| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
అని పలికిన సంరంభం | బున నినసుతుఁ డిట్టులను ‘రిపులయెడఁ జిత్తం బున నీవు ప్రియము గలుగుటఁ | గనికని నినుఁ దోడు పిలువఁగాఁ బతి బేలే! |
216 |
| క. |
ఏలిన వాని ధనంబులు | బాలురు బంధువులుఁ దారు బ్రదికిన దినముల్ వేలారిచి తిం; డ్రాతని | యోలముగని పిదప భీతి నొదుఁగుదు రాజిన్. |
217 |
| క. |
జన్నములు సేయునెడఁ బ | క్వాన్నంబులు గుడుచుచుండు; మధిపతి నిన్నున్ జన్నియ విడిచె రణముతఱి; | మిన్నక కినువడక పొమ్ము మీగృహమునకున్. |
218 |
| తే. |
ఏను విల్లందుకొనిన నీరేడు భువన | ములును వడవడ వ డఁకు; నా యలఘు బాహు బలముఁ దలఁపక పలికితి; పార్థుఁ డనఁగ | నెంతవాఁ డొక్కరథికున కింత యేల?’ |
219 |
| వ. | అనియె; నిత్తెఱంగున నందఱుఁ బలుకు పలుకులెల్ల వినుచు గాంగేయుండు కౌరవేశ్వరు నుద్దేశించి ధర్మార్థ సంగతంబును సువిహితంబుగా నిట్లను; ‘ద్రోణాచార్యుండు నీతి పథంబునం బలికె, నాచార్యతనయు వచనంబు లుచితంబులు; కృపాచార్యుం డాడిన చందంబును దెఱంగువడియున్నయది; మన్ననగల మానిసియగుట నంగ రాజునకు సంగరపాటవంబు మాటలు దగుంగాక; మాన్యుల నధఃకరింపనగునే?’ యని వెండియు. | 220 |
| ఆ. |
‘నేల ప్రొద్దెఱింగి చాలుమానిసి రణో | ద్యమ మొనర్చి కాక, తగినవారి చెవికిఁ జేఁదుగాఁగ నవమాన వాక్యంబు | లుడుగ కిట్లు పలుకు టొప్పు నెట్లు? |
221 |
| క. |
బీరము లావును మిగులఁగ | వైరులు తఱియైనఁ దొడర వచ్చినచోటన్ దూరమున వెరవుతోడి వి | చారము గలుగు టిది దగదె సద్బుద్ధులకున్. |
222 |
| ఆ. |
అరుల గుణములైన నగ్గింతు రెప్పుడుఁ; | గలయ బెరసినపుడు కలితనంబు మెఱయుదురు మహాత్ము; లెఱుఁగఁడు తుదిమొద | లెట్టివారి నితఁడు బెట్టు పలుకు. |
223 |
| వ. | ఆచార్యులైన వారలు పూజా వాక్యంబుల కర్హులు గాక గర్హించుటకు విషయంబె?’ యనుచుఁ గృపాశ్వత్థామల కరంబులకు నిజపాణి పుటంబులు సాఁచి యిట్లనుఁ ‘బని చాలినంత గలదు; వివ్వచ్చుండు వచ్చుచున్నవాఁడు; విరోధంబునకు సమయంబు గాదు; మనమందఱముం గూడికొని కయ్యంబు సేయుదము; బలవద్‌వ్యసనంబు నందు భేదంబు గలుగు టొప్పదని బుధులు సెప్పుదురు; వేదంబు లొక్కవలనను, ధనుర్వేదం బొక్కవలనను, గల మీయట్టి మహానుభావు లెందునుం గలరె? కురుబలంబున కొకటి పుట్టినం బ్రసిద్ధులరు గావున నది మీతలన నిలుచు; నట్లగుటం జేసి. | 224 |
| క. |
క్షమియింప వలయు, నొకఁ డెఱుఁ | గమి నేమే నన్న నంతఁ గటకటఁ బడి భూ రమణుని కార్యస్థితి చి | త్త ములం దెడ సేయునట్టి తరమే మీరల్?’ |
225 |
| వ. | అనిన విని వార లిట్లనిరి. | 226 |
| క. |
‘క్షమియింప నెవ్వరము? భూ | రమణుని కార్యమున కెవ్వరము? ద్రోణుల చి త్తము శాంతి వొందఁ జేయుట | మముఁ దెలచుట; యిట్టు లేల మాకొలఁదులకున్?’ |
227 |
| వ. | అనిన విని, గాంగేయ కర్ణులం గూర్చికొని కురుపతి గురునిం బ్రార్థించి యశ్వత్థామను వేఁడికొని కృపాచార్యులం దేర్చినం, బ్రసన్నుండయి యోధవీరులం గలయం గనుంగొని ద్రోణాచార్యుం డిట్లనియె. | 228 |
| తే. |
‘అలుక భీష్ముని పలుకుల యపుడ పోయె; | మీఁది కార్యంబు నడపుఁడు మీర; లింక మోహ సాహసములఁ గురుముఖ్యు దెసకుఁ | గీడు రాకుండఁ దగఁ బరికింప వలయు. |
229 |
| క. |
వాసవనందనుఁ డెంతయు | గాసిలి యున్నాఁడు, మనలఁ గని యించుకయుం దా సైరణ సేయఁడు, గను | మోసము లే కొక్క మొగిన ముసరఁగ వలయున్. |
230 |
| వ. | అప్పుడు కురుపతి సమయకాల విషయంబుగా నాడిన మాటయుం గలదు; దాని నిరూపించియున్నరూపు గాంగేయుండు సెప్ప నర్హుఁ’ డనిన నతండు దుర్యోధనున కిట్లనియె. | 231 |