ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
అర్జునుఁడు ద్రోణాచార్యులతో యుద్ధంబు సేయుట (సం. 4-53-1)
క. మును వెఱతు నేయ మీరలు | నను నేసినఁ గాని’ యనుడు నాకేశసుతున్‌
ధనురాచార్యుం డిరువది | సునిశిత బాణముల నేసెఁ జూపఱు వొగడన్‌.
124
ఆ. అర్జునుండు వాని నన్నింటి నడుమన | తునియ నేయుటయును ద్రోణుఁ డడరి
శతసహస్ర సంఖ్య శరములు గప్పిన | నతఁడు నతనిఁ గప్పెఁ బ్రతిశరముల.
125
చ. అతిరథు లస్త్రశస్త్రవిదు లద్భుతబాహుబలుల్‌ పరాక్రమో
ర్జితయశు లిట్లు దాఁకి గురుశిష్యులు కౌరవసేనలోని భూ
పతిసుతకోటికిన్‌ వెఱఁగుపా టొనరించిరి బాణజాల సం
వృత గగనాంగణంబగు నవీన మహాహవ విక్రమంబునన్‌.
126
వ. అట్టి యెడం గురుసైన్యంబు జనంబులు. 127
క. ‘గురుఁ డొక్కరుండు దక్కఁగ | నరుఁడు గడఁగినపుడు మార్కొనం జాపధరుం
డొరుఁడు గలఁడె! మఱి వెదకిన | హరుఁడు గలం; డింకఁ గలుగు ననరా దెందున్‌.
128
క. ద్రోణుఁడు రయమున నేసిన | బాణము లెడతెగక యొక్క బాణమ పోలెన్‌
శ్రేణి యయి వోవఁ బార్థుఁడు | రేణువు గావించుఁ గంటిరే చిత్రగతిన్‌?
129
క. గురుశరములు సితపక్ష | స్ఫురణంబున నంచపిండు పొలుపు వహించెన్‌;
నరుబాణతతి ఘనావలి | కరణి మిగుల నొప్పె నల్లగఱుల చెలువునన్‌.’
130
వ. అనుచుం గనుం గొనుచుండ. 131
శా. శ్రావ్యంబై చెలఁగన్‌ గభీర మధుర జ్యానాద ముద్దామ వీ
రవ్యాపార నిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచున్‌
సవ్యప్రౌఢి దృఢాపసవ్యగతి నాశ్చర్యంబుగా నేయుచున్‌
దివ్యాస్త్రంబులఁ బోరి రిద్దఱును సాదృశ్యం బదృశ్యంబుగన్‌.
132
వ. ఇంద్రాగ్ని వాయు వరుణ దైవత్యంబులగు శరంబులు గురుం డేసిన, నరుండును దత్తద్దేవతాకంబు లగునంబ కంబులఁ బ్రతిహతంబులు సేయుచు వచ్చె; నయ్యిరువురుఁ బెల్లేయు సాయకంబు లంతరిక్షంబున దళంబై సంతమసంబు గలిగి యునికి నేబాణం బెక్కడఁ బాఱుటయుం దోఁప కుండె; నట్టియెడఁ గుంభసంభవు బలంబు సరభసంబుగా నతని కడ్డంబు సొచ్చిన వివ్వచ్చుండు వ్రేల్మిడిం బొడిసేసి సకేయూరంబు లగు బాహుదండంబులను సకుండలంబు లగు కర్ణపాశంబులను సకిరీటంబులగు శిరోభాగంబులను భూభాగం బలంకరించి యప్పు డావహిల్లిన రుధిరసాగరంబునకు రత్నాకరత్వం బలవరించె; నిట్లు దుర్జయుండగు నర్జునుండు సైన్యంబు దైన్యంబు నొందించుచు నాచార్యునకు భరంబుగ నేట్లాడుచున్నం జూచి గురుండు విస్మితుండై. 133
క. ‘అర్జునుని నాహవంబున | నిర్జింపఁగ నగునె ఫాలనేత్రున కైనం?
బర్జన్యసుతుఁడు శరవ | ర్షోర్జితమూర్తి యగు టరయ నుచితమ కాదే!’
134
వ. అని మఱియును దగిన పలుకుల నగ్గింప, నిలింపనికరంబు. 135
తే. ‘ఇంతప్రొద్దు కిరీటి కట్టెదుర నిలువ | వెఱవ కున్నప్డు ద్రోణుండ వింటివాఁడు
నల్లవో తన యున్న సేనకు నొకండ | బలిమిఁ దలమీఱునే? యిట్లు నిలువ వలదె!’
136
మ. అనుచుండం ద్రిదశేంద్రసూనుఁడు రయం బత్యంత ఘోరంబుగా
ఘనశాతోజ్జ్వల దుర్నివార విలసత్కాండంబులన్‌ ద్రోణు వా
హన సూతధ్వజ దేహముల్‌ వొదివె; ని ట్లస్త్రాబ్ధి నిర్మగ్నుఁ జే
సిన హాహా నినదంబు లొక్క మొగిఁ బేర్చెన్‌ సర్వసైన్యంబులన్‌.
137
క. ఈమెయి నిజజనకు భుజో | ద్దామబలము దోడుతోడఁ దఱుఁగుటయు రథ
స్తోమంబుఁ దాను నశ్వ | త్థామ వెసం దాఁకె బాండుతనయుని తోడన్‌.
138
చ. అతఁడును దీవ్రబాణముల నాతనిఁ గప్పుచు మాఱుకొన్న నా
శతమఖవృత్ర సంగరము చందము దోఁచె వడిం జటచ్ఛటా
యిత రవ మప్డు వేణువుల నేర్చు దవానలు మ్రోఁత భంగి ది
క్తతిఁ బరఁగెన్‌ మహాద్భుతము కౌరవసేనకు నావహిల్లఁగన్‌.
139
వ. అట్టి యెడ. 140
చ. ఉఱక నరుండు ద్రోణసుతు యుగ్యములన్‌ వెస నొంచె; నాతఁడుం
దెఱపి యొకింత గాంచి ఘనతీవ్రశరంబున నారిఁ ద్రుంచి, క
న్గిఱిపిన మాత్రలోన నతనిం బటుబాణ చతుష్కయుగ్మ మే
డ్తెఱఁ దొడి మౌర్విఁ గ్రమ్మఱ ఘటించునెడన్‌ వడి నేసి యార్చినన్‌.
141
క. ‘కురుసేనలోన ని ట్లె | వ్వరుఁ జేసినవారు లే; రవార్య భుజా వి
స్ఫురణోదగ్రుండు గదే | గురుపుత్రుం’ డనుచు నమరకోటి నుతించెన్‌.
142
చ. చిఱునగ వొప్ప గాండివము చెచ్చెర సజ్యము సేసి సేన లు
క్కఱ రభసంబుమై నడరెఁ గవ్వడి ద్రౌణియు నీడఁబోక య
త్తఱిఁ దఱుమంగ నస్త్రములు దందడి మార్కొని మండుచుండెఁ జి
చ్చఱపిడుగుల్‌ వడిం దొరఁగు చాడ్పున నంబరవీథి నుగ్రమై.
143
వ. ఇవ్విధంబున ధనంజయుండు రయంబున నేయ వేగంబున నేయు ద్రోణతనయు తూణీరంబులు శరశూన్యంబు లయ్యెఁ; దన తూణీరంబు లక్షయ బాణంబు లగుటం జేసి యంతకంతకు నతిశయిల్లు పెల్లున నేయుచు నధికుండగు నప్పాండవమధ్యముం గనుంగొని కృపాచార్యుండు సెంగటం దలమీఱిన. 144
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )