| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - చతుర్థాశ్వాసము |
| మ. |
‘విలసద్గాండివ చాలనోద్ధతి కనద్విద్యుల్లతాలీలగా నలఘుస్ఫార కపిధ్వజ ధ్వని సముద్యద్గర్జ చందంబుగా; జలదాకారతనొందెఁ దే రితఁడు పర్జన్యాకృతిం బొల్చె; దో ర్బలతీవ్రారి నిదాఘ దుర్విషహ గర్వస్ఫూర్తి నిర్మూర్తిగాన్. |
251 |
| వ. | ఇప్పుడు నాకుఁ బ్రణామంబులుగాఁ బాదంబుల మొదలంబడ రెండమ్ములేసి, పెద్దకాలంబేనిఁ బాసియున్నవాఁడు గావునఁ గుశల ప్రశ్నంబుగాఁ జెవులు సోఁకియు సోఁకములుగా రెండమ్ములేసె’ నని పలికి వెండియు నిట్లనియె. | 252 |
| క. |
‘ఇడుమలఁ బదుమూఁడేండ్లుం | బడి, కడుఁ గోపించి వచ్చె బలువిడి నీ క వ్వడి దఱియ నుఱికి వడి ని | ప్పుడ యిమ్ముఱు ప్రోవు నెల్లఁ బొరిగొనెడు బలే! |
253 |
| తే. |
విపినవాసంబు, నజ్ఞాత విధము వర్త | నంబు, గడపి నవాభ్యుదయంబు నొంది రాత్రిఁ బుచ్చి తోఁతెంచు మార్తాండు మాడ్కిఁ | జూడ నుజ్జ్వలుండగుచు నర్జునుఁడు పొలిచె.’ |
254 |
| వ. | అనియెఁ; గృపాచార్య భీష్ములు పార్థుబాణపాత ప్రకారంబులు ప్రణామ కుశల ప్రశ్నంబులుగ నంతరంగంబులం గనికొని సంతసిల్లిరి; ధనంజయుండును దక్కినవారికి దుర్నిరీక్షుండగుచు నమ్మోహరంబు దెస ననాదరంబు సేసి గోవుల పజ్జం బోవుచుండె; నతనిం జూచి సురనదీసూనుండు కురువీరులతో నిట్లనియె. | 255 |
| క. |
‘చిరకాలమునకుఁ గంటిమి | నరు; నక్కట! వీఁడు సజ్జనప్రియుఁడు సుహృ త్పరతంత్రుఁడు బాంధవహితుఁ | డరిభీకరుఁ డిట్టి వార లవనిం గలరే! |
256 |
| క. |
మనచూడ్కికి వ్రేఁగయి యీ | తని యతులిత మూర్తి యత్యుదాత్తతఁ గడు నొ ప్పిన యది గంటిరె! జగమె | ల్లను నేలఁగఁ దగు సముజ్జ్వలత యూహింపన్. |
257 |
| క. |
వెనుక దెస వచ్చి కదిసియుఁ | దనరథముఁ దొలంగ నిచ్చి, తఱియఁబడుట కొ ల్లని తలఁపు కలిగి, క్రేఁగం | టన మనలం జూచుచుం గడచి యట నడచెన్. |
258 |
| క. |
మొనఁ గలయఁ జూచి యూరక | చను టధిపతి నరసి తా నిచటఁ గానక యా తని పజ్జ నరుగు తెఱఁగగు; | ననుమానము లేదు, క్రోధ మగ్గలము మదిన్. |
259 |
| చ. |
మనకును గౌరవేంద్రునకు మధ్యముఁ జొచ్చిన యేని నాతఁ డ ర్జునునకు నొంటి సాలఁ; డని రుద్రుఁడు నెక్కటి మార్కొనంగ లేఁ డనిన నొరుండు శక్తుఁడె? రయంబు మెయిన్ మన మెల్ల నిప్పుడా తనికడ సేరఁగాఁ జనుట దప్పినఁ గార్యము దప్పు నెంతయున్. |
260 |
| ఆ. |
వాసవాత్మజుండు వసుధేశనందను | ముట్టికొనిన నొకటి పుట్టెనేని మన ప్రయోజనంబు మఱి యేమి? పసులవి | యేటి? కొండు ధనము లెల్ల నేల?’ |
261 |
| వ. | అని పలికి, బలంబుఁ బురికొల్పికొని యతండు రాజరక్షణ తత్పరత్వంబున నరదంబు సత్వరంబు సేసిన, సేనాపతిం గని సైనికనికాయంబులుం గడంగి చనందొడంగె; నిప్పాట నమ్మేటిమొనయును వెసం బోవ గోవుల కావలి మూఁకయు వానిం దఱిమికొని యతిరయంబున నరుగం దానును గెలనఁ గ్రోశద్వయ మాత్రంబు నడచి పురుహూతపుత్త్రుం డుత్తరున కిట్లనియె. | 262 |
| మ. |
‘ఇదె గోవర్గము సేర వచ్చితిమి, పోనింకేల? సైన్యంబులుం గదియన్ వే చనుదెంచె; రెంటినడుమంగాఁ జొచ్చి యీ వచ్చు ను న్మద వీరావలికిన్ భుజావిభవ విన్యాసంబు గాన్పించి మా న్చెద గర్వంబు, మరల్చెదం బసుల; నాచేఁ జిక్కు రా జెమ్మెయిన్.’ |
263 |