ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁ డర్జును నజ్ఞాతవాస వత్సరవ్యాప్తి నిష్కర్షించుట (సం. 4-47-1)
సీ. ‘రెండవ యేఁట నొక్కం డధిమాస; మి | ట్లెక్కిన యన్నెల లెల్లఁ గూర్చి
కొనఁ బదుమూఁడు హాయనములు దప్పక | నిన్నటి తోడన నిండె; నంత
యెఱిఁగియ తమపూన్కి యెల్లను దీర్చితి | మని పొడసూపె నర్జునుఁడు నేఁడు;
పాండుపుత్త్రులు ధర్మపరులు; ధర్మాత్మజుం | డేరి కధిష్ఠాత వారు ధర్మ
 
తే. పథము దప్పుదురే?; యన్నిపాటులట్లు | పడిన వారలు దఱియంగఁ బాఱనేర్తు
రెట్లు? తమకించి నీతి విహీన వృత్తిఁ | దమకు నొకకీడు వచ్చు విధంబుఁ గాఁగ.
232
ఉ. అట్టిద యైన నాఁడ తఱియంబడి మూర్ఖుతనంబు సేయరే?
నెట్టన ధర్మపాశముల నిల్చిరి; కాలము వేచియుండి; రిం
కెట్టును వారు గొంత తమ యేడ్తెఱ సూపక మాననేర్తురే?
ముట్టఁగ వచ్చిరేని మనముం దగ నోర్తముగాక దానికిన్‌.
233
ఉ. వచ్చినవాఁడు ఫల్గునుఁ డవశ్యము గెల్తు మనంగరాదు; రా
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే?
హెచ్చగుఁ గుందగుం దొడరు టెల్ల విధంబుల కోర్చు; టట్లుగా
కిచ్చఁ దలంచి యొక్కమెయి నిత్తఱిఁ బొందగు చేఁతయుం దగున్‌.’
234
వ. అనిన విని కురుపతి దరహసిత వదనుం డగుచు నిట్లనియె. 235
ఆ. ‘మనకుఁ బాండురాజ తనయ వర్గమునకు | నెట్లు పొందు గలుగు? నేను రాజ్య
భాగ మీను; సమరభంగిక విక్రమ | నిరతిఁ బూను; టిదియ నిశ్చయంబు.’
236
వ. అనిన నయ్యిరువుర వచనంబు లాకర్ణించి గురుం డిట్లనుఁ, ‘గార్యగతియును గయ్యంబు భంగియు భూపతి కంటె మిగులం గనియెడు వారులే, రయినను నా యెఱింగిన యంత నొక్క తెఱంగు సెప్పెద; నీ బలంబున నాలవ పాలుగొని మహీపాలుండు సత్వరంబుగా ముందర పోవలయు; నంతియసేన తదనంతరంబ కదుపులం బొదివికొని చనవలయుఁ; దక్కటి సగంబుతో మనము నిలిచి మోహరించి యల్లనల్ల నరుగవలయుఁ; గవ్వడి యెయ్యెడం గవిసె నయ్యెడన తలపడ వలయు; నిట్లైన మానవేశ్వరుండు సురక్షితంబుగా సందడింబడక నడచు; గోవులు నిన్నేలం గడచు; మనమును ధనంజయునకుం జాలిన యప్పుడ యటఁ దోడుపడ నెవ్వరు గలిగినను వారికిం జాలి నిలుత’ మనిన, విని, సురనదీసూనుండు దాని కియ్యకొని రాజన్యునకు సైన్యంబుఁ బంచి యిచ్చి, పుచ్చి, పసులకుం దోడగు భాగంబునుం బంచి, యున్నంత వట్టు చతురంగంబుల నియతి సేసికొని, యాచార్యుండు నడుమను, గృపాచార్యుండు వలపటను, నాచార్యపుత్త్రుండు దాపటం, గర్ణుండు ముందట, వికర్ణ దుశ్శాసన శకుని సైంధవ సోమదత్త బాహ్లిక భూరిశ్రవః ప్రభృతి యోధ వీరులెల్ల నెడనెడం గలయ నిలుచునట్లుగా మోహరించి, మహోత్సాహంబున సన్నాహ సౌందర్యంబు నొంది, తాలధ్వజం బెత్తించి, మెఱసి తాను వెనుకయయి నడిపించుచుండె; నట్టి సమయంబున. 237
చ. అరుదుగ నిట్టు లొక్కనికి నంతబలంబునకున్‌ మహోగ్ర సం
గర మగుడున్‌ మనం బతుల కౌతుక మొంది కనుంగొనన్‌ సురే
శ్వరుఁడు సుదర్శనంబనఁ బ్రశంసకు నెక్కు విమానమెక్కి యం
బరగతి వచ్చె దేవముని పంక్తులు సిద్ధగణంబుఁ గొల్వఁగన్‌.
238
వ. అ ద్దివ్యయానరత్నంబునందు. 239
తే. స్వర్గమున నున్న రాజులుఁ జక్రవర్తు | లును యథోచిత చ్ఛత్రంబులును నిజార్హ
చామరంబులుఁ జెలువొందఁ జారులీలఁ | గొలిచియుండిరి వేడ్కలు కొనలు నిగుడ.
240
క. పాండుమహీపాలుం డా | ఖండలు చేరువన పెద్దగద్దియ నమరీ
మండలి వీచోపు లిడఁగ | నుండి కనుంగొనుచు నుండె నుజ్జ్వల భంగిన్‌.
241
వ. అంత. 242
సీ. దేవదత్తాభీలరావంబు వెసఁ గర్ణ | ముల దీటుకొన, లేట మొగము పడుచు,
రథనేమి దళిత ధరాధూళి యంగంబు | లెల్లఁ గప్పఁగ వెలువెల్ల నగుచు,
బహుళ కపిధ్వజ ప్రభలు లోచనములు | మిఱుమిట్లు గొనఁ బర్వ మేడుపడుచు,
నుద్భటాకార సముద్ధతి మనము లు | త్తలపాటు దోఁపంగఁ దల్లడిలుచు
 
తే. నడచు కౌరవరాజు సైన్యంబుఁ గదిసెఁ | దీఁగ దిగిచినగతిఁ దనతేరు మెఱయ
రయముమైఁ జని ప్రళయ భైరవ సహస్ర | గర్జనోదగ్ర తర్జనుఁ డర్జునుండు.
243
వ. ఇవ్విధంబునఁ గురుబలంబులఁ గ్రోశద్వయంబునం గూడముట్టి క్రీడి తలయెత్తి చూచి యుత్తరున కిట్లనియె. 244
చ. ‘ఇది యొక పెద్ద గట్టిమొన; యీ మొనముందట గోగణంబుతో
నది యొక యల్పసైన్య; మట యాతల వేఱొక కొంతసేన య
ల్లదె; యిటు పంచిపెట్టఁ జను నంతటిలోన వృధాభిమాన దు
ర్మద బహుభాషియైన కురురా జెచటం జనుచున్నవాఁడొకో!
245
క. అరయుదముగాని యిమ్మో | హరమునకును డాపలించి యరదముఁ బోని
మ్మురవడి; నతనిక యుఱికెద | నరుదుగ నెబ్భంగి నెవ్వ రడ్డం బైనన్‌.
246
ఉ. ఆతఁడు సిక్కెనేని బలమంతయు విచ్చు; మరల్పవచ్చు గో
వ్రాతము; నట్లయైన సుకరంబుగ నంతట నెల్లఁ దీఱు; నీ
యాతత సేనయం దతని నారసి కానకయున్న వీరి ని
ట్లీతల డించి యా కదుపు నెయ్దఁగఁ బోదము గాక వ్రేల్మిడిన్‌.
247
క. విచ్చి చనకుండఁ బసులం | దెచ్చుట మునుమున్న వలయు తెఱఁ; గా పనికిం
జొచ్చి యది చక్కఁ బెట్టఁగ, | నచ్చోటన దాయ మనకు నగపడెడు బలే!
248
క. అనిన విని, యుత్తరుం డ | మ్మొన వలపటఁ బెట్టి యరదమును బోవఁగ ని
చ్చిన సరస కరిగి కవ్వడి | కనువిచ్చి బలంబునెల్లఁ గలయఁగఁ జూచెన్‌.
249
వ. ఇట్లు గనుంగొని, మధ్య దక్షిణ వామాగ్ర పశ్చిమోత్తర భాగంబుల నిట్టిట్టి వారలు నడచుచున్న వారని సారథితో నేర్పడం బలికి, ‘వీరలలో నురగకేతనుండు లే,డతఁడు గోవులం గొనిపోవ నోపు; నిరామిషంబైన యీ సేనతో నని సేయం బని లేదు; వీర లెయిది యడ్డపడి తడవు సేయకుండునట్లుగా; ముట్టికొని పసులన్‌ బెట్టించి, దొరయును నేల గడవం బోవక యుండఁ బొదువవలయు’ నని చెప్పి యతని నద్దెసకుఁ దేరు వఱుపం బనిచి, గురుకృప గాంగేయులకుఁ జరణ సమీప స్థలంబుల నిలువ రెండును, కర్ణాభ్యర్ణ ప్రదేశంబులం జన రెండునుగా నాలుగేసి యమ్ము లేసిన, నా సవ్యసాచిం జూచి యాచార్యుండు పరిసరవర్తులగు నాప్తజనంబులతో నల్లన ‘యర్జునుం డింత యొప్పియుండునే!’ యని యగ్గించి వెండియు. 250
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )