ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
అర్జునుండు చిత్రాంగదప్రభృతి కురుకుమారుల నిర్జించుట (సం. 4-49-7)
వ. ఇవ్విధంబున వృషభంబున కాదికొను బెబ్బులియునుం బోలె రాధేయుదెస నడచు కవ్వడిం గని చిత్రాంగదుండును చిత్రరథుండును సంగ్రామజిత్తును దుష్ప్రహుండును జిత్రసేనుండును వివింశతియును దుర్ముఖుండును దుర్జయుండును వికర్ణుండును శత్రుంతపుండును దుశ్శాసనుండును లోనుగాఁ గల కురుకుమార వర్గంబు నిరర్గళ ప్రకారంబులగు రథ చిత్ర ప్రచారంబులు మెఱయ మొనకుం దలకడచి చటుల పటు బాణ వేణికా పరంపరలు నిగుడ నొక్క పెట్ట కవిసిన నతండును గుణధ్వని తంత్రీనాదంబుగా నావిండ్ల వారొత్తుకాఱుగా గాండీవంబు వీణగా వినోదంబు సలిపె; నట్టియెడ వికర్ణుండు. 73
క. తల మీఱి నిశిత శరమం | డలిఁ గప్పెం బార్థు నుత్కట క్రోధమునన్‌
విలు విఱుగ నేసి యతనిం | దొలఁగంగాఁ జేసె నరుఁడు దోర్బలలీలన్‌.
74
క. ఇంతయుఁ గనుఁగొనియును శ | త్రుంతపుఁ డోసరిల కాజిదోహల మలరం
గౌంతేయుతోడఁ దలపడి | వింత లయిన కూర్మ నఖర విశిఖము లేసెన్‌.
75
వ. అర్జునుండును. 76
క. సూతుఁ బదింటను నైదిట | నాతని యంగంబు నొంచి యంత నిలువమిన్‌
శాతఘనశరము వే కొని | యాతల వెడలంగ నేసి యసువులఁ బాపెన్‌.
77
తే. ఇట్లు శత్రుంతపునిఁ ద్రుంచి యివ్విధమున | నొక్కఁ డొక్కఁడ తలపడు టుడుపఁ దలఁచి
వివిధ బాణపరంపర వెల్లిఁ గొలిపె | భయరసము వఱ్ఱు పెట్టునఁ బగఱు వాఱ.
78
క. ‘అందఱు రథికులు పఱవఁగ | నిం దేటికి మున్ను వచ్చి రిస్సీ’ యని సం
క్రందనసుతు మార్కొనియెఁ ద | గం దెగి సంగ్రామజిత్తు గర్వోద్ధతుఁడై.
79
క. తలపడి వాలమ్ములు పై | నల వేర్పడ నినుచుటయును నలుక వొడమినం
దలఁ దునిమివైచె నాతని | బలసూదనసూనుఁ డొక్క పటుభల్లమునన్‌.
80
తే. అపుడు రాధేయుఁ డిమ్మెయి ననుజుపాటుఁ | జూచి యేనుంగునకు సిళ్ళు సూపినట్లు
కవిసి హయముల మత్స్యభూకాంతు తనయు | నేసి, పండ్రెండు శరముల నేసె నరుని.
81
ఉ. కేసరివిక్రముండు కపికేతనుఁ డత్తఱి వైరివీరసం
త్రాసకర ప్రకార మగు దర్ప మెలర్పఁగ బాణజాల వి
న్యాసమునన్‌ వెసం బొదివె నర్కసుతున్‌ గరుడుండు పాము ను
ద్భాసితపక్షుఁడై పొదువు భంగి సురావలి పిచ్చలింపఁగన్‌.
82
క. ఇరువురు వీరులు ని ట్లొం | డొరువులఁ దలపడుట సూచి యుత్కట మగు న
చ్చెరువాటుఁ గౌతుకంబు న | డర నూరక యుండె నయ్యెడం గురుసేనల్‌.
83
మ. ప్రళయాంభోధరముక్త సాంద్ర విసరత్పాషాణ వర్షంబు మి
క్కిలియై శైలముఁ గప్పునట్లు నరు నక్షీణాస్త్ర సంతాన మి
ట్టల మై కప్పినఁ దీవ్రమారుతము గాఢవ్యాప్తి జీమూత మం
డలిఁ బోలెన్‌ విరియించె భానుజుఁ డవష్టంభోజ్జ్వలాకారుఁడై.
84
క. విల్లును దానును శిఖ రా | జిల్లఁగ వెలుఁగొందు వహ్ని చెలువంబున శో
భిల్లుటఁ గని కురుసైన్యము | లెల్లను దూర్యములు మ్రోయ నేడ్తెఱఁ జెలఁగెన్‌.
85
క. రవితనయు బాణములు వా | సవనందనుఁ బొదివినపుడు సంతోషముఁ,ద
ద్వివిధాస్త్రము లాతనిపైఁ | గవియ విషాదంబు నొందుఁ గౌరవసేనల్‌.
86
వ. ఇవ్విధంబున నేట్లాడుచుం గదిసి గాండీవి కర్ణున కిట్లనియె. 87
ఆ. ‘సభలఁ బలుకు దీవు సరిలేరు నా కని; | యిదె రణంబు వచ్చె; నెల్లవారి
కెఱుఁగవచ్చు దీనఁ; బెఱచోట రజ్జైన | యట్లు పూరగింప నగునె యిచట?
88
క. మాటలు పె క్కా డితి వీ | పోటుమగలు వినఁగ నింకఁ బోవుట దగ దె
ప్పాట; నదిగాక తమ్ముని | పాటును గన్నారఁ గంటి పాఱకు మింకన్‌.
89
ఆ. పలుకవచ్చుఁగాక పలికిన యట్టుల | చేయ వచ్చు నెట్లు? దాయ! యెందుఁ
బోయె దట్లు ద్రుపదపుత్రికఁ బఱుపంగఁ | గాంచి నగిన ఫలముఁ గందు గాక!
90
క. ఏ నపుడు ధర్మపాశా, | ధీనుఁడనై కోపమునకు దీకొనరింపం
గా నేరకున్న మెయిమెయిఁ | బో నయ్యెం గాక యింకఁ బొమ్మా యిచటన్‌.’
91
వ. అనిన విని రాధేయుం డిట్లనియె. 92
ఉ. ‘అప్పుడు ధర్మహానికి భయంపడి నిల్చితివో? కడంకతో
నిప్పుడు వచ్చినాఁడ; విట యెల్లను జేయుదు గాక; యన్నపైఁ
దప్పు ఘటించి నీవు నొక తాలిమి గల్గినవాఁడవై నెపం
బొప్పినఁ జెల్లె; నీదు నిలుపోపును జూతము గాక యిచ్చటన్‌.
93
క. సమయంబు నడపినను రా | జ్యము భాగం బీరె యెట్లు నను నాస నర
ణ్యమున వసించితి గాక ని | జమునకు నీయందు ధైర్యసారము గలదే?
94
క. మును నీ వచట నచటఁ జే | సిన బంటుతనంబు లెల్లఁ జెప్పఁగ విందుం
గనినఁ గదా నమ్ముదు; నవి | యనుమానము నాకు నీ భయస్థితిఁ గనుటన్‌.’
95
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )