ఇతిహాసములు భారతము విరాటపర్వము - చతుర్థాశ్వాసము
యుద్ధారంభము (సం. 4-48-12)
క. అనుటయు, విరాటతనయుఁడు | మొన కడ్డము గాఁగఁ దూర్పుమొగమై రథముం
గొని కట్టెదిరికిఁ బోయినఁ | దన మూఁపులు రెండు నపుడు దలకుం గడవన్‌.
264
వ. తేరు సమ్ముఖంబు సేయించి పేరు వాడి క్రీడి కరతలం బెత్తి ‘నిలు నిలు’ మని యదల్చిన ఘోషంబు తోడన వెడలు నిశిత శర పరంపరల దట్టంపుఁ బఱపున నంబరంబు నీరంధ్రం బగుటయుఁ దదంధకారంబును భయతిమిరంబునుం గలసి గుండియ లవిసి కురుబలంబు లెదురు నడవను మఱలం బఱవను మఱచి, వెఱచఱచి హరితనయ హస్తలాఘవప్రశస్తి దక్కందక్కిన చేష్టలు దక్కియుండె; నతండు గోవుల వెనుకం బోవు నల్పబలంబు బెదరి తూర్పు దెసకుం జెదరునట్లుగా నరదంబుఁ బఱపించి తెఱపి సూపి వెలిచీర సారించి దేవదత్తంబు పూరించినం గేతుకపి గర్జిల్లం, దదీయ భూతంబు లార్వ, మౌర్వీ రవంబును, రథనినదంబును, బ్రతిపతాకినీ తుములంబును, గగనంబునం బొగడు నమరుల యెలుంగులును నొక్కటఁ జెలంగ సముదిత సాంద్ర సంరావంబు రోదసీ కుహరంబు నిండిన, నొండొండ తోఁకమట్ట లెత్తుకొని నేలమట్టవియుచు నద్రువం బసులు వెసం దిరిగి మున్ను వివ్వచ్చుండు వచ్చిన జాడ గైకొని దక్షిణదిశకుఁ గెరలు వొడుచుచుం దెరలం బాఱిన. 265
క. గోవులతోఁ బొదువం బడి | పోవుచునున్నట్టి గోపపుంజంబు తదీ
యావసరంబున సరభస | మై వాని పిఱుందఁ దిరిగి యమ్మెయిఁ బఱచెన్‌.
266
ఆ. అప్పు డర్జునుండు దప్పక చూచి ‘యీ | బలము పసుల కడ్డపడక యుండ
నెడ సొరంగ వలయు నిట యెయ్దికొను’ మని | పనిచె మత్స్యభూమిపాలసుతుని.
267
క. పనిచిన నాతఁడు నమ్మెయిఁ | జన నిచ్చె రథంబు; గోపసంఘముఁ ‘దిరమై
కొనిపొండు పసుల నోడక’ | యని తా నెలుఁ గిచ్చి వీటికై నూల్కొలిపెన్‌.
268
వ. అట్టి సమయంబున. 269
క. కరితురగ సమితిఁ గార్కొని | కురువీరుల మొనలు మొగులు కొమరునఁ గవియన్‌
శరవేగంబున నరుఁ డు | ద్ధుర మారుత చండభంగి దోఁపఁ దెరల్చెన్‌.
270
క. కదిసిన బలములు విచ్చినఁ | గదుపులఁ జెదరంగ నీక గాండీవి వెసం
బొదివి యట కడపె; నవియును | గొదగొని తమపొలము సొచ్చె గోపాలురతోన్‌.
271
వ. అని చెప్పిన విస్మయంబు నొంది. 272
ఆ. ‘పసులు పట్టువడిన పదపడి నరుఁ డెద్ది | యాచరించెఁ ? గౌరవాధినాథుఁ
డేమి సేసె? బలము లెట్లయ్యె? భీష్మాది | వీరు లెవ్విధంబు వార లైరి?’
273
వ. అనవుడు. 274
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )