలు విని కృపాచార్యుం డతని కిట్లనియె. 206
ఆ. ‘కయ్యమునక యెపుడుఁ గాలు ద్రవ్వుదు, కార్య | గతికిఁ జొరవు; నీతియుతులు సమర
మధమ సాధనముగ నాడుదు రర్థ సం | సిద్ధిఁ బొందు తెఱఁగు సేయు నెడల.
207
క. అగు దేశకాల బల యుత | ముగఁ జేసిన పోర నర్థములు; మోఱకులై
తెగఁ బాఱి తమ్ము నెదిరిని | వగవక తొడరుటలఁ గీడు వర్తిల్లుఁ దుదిన్‌.
208
వ. అక్కిరీటి యొక్కరుండ కాఁడె యని తలంతు మేని. 209
సీ. శక్రాది సురలతో సంగ్రామ మొనరించి | ఖాండవం బేర్చె నొక్కరుఁడ కాఁడె!
యాదవ బలమెల్ల నాఁగఁ ద్రోచి సుభద్రఁ | గడిమిమైఁ దెచ్చె నొక్కరుఁడ కాఁడె!
దిగ్విజయంబునఁ దేజంబు చేసె ని | క్కురువంశమునకు నొక్కరుఁడ కాఁడె!
బలముతో గంధర్వపతి నోర్చి విడిపించెఁ | గౌరవేశ్వరుని నొక్కరుఁడ కాఁడె!
 
ఆ. అని నివాత కవచులను దానవుల నాతఁ | డొక్కరుండ కాఁడె యుక్కు మడఁచె;
నమరులకు నజేయులగు కాలకేయుల | నొక్కరుండ కాఁడె యొడిచెఁ గర్ణ!
210
క. భూవరులెల్లను నొక్కట | ద్రోవదికై తొడరి యతనితోఁ బెనఁగి కడుం
జేవ సెడి పోవు నప్పుడు, | నీ వచ్చట గలవొ లేవొ నిక్కమ చెపుమా!
211
శా. కుంతీనందను లొక్కఁ డొక్కఁడ రిపుక్షోభంబు సంధిల్ల దు
ర్దాంత స్వైర పరాక్రమంబులు మహోత్సాహంబునం జేసి; ర
త్యంతోదగ్రతఁ బల్కె దీ విచట బాహాశక్తి యిమ్మేదినీ
కాంతుం డియ్యకొనంగఁ బూనితి వృథా గర్వంబు నీ కేటికిన్‌?
212
తే. ఏచి మున్నీరు చేయీఁత నీఁద, నగ్ని | నుఱుక, వాసుకి కోఱలు పెఱుకఁ గడఁగి
నట్లు గాదె రాధేయ! నీ వర్జునునకుఁ | బోర నెక్కటి మార్కొనఁ బూను టరయ!.
213
క. బలుగాలిఁ బేర్చు దావా | నల మొక్కరుఁ డార్పఁ బోయినను దీఱునె? నీ
చల ముడుగు; సాహసమునం | గలదే మేలెట్లు? నధిపుఁ గావఁగ వలదే?
214
తే. కురువిభుండును భీష్ముండు గురుఁడు గురుత | నూభవుండును నీవు నేనును గడంగి
కూడుకొని తాఁకుదము, గాక క్రీడితోడ | నొంటి మార్కొనవశమె ముక్కంటికైన?’
215
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )