ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
అర్జునుఁడు కౌరవసైన్యంబుల నుఱుమాడుట
వ. అట్టియెడ నుద్భటహాసోల్లాస భాసురముఖుం డగుచు శతమఖ తనయుండు. 29
చ. గుణమున లస్తకంబునను గోటియుగంబునఁ గేలఁ దార భీ
షణముగ నుప్పతిల్లి రభసంబున రేఁగిన మాడ్కిఁ దీవ్ర మా
ర్గణనికరంబు లొక్కట నరాతి బలంబులఁ గప్ప, గాండివ
క్వణనము రోదసీకుహర కర్పరముం బగిలింప, నుగ్రతన్‌.
30
క. తలపడి తలమీఱిన కా | ల్బలములఁ బొడిసేయు; మఱియుఁ బైపైఁ బీనుం
గులఁ ద్రొక్కికొనుచు వెస ముం | గలిమొనఁ గవియుటకు వేడ్క గడలుకొనంగన్‌.
31
క. తన దృష్టియు ముష్టియుఁ దగు, | ననువున మున్నెత్తి యేయు; నతఁ డప్పుడు డిం
చినఁ గాయముల సపాటం | బునఁ బదియుఁ బదేను నుచ్చి పోయెం గోలల్‌.
32
చ. ఉడుగక వెండియున్‌ సుభటు లొక్క మొగిన్‌ వెస నంటఁ దాఁకి క
వ్వడి పటుబాణ భాస్వదనివార్య సముద్ధతిఁ జేసి మంటలో
మిడుతలు సొచ్చిన ట్లయిన మేటిమగల్‌ గని యీడఁబోక బ
ల్విడి మఱియున్‌ వడిం బొదువ వ్రేల్మిడిఁ ద్రుంచె నతండు దోడుతోన్‌.
33
తే. అంతకంతకుఁ గదిసి సైన్యములు సుట్టు | ముట్టి శ స్త్రాస్త్ర సంచయమున నభంబు
దీటు కొనునట్లు సేయఁ గిరీటి గాండి | వంబు పరిచాలనంబు దీవ్రంబు గాఁగ.
34
సీ. గోరఁ బోఁజిన మాడ్కిఁ గొన్నింటిఁ జక్కసాఁ | బాలుగా వ్రయ్యలు వాపి పాపి,
బాడిస నఱకిన భంగిఁ గొన్నింటిఁ దు | త్తునియలుగా బిట్టు త్రుంచి త్రుంచి,
వెస ఱంపమున నిడ్డవసిగఁ గొన్నిటి నిసు | మంతలుగా నుఱుమాడి యాడి,
పనివడి ఱోలఁ గొట్టినలీలఁ గొన్నింటిఁ | జిఱునుగ్గుగాఁ బొడి సేసి చేసి,
 
తే. యడరి పొదివిన బలము నానాయుధములఁ | బ్రతిహతంబులఁ గావించె నతిరయమున
నక్షత ధ్వజ సూత హయత్వ లస ద |ఫల్గురథవల్గనుం డగు ఫల్గునుండు.
35
క. ఆ మెయిన వివిధ వర్మ | స్తోమం బఱువుళ్ళు సేసి సునిశిత బాణో
ద్దామ ప్రసార విభవ | శ్రీ మార్తుర కద్భుతంబు సేసెం గడిమిన్‌.
36
క. గర్జద్గుణుఁడై పగతుర | జర్జరితాంగులుగఁ జేసె సాయకజాల
స్ఫూర్జన చూపఱు వొగడఁగ | నిర్జరవరనందనుండు నిమిషార్ధమునన్‌.
37
శా. శక్తిస్ఫార ధనంజయాయత భుజా సంరంభ గాండీవ ని
ర్ముక్త క్రూర శరావలీ దళిత శత్రువ్రాతముల్‌ శోణితా
సిక్తాకారతఁ బొంది సాంద్రకుసుమశ్రేణీ వికాసోల్లస
ద్రక్తాశోక తరువ్రజంబుల క్రియన్‌ రంజిల్లి యొప్పెం గడున్‌.
38
చ. తదవసరంబునన్‌ దొర లుదగ్రతఁ ద్రోచిన వజ్రధట్టముల్‌
మదమున నొక్కపెట్ట బలమర్దనుసూను రథంబు గ్రక్కునం
బొదివెఁ దురంగ కింకిణుల భూరిరవంబుఁ గరీంద్ర ఘంటికా
భ్యుదిత నినాదమున్‌ రథవరోత్థిత ఘోషము నుత్కటంబుగన్‌.
39
తే. అట్టియెడ వేల్పు వచ్చినయట్ల మేను | వొంగ నలి రేఁగి పాండవ పుంగవుండు
మత్స్యనృపనందనుని బలుమాట తోడి | యేపు సెవికిని జూడ్కికి నింపు నొసఁగ.
40
క. మేదుర దీర్ఘతరం బగు | నాదం బెడతెగక గుణమునను వడి నిగుడం
గోదండము సంతతవల | యోదాత్తస్ఫురణ వెలుఁగుచుండఁగ నేసెన్‌.
41
మ. ఒక మాత్రన్‌ వితతప్రసార నిబిడాత్యుగ్రాస్త్ర సంతానముల్‌
సకలానీకములందుఁ బర్వ నరు భాస్వన్మూర్తి శోభిల్లె దీ
ప్తికలాపంబులు లోక మంతటను విస్తీర్ణంబులై యౌగప
ద్యకృత వ్యాప్తి వెలుంగ నొప్పెసఁగు మార్తాండున్‌ విడంబించుచున్‌.
42
క. నరు లొరులు దృశ్యములపైఁ | బరఁగింపఁగఁ జూడ్కు లెట్లు వడుఁ దప్పక య
ప్పరుసున నరుఁ డేయు నిశిత | శరములు లక్ష్యములు దప్పి చన వించుకయున్‌.
43
క. గజ ఘోటక రథ సూత | ధ్వజకంకట యోధగాత్ర తతియం దెచటన్‌
విజయ ధనుర్ముక్త శర | వ్రజములు దవులంగఁ, బడ కవారణ నిగుడున్‌.
44
చ. కవదొన లేల పూనునొకొ కవ్వడి నా వల; దుగ్రసంగరో
త్సవమున సవ్యపాణి నపసవ్యకరంబున మార్చి, మార్చి గాం
డివము ధరింపఁగా శర పటిష్ఠతయుం బొరిఁ జేయి మార్చి చూ
పు వెరవుతోన వీడ్వడక పొం దొడఁగూడెడు నెప్డు సూచినన్‌.
45
క. సమ విషమ వినిమ్నోన్నత | సమీప దూర స్థలములు సదృశములుగఁ జి
త్తము క్రియ నవిహత గతులను | సమరమహిం గ్రీడిరథము సను నవితథమై.
46
వ. వెండియు నతండు. 47
మ. బలమెల్లన్‌ వెఱ రెండుపాయలుగ శుంభద్వేగుఁడై చొచ్చి యా
వలగా నడ్డము వచ్చి నాలువుగ దుర్వారోద్ధతిం బోయి మూ
లల నానాశకలాకృతిం బొరయ లీలాయానదుర్దాంతుఁడై
వలయంబుల్‌ సని చించి చిక్కువఱుచున్‌ వైకల్య సంపాది యై.
48
వ. ఇవ్విధంబున నంబుధిలోన మహామత్స్యంబు విహరించు చందంబునఁ దదీయ రథంబు కౌరవసైన్యంబునందు సంచరించు నయ్యవసరంబున. 49
ఆ. రత్నకేతనములు రాజిత శేఖరం | బులును రుచిరఘంటికలును బార్థు
బాణ నిహతిఁ దునిసి పడుఁ గౌరవులచేటు | దెలుప డుల్లు నుల్కములను బోలె.
50
క. నరు భల్లంబుల నగ్రిమ | చరణంబులుఁ ద్రెస్సి మ్రొగ్గు జవనాశ్వంబుల్‌
కరుణమెయి రాహుతులకున్‌ | శరణం బగు మనుచు మ్రొక్కు చందం బొందెన్‌.
51
క. దంతి ఘటాసంతానము | కుంతీసుతు నారసములఁ గూలినతఱి న
త్యంతనిబిడాభ్రముల దివి | యెంతయు సొంపారు భంగి నిల సెలువొందెన్‌.
52
క. పలుపులుఁ గాండ్లుం బగ్గం | బులుఁ దన యస్త్రంబు లడరి పొడిచేసిన వి
చ్చలవిడిఁ బాఱెడు రథ్యం | బుల నేయఁడు దివిజరాజపుత్రుఁడు కృపతోన్‌.
53
ఆ. అర్జు నాస్త్ర ఖండితాతపత్ర ధ్వజ | చామరములు గాలిఁ జదలఁ దూలఁ
జిహ్నముల విభూతిఁ జెందంగఁ గడు నొప్పె | నప్పు డాడుచున్న యట్టు లచట.
54
క. ఒకమఱి కిరీటి కట్టెది | రికి నఱిముఱిఁ బోయి రేని రెండవమా ఱి
య్యకొనుట కోర్వఁగ లేరై | రొకళ్ళుఁ గురురాజ సేన యోధులలోనన్‌.
55
సీ. మండితధ్వజదండమండలంబులఁ గిట్టి | విటతాటనంబుగా విఱిచి విఱిచి,
చటులఖురోద్భటాశ్వ శ్రేణిఁ బొదివి ర | యంబునఁ దునిమి తూఁటాడి యాడి,
రాజిత బహువిధ రథ సమూహముఁ జొచ్చి | గలిబిలి యగునట్లు గలఁచి కలఁచి,
మదభర భీషణ మాతంగముల ముట్టి | చిందఱ వందఱ చేసి చేసి,
 
ఆ. పటు పదాతి చయముపై రౌద్రరస మహో | గ్రముగ నడరి నేలఁ జమరి చమరి
సవ్యసాచి బాణ సంఘంబు మత్తశుం | డాల ఘోరలీలఁ గేలి సలిపె.
56
ఉ. శిక్షిత చిత్రసంగర విశేషములం బ్రతిహేతి ఖండనా
దక్షత పెంపుసొంపునను దైవబలంబున నత్తఱిన్‌ సహ
స్రాక్షతనూజు సారథి రథాశ్వచయ ధ్వజముల్‌ పరాస్త్ర శ
స్త్రక్షతి లేక యొప్పెఁ గురుసైన్యము వెక్కస మంది బెగ్గిలన్‌.
57
క. తేజోధనుఁ డగు నరుఁడు | ద్భ్రా జితగతి నడుమ మెఱసి బడబాగ్ని దళం
బై జలనిధిఁ ద్రెక్కొనియెడు | నోజం గురుబలము పేర్మి యుడిపెం దోడ్తోన్‌.
58
తే. కాలపక్వంబులైన లోకముల జముఁడు | బారిసమరెడు చాడ్పున మారిమసఁగి
యుగ్రరూపుఁడై శౌర్యసమగ్ర బాహు | సంపదుద్దాముఁడగు క్రీడి చంపె రిపుల.
59
వ. అట్టియెడ మున్ను తురంగమఖురాదులం దూలిన కెంధూళియుం, బైపయి నెగయఁ బరబలంబు నెత్తుట జొత్తిల్లుచు నుచ్చి చను వివ్వచ్చు నిశితశర పరంపరలు సైనిక శరీరంబులపై సుడిసి తడిసి రుధిర శీకర నికర వికీర్ణ రవికిరణ పరిణతం బగు సమీరణంబును, ధారాళ కరాళ రక్తపరిషిక్త విశ్వంభరా భాగంబునుం గలయం గెంపు సంపాదించి యకాలసంధ్య నావహించినం దదుచిత వ్యాపార పారంగతంబులై పొడసూపిన యుడుగణంబులుంబోలెఁ బొలుచు ధనంజయసాయక దళిత కుంజర కుంభ వికీర్ణ మౌక్తిక విసరంబుల వలనను, సముదీర్ణ మద వేగ దుర్నివార వారణ విదారణంబు లగు నర్జునాస్త్ర పాతంబుల బెదరి తేం ట్లెగయుట పొగలెగయుటయుం, బ్రతిభట బాణఘట్టనంబునం బాండవమధ్యము కాండ ప్రకాండంబుల నిబిడ జ్వాలలు నిగుడుట మంటయునుగా, మూర్తం బగు తదీయ క్రోధ దవానలంబు చటచ్ఛటాశబ్దంబుల చాడ్పునం జెలంగుచున్న యుధిష్ఠిరానుజు నతినిష్ఠుర భల్లభజ్యమాన బలవదరాతి ఖరాస్థి నిస్వనంబుల వలనను, దొట్టి తొట్టి యెడనెడ మడువులు గట్టు శోణితంబు నీళ్ళునందుఁబడి తేలాడు వెలిగొడుగులు పుండరీకంబులును, వింజామరలు మరాళ పుంజంబునునై కొలంకుల చందంబు నొంద వాని కెఱఁగెడు కొదమతుమ్మెదల పదుపుల పగిదిఁ దొరఁగు నాఖండలతనయ ఖండిత పరవీరకాలాయస నారాచ శకలంబులవలనను, గిరీటి శర పాటవ పరిస్ఫోటిత రిపు కపాల గళిత మస్తిష్క పలల పంకంబునను, నలుదెసల నంతంతఁ గదియం జాఁగి పడియున్న కృత్తకరచరణంబులను, వెదపదనికి రొంపిఁ గలంచి వరుజులు పదిలంబుగా నమర్చిన కేదారంబు తెఱంగు దోఁచుటకు నీడై చతురహలికుండు సల్లు పరువంపు మొలకల చెలువునఁ బెల్లు డుల్లు ఫల్గునాశుగ సంతాడన వికీర్ణ శత్రుశేఖర వజ్రవ్రజంబుల వలనను, సంగ్రామం బభిరామం బయ్యును ఘోరప్రకారం బయ్యె; నమ్మహాభయంకర సంకుల సమరంబున. 60
చ. ఉఱక విరోధిసైన్యముల నుక్కుమడంగఁగ నుల్లసద్గతిం
బఱప రథద్విపాశ్వములు పాండవమధ్యము తేరి వీథియం
దఱవఱలై పడం గని భయంపడి యిద్దెస వచ్చెనేని న
త్తెఱఁ గయి పోమె యంచు నెడతెంపిగఁ గొందఱు పాయ వాఱఁగన్‌.
61
క. వాలమ్ములు దాఁక ధరన్‌ | వ్రాలు భటులఁ జూచి యెదలు వడఁకఁగ మేనుల్‌
దూలఁగఁ దముఁ దాఁకకయును | నాలము సాలించి కొంద ఱవలఁ జనంగన్‌.
62
తే. ‘ప్రొద్దు గ్రుంకిన మఱి కాని పోవఁ డొక్కొ | క్రీడి’ యని కొంద ఱాజికి నీడఁబోవ
‘బలమునెల్లను దెగటాఱఁ బఱపికాని | తక్కఁ డెట్టులు’ ననుచుఁ గొందఱు చలింప.
63
క. తరతరమ ప్రజలఁ దునిమెడు | నరు నప్పటి యెత్తికోలునకు సురవిద్యా
ధర ఖేచరులును భీతిం | బొరసిరి తమదెసకు నేమి పుట్టునొ యనుచున్‌.
64
క. తమ తమ యొద్ది బలంబులు | క్రమ విరళములైన దొరలు గాండివిపై ను
గ్రముగఁ దఱుముటయు నాతఁడు | సమరోల్లాసమున దివ్యశరతత్పరుఁడై.
65
సీ. ఆచార్యు డెబ్బది యమ్ముల, నాచార్య | పుత్త్రు నేడింటఁ, గృపునిఁ బదింట,
దుష్ప్రహుఁ బండ్రెంట, దుశ్శాసనునిఁ బది | యేనింట, సౌబలు నెనిమిదింట,
నమరనదీసూను నఱువదింటను నేసి, | రవిసుతు రథ్యసారథుల నొంచి,
వర్మమంతయుఁ ద్రుంచివైచి మర్మాస్థి బం | ధములు భేదించి విక్రమము నెఱపి.
 
ఆ. యిట్లు దొరలు నొవ్వ నేడ్తెఱఁ దనచేతి | కొలఁది సూపి క్రీడి సెలఁగి దేవ
దత్త మొత్తుటయును దత్పైన్యములు సెడ | విఱిగి పాఱి భీష్ముమఱువు సొచ్చె.
66
క. గాంగేయుఁ డవష్టంభో | త్తుంగతనుం డగుచు నిట్లు దూలిన కురు సే
నాంగంబులఁ బురికొలిపి సు | సంగతములు సేసె సమరసమ్ముఖములు గాన్‌.
67
వ. ఇట్లు భగ్నబల సమాశ్వాసనోద్భాసి యగు భీష్ము భుజబలంబు ప్రాపున నేచి మాతంగ తురంగ స్యందన సందోహంబులతోఁ గుంభసంభవ కృపాశ్వత్థామ కర్ణ వికర్ణ ప్రముఖ నిఖిల యోధజనంబులు సుయోధను ముందటఁ బన్ని నిలిచినం జూచి, సవ్యసాచి ప్రత్యేక ప్రథన కుతూహలాయత్త చిత్తుం డగుచు నుత్తరున కిట్లనియె. 68
ఉ. ‘కందము లప్పళించి తురగంబుల నించుక నిల్పు; వైరి సే
నం దెలియంగఁ జూడుము ఘనప్రకరంబును బోలెఁ గాఱు కొం
చుం దఱచైన దంతి భట సుందరకేతన రాజి గ్రాలఁగా
ముందర గట్టిమై నిలిచి మోహర మున్నవిధంబు గాంచితే?
69
ఆ. కర్ణు కేతనంబు గ్రాలెడు నల్లదె | యాతఁ డాజికేళి కౌతుకమునఁ
గడఁగి వచ్చుటయును గలిగియున్నది మున్న | తొడరవలయు నతనితోడ మనము.’
70
వ. అని మఱియును. 71
చ. ‘రయమునఁ గిట్టి యీతని పరాక్రమలీల యడంచి నొంచి దు
ర్జయుఁ డని నమ్మియున్న కురురాజునకున్‌ వగ పుట్టఁ జేసెదన్‌
హయములఁ బోవని’ మ్మనుఁడు నాతఁడు నాతని లావు నచ్చి ని
ర్భయమునఁ దేరు వే నడపె భాస్కరసూతికి సమ్ముఖమ్ముగన్‌.
72
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )