ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము (సం. 4-55-14)
వ. అనుచు వాలమ్ములు గురిసిన నర్జునుండును గుపితుండై గాండీవవిక్షేప క్షోభిత నభోభాగుండగుచుం గానీను పై నానానిశిత విశిఖంబులు నినిచె; న ట్లయ్యిరువురును దేవాసుర సంగ్రామ సాదృశ్య విక్రమ ప్రక్రియం బొలిచి రట్టి సమయంబున. 96
క. రవిదీప్తులు సొర నేరమిఁ | గవిసెం జీఁకట్లు, పవనుగమనం బడఁగెన్‌,
వివిధాస్త్రంబుల నంబర | మవిరళముగఁ బొదువఁబడుట నద్భుతభంగిన్‌.
97
ఉ. అప్పుడు కర్ణుసైన్య మమరాధిపనందనుఁ జుట్టుముట్టఁ దే
రుప్పరవీథిమై వలయ మొప్ప వెసం బఱపించి క్రీడి పెం
గుప్పలుగా రథావలిని ఘోటతతిం గరిరాజిఁ గూల్చుచుం
దప్పక భానుసూను మెయిఁ దాఁకఁగ నేయుచు నుల్లసిల్లినన్‌.
98
వ. రాధేయుండును. 99
క. తఱిమి పయి నడరుటయు విలు | విఱుగంగా నేసె నరుఁడు విక్రమలీలం
గొఱఁతవడనీక కర్ణుఁడు | మెఱుఁగు లడరుశక్తి సురలు మెచ్చఁగ వైచెన్‌.
100
ఆ. వైచుటయును సవ్యసాచియుఁ గౌరవుల్‌ | విస్మయంబుతోడి వెఱపు వొంద
నధికరయము మెఱయ నది పెక్కుదునియలు, | చేసె నంతరమున శితశరముల.
101
వ. అట్టియెడ నినతనయు మన్నించు జోదులు దెగి పయిం బడినఁ గ్రోధారుణ నయన పల్లవితంబును దంత కాంతిస్తబకితంబును గుంభస్థల ఫలితంబును నగు తదీయ కరటి ఘటావికట విటపి పటలంబును నాత్మీయ విశిఖ వ్యాపార మహావాతంబునన్‌ బడలువడం గూల్చి చండమూర్తి దాల్చి శోభిల్లు బీభత్సుంగని యతండు బొమముడివడ నెక్కొని వేఱొక్క విల్లెత్తికొని. 102
క. తురగముల నాలుగిట ను | త్తరు నాఱిట నెనిమిదిట రథముఁ బదిటను వా
నరు నఱువది శరముల న | న్నరు నంగంబులను బెలుచ నాఁటఁగ నేసెన్‌.
103
వ. ఇత్తెఱంగున. 104
సీ. రోషంబు భీషణరూపమై చెలువొంద | నతులకేతువు శిఖయై వెలుంగ,
శరజాలములు పటుజ్వాలలై నిగుడ న | ర్కతనూభవోగ్రాగ్ని ప్రజ్వరిల్ల,
నుద్ధతి సైఁపక యుజ్జ్వలదివ్యప | తాక మెఱుంగుగా దళిత ధరణి
రథనేమిరవము గర్జనముగ శరపరం | పరలు ధారలుగాఁగఁ బరఁగి యడరె,
 
ఆ. నర్జునాంబుదం బనన్యసామాన్య స | ముద్యమమున ముఖపయోరుహముల
కాంతి దఱిఁగి యపుడు కౌరవసేనా స | రోవరంబు దీనభావ మొంద.
105
క. వెండియు నుడుగక రవిసుతుఁ | డొండొండ నిశాతసాయకోత్కరము సము
ద్దండతఁ బై నించిన నా | ఖండల నందనుఁడు కెంపు కనుఁగవఁ గదురన్‌.
106
క. శిరము లలాటంబును గం | ధరమును బాహువులు నురము దందడి వ్రయ్యన్‌
గిరిపైఁ బిడుగులు దొరఁగెడు, | పరుసున దృఢదీప్త శాత భల్లము లేసెన్‌.
107
క. అఱిముఱి నంగము లెల్లను | నుఱుముగ నిట్లడరు నర్జునుని యమ్ములకున్‌
వెఱచఱచి సూతపుత్రుఁడు | పఱచెఁ బుడమియద్రువ మత్స్యపతిసుతుఁ డార్వన్‌.
108
వ. ఇట్లు కర్ణుండు గయ్యంబు విడిచి పాఱినఁ బార్థుండు దేవదత్తంబు పూరించి యుత్తరున కిట్లనియె. 109
క. ‘వీఁ డొకఁడు కురుబలంబున | వాఁడిమగం డనఁగఁ జాలువాఁ డిబ్భంగిం
బోఁడిమి సెడియెను ద్రోణుల | వేఁడిమి యిట మనకు మునుము విక్రమమునకున్‌.’
110
వ. అనుచు వీరావేశంబునఁ గౌరవానీకంబు నాలోకించునప్పు డుత్తరుండు. 111
ఉ. ‘వెక్కసపాటు భీతియును విహ్వలభావము నొంది యిట్లను
‘న్మిక్కిలి యైన శౌర్యమును నిర్భరతేజము నంత కంత కి
ట్లెక్కెడులావుఁ జూచి మది యెంతయు బెగ్గిలె, మేను చేష్టలం
దక్కె; నశక్య మిం కిట రథవ్యవహారము నిర్వహింపఁగన్‌.
112
ఆ. పుట్టినంతనుండి యిట్టివి యెన్నఁడుఁ | గాన నెందు; నట్లు గాన చోద్య
మంది యంతరంగ మవశతఁ బొందిన | కతన నింద్రియముల కడఁక దక్కె .’
113
తే. అనినఁ గొండొక న వ్వొలయంగఁ జూచి | యింద్రనందనుఁ డాతని కిట్టు లనియె
‘నేను గలుగంగ నీకేమి యెలమి వాహ, | నముల కుబ్బుగ సంచోదనంబు సేయు.’
114
క. అనుటయు నాతఁడు దగ నూ | ల్కొనినం, దా నుదిత నినద కోదండుం డై
యనితర సులభోద్యమముగ | ధనంజయుం డిట్టులను నతనితో మఱియున్‌.
115
క. ‘అరుణాశ్వంబులఁ బూనిన | యరదంబున వీఁడె నిడుపులగు చేతులు బం
ధుర కంధరంబు వెడలుపు | టురమును నై ద్రోణుఁ డొప్పె నుత్తర కంటే?’
116
వ. అని చూపి వెండియు నిట్లనియె. 117
ఆ. ‘సకల కురుకుమార చాప శిక్షాచార్యుఁ, | డాజి దుస్సహుండు, సాంగవేద
వేది, నీతిశాస్త్ర విదుఁడు దివ్యాస్త్ర కో | విదుఁడు, సుజన హితుఁడు, విమల బుద్ధి.’
118
వ. అని యగ్గించి. 119
క. ‘తన తనయుకంటె నెమ్మన | మున నాకుం గూర్చు భావమున, గురులకు మా
ర్కొనియెదము; రాచధర్మం | బున కీడునఁ జేసి యింత పుట్టఁగ వలసెన్‌.
120
చ. ఎదురుగఁ బోవ నిమ్ము రథ మీతని తేరికి’ నన్న నాతఁడుం
బదిలముతోడ రథ్యముల పగ్గము లేడ్తెఱ నూలుకొల్పి యు
న్మదగతి నట్ల చేసిన నమానుషవిక్రముఁ డైన ద్రోణుఁడుం
గదిసి యిభం బిభంబుఁ జెనకం జనుదెంచిన లీల వచ్చినన్‌.
121
వ. నరుఁడు నమస్కరించి గురున కిట్లనియె. 122
క. ‘అడవులఁ బెద్దయుఁ గాలం | బిడుమలఁ గుడిచితిమి; మాకు నిది దఱి యని యి
ప్పుడు వచ్చితిమి; విపన్నుల | యెడఁ గృప సేయుటయ లెస్స; యీ రలుగకుఁడీ!
123
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )