ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
అర్జునుఁ డుత్తరునకుఁ గౌరవవీరుల వేఱువేఱ నిరూపించి చెప్పుట (సం. 4-49-1)
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నివ్విధంబున విరోధివర్గం బుక్కు దక్కి వెక్కసపడి చూచుచుండ నిరర్గళ భుజార్గళ సంరంభ విజృంభణంబు శోభిల్లఁ బసులం బెట్టించి యనతిదూరవర్తియగు కౌరవచక్రవర్తిదెసం గనుంగొని ధనంజయుండు భూమింజయు నక్కడఁ దేరు వఱుపం బనుప నప్పళించు నప్పుడు కురువీరులు గూడుకొని మూఁడువేల రథంబులతోడను గాంగేయకర్ణు లొక్కొక్కరుండు వేయింటి తోడను దలకడచి రాజున కడ్డుపడి కవ్వడిదిక్కు మొగంబుగాఁ దిరిగి; రట్టియెడఁ గదుపులు పట్టువడుటకు నిట్టూర్పు నిగిడించుచు మగిడి మనుజపతియు ననుజసహితుండై సహస్రస్యందనములతోడ వెన్ను దన్ని నిలిచె; నంతఁ దక్కటి బలంబులు నెయిదికొని యమ్మెయిన దళంబుగాఁ గవిసిన. 2
క. కనుఁగొని యెలన వ్వొలయు వ | దనమున గరువంపుఁ జెన్ను దలకొనఁగా న
ర్జునుఁడు విరాటసుతున కి | ట్లనుఁ గేవల వీరరసమయాత్మకుఁ డగుచున్‌.
3
సీ. ‘కాంచనమయ వేదికా కనత్కేతనో | జ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు;
సింహ లాంగూల భూషిత నభోభాగ కే | తు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుఁడు;
కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట | ధ్వజ సముల్లాసంబువాఁడు కృపుఁడు;
లలితకంబుప్రభాకలిత పతాకా వి | హారంబువాఁడు రాధాత్మజుండు;
 
తే. మణిమయోరగ రుచిజాల మహితమైన | పడగవాఁడు కురుక్షితిపతి; మహోగ్ర
శిఖరఘన తాళతరువగు సిడమువాఁడు | సురనదీసూనుఁ; డేర్పడఁ జూచికొనుము.
4
క. గురునకుఁ బ్రదక్షిణంబుగ | నరదముఁ బోనిత్త; మిమ్మహాపురుషు నెడం
బరిభవము వలవ; దీతఁడు | కురుకుల నృపతనయ శిక్షకుఁడు సు మ్మనఘా!
5
క. శస్త్ర ప్రకార నిపుణుం, | డస్త్ర విదుఁడు, దూరపాతనాభీలుఁడు, వ
ర్చస్త్రాసిత రిపుఁడు, ధను | శ్శాస్త్రపరిజ్ఞానఘనుఁ డసదృశుఁడు శక్తిన్‌.
6
ఉ. ఈతనితోడి కయ్యమున కియ్యకొనం దగ; దేను దుష్పథ
ద్యూత జయోద్ధతుండగు సుయోధనునిం బరిమార్పఁ బోవుచో
శాతశరోత్కరం బితఁడు చక్కఁగ నేయునొ? నన్ను నేయఁడో?
చూతము; తాన ము న్ననికిఁ జొచ్చినఁ జొత్తముగాక పిమ్మటన్‌.
7
క. గురుపుత్త్రుఁడు తేజోనిధి; | సురాసురులకైనఁ దేఱి చూడ నరిది సం
గరమున నీతని; నీశ్వర | వరజనితుఁడు; మేటి కౌరవవ్యూహమునన్‌.
8
క. ధైర్యధనుఁ డితఁడు ద్రోణా | చార్యుల కెనవచ్చు దివ్యశరవిదుఁడు కృపా
చార్యుఁడు; మత్పితృసఖుఁ డా | చార్యక మొనరించె మాకు శైశవముతఱిన్‌.
9
తే. వీర లిరువురు మాన్యులు; వీరి తోడి | కయ్యమున కిప్డు మన మంత గాలుద్రవ్వ
వలవ; దెచ్చోట నెదురుగా మెలఁగి రచట | మన రథం బల్లనల్లన చనఁగ నిమ్ము.
10
శా. యోధాగ్రేసరుఁ డిద్ధతేజుఁడు, రణోద్యోగానురక్తుండు, దు
స్సాధ ప్రక్రమ బాహు వీర్యుఁడు, కురుక్ష్మాపాల వాల్లభ్య ల
క్ష్మీ ధామాత్ముఁడు, జామదగ్న్య కలిత శ్రేష్ఠాస్త్ర విద్యాఢ్యుఁ డీ
రాధేయుం డొక చీరికిం గొనఁడు వీరవ్రాతముం బోరులన్‌.
11
క. శౌర్యాటోపంబున దో | ర్వీర్యంబున, నస్త్ర శస్త్ర విత్త్వమునను మా
త్సర్యంబు సేయు నాకును | దుర్యోధనుఁ డెపుడుఁ ద న్నెదురు సేయంగన్‌.
12
చ. అతిదృఢవేధి పేరుగలయట్టి మగండు రణంబు గల్గె నేఁ
డితనికి నాకుఁ దెల్లముగ నిట్టియెడం బరికించి చూడుమీ!
మతి గలఁగంగనీక యనుమానము వాయఁగ నీవు సాయకో
ద్ధతిఁ బ్రకటించుచో బహువిధంబుల నిద్దఱ తారతమ్యముల్‌.
13
క. ఈయన ననుఁ గని సైరణ | సేయం డితఁ డగ్గమైనఁ జిచ్చఱపిడుగై
పోయి పయిఁబడుదు; నీ వర | వా యించుక లేక పఱపవలయు రథంబున్‌.
14
ఉ. ఉగ్రుఁ, డనూన మాన మహిమోన్నత చిత్తుఁ, డజయ్య విక్రమో
దగ్రుఁడు, హస్తలాఘవ సమన్వితుఁ డేయునెడన్‌, సమగ్ర కో
పాగ్రహబుద్ధి మా దెస, ననార్యుఁడు గార్యమునందు ధార్తరా
ష్ట్రాగ్రజుఁ డీతనిం గదిసినప్పుడు పండువు నాకు నుత్తరా!
15
తే. అరసికొని యెన్నిభంగులనైన నితని, | తేరు మనబారి కగపడు తెఱఁగు గాంచి
యడరి బాసటయై యెవ్వ రడ్డపడిన | మెఱపు మెఱసిన చాడ్పునఁ దఱియఁ జొరుము.
16
క. అస్మత్పితామహుం డతి | విస్మయ జనన ప్రతాప విభవాగ్ని శిఖా
భస్మీభూత ప్రతిప | క్షస్మయ కాననుఁడు, ప్రథమగణ్యుఁడు బుద్ధిన్‌.
17
క. బహు మహితాయుధ విద్యా | రహస్య సంవేది, ధార్తరాష్ట్రులకును మా
కు హితంబ కోరు సముఁడై, | సహాయ మగు వారలకు నచటఁ దా నునికిన్‌.
18
క. వివిధము లగు లక్ష్యంబుల | నవలీలం దునియ నాట నవియఁగ నేయున్‌;
భువనైక ధన్వి నత్యు | గ్ర విచేష్టితు నోర్చెఁ బరశురాముం బోరన్‌.
19
క. శంతనునందను నరదము | పొంతం బోవలవ; దలుక పుట్టి యతఁడు భూ
కాంతునకు సైన్యమునకుం | జెంతలఁ జేరంగనీక సిలుగులఁ బెట్టున్‌.’
20
వ. అని యిట్లు వేఱు వేఱం జూపి, క్రమంబున నేర్పడం జెప్పి సవ్యసాచి సమరోన్ముఖుం డగు సమయంబున సస్మితుం డగుచు నశ్వత్థామ రవితనయు నవలోకించి యిట్లనియె. 21
క. ‘నిను నీవ పొగడికొని పలి | కిన పలుకులు పెక్కు గలవు; క్రీడి యనికి వ
చ్చినవాఁ డిదె పులివలె; మా | ర్కొన రాదే కర్ణ! సేనకుం బ్రియ మెసఁగన్‌.
22
క. తలఁకు గలదేని శకునిం, | బిలిచి విచారింపఁ బొమ్ము; పృథివీపతి నీ
తలన తన కార్యఖడ్గం | బుల మోపెక్కించె; రిత్తవోవునె నీకున్‌?
23
వ. అనిన విని యతండు క్రోధ ఘూర్ణమాన తారకుం డగుచు నిట్లనియె. 24
చ. ‘తలఁకెడు వానికిన్‌ మగఁడ తానటె నన్నడఁకించు వాఁ? డిసీ
పలుకకు; భీతున ట్లొదుఁగఁ బాఱునె శూరుఁడు? నిన్ను నచ్చి యే
కలనికి వచ్చితిన్‌; నరుఁడ కాఁ డట వాసవుఁడైన నేమి నా
బలముఁ జలంబు నేరిమియు బంటుతనంబును నీవ చూడుమీ!’
25
క. అని కడఁగు నినసుతునకు | న్మును ద్రోణుఁడు ద్రోణనందనుఁడుఁ గృపుఁడును శాం
తనవుఁడుఁ గడఁగుట దుర్యో | ధనుఁ డవలోకించి యత్యుదగ్రతఁ గడఁగెన్‌.
26
వ. ఇవ్విధంబున నయ్యేవురు దొరలును ధరణీశుండును సరభసంబుగా బరవసంబు సేసిన దుశ్శాసన దుష్ప్రహ దుర్ముఖ ప్రముఖ నిఖిల కురుకుమార నికాయంబును శకుని సైంధవ ప్రభృతి బంధు నివహంబును బాహ్లిక సోమదత్తాది సామంత నికురుంబంబును మఱియునుంగల వివిధ యోధ వీర నిచయంబును నొక్కటఁ గరటిఘటా ఘోటకధట్ట రథయూధ పదాతి వితతి సంరంభ శుంభత్సేనా సమూహ సహితంబుగాఁ ద్రోచి నడచిన. 27
చ. ధరణి వడంకె, ధూళి దివిఁ దన్నిన భానుని గానరాద, బం
ధుర వివిధప్రకార పటు తూర్యరవంబులఁ బొంగె దిక్కు లా
స్ఫురిత మహాయుధోగ్ర రుచిపుంజ విజృంభణ ఘోర మయ్యె నం
తరము సహస్రనేత్ర ముఖదైవత మండల దుర్నిరీక్షమై.
28
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )