ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
అర్జునుఁడు కృపాచార్యునితో యుద్ధము సేయుట (సం. 4-52-1)
క. గురుపుత్రుని రథము విడిచి | సరభసముగ నందు సవ్యసాచి గవియుడుం
దిరమై యాతఁడు శితశర | పరంపరలు గురిసె నుగ్రబంధురగతులన్‌.
145
వ. పాండుపుత్రుండును జిత్రసంచారంబుల మెఱయుచు. 146
క. పటు విశిఖపంక్తి యత్యు | త్కట రయమున నిగుడఁజేయఁగా నవ్విధ మూఁ
దుటయైన మండె దీప్తో | ద్భట భంగిఁ గృపానలంబు బలములు వొంగన్‌.
147
వ. ఇట్లు మండి శిఖిఁబోలెడి కనకలిప్త ఘనబాణంబు వనచర కేతువుం దాఁకించి వేఁడిమి సూపి వివిధాస్త్ర జ్వాలలు గవియించి దిక్కులు సెలంగ నార్చినం గోపంబున నాటోపంబు మిగిలి బలసూదనసూనుం డతని కేతనంబు దునిమి తరణి కిరణానుకార పారంగతంబు లగు నారాచంబులు దదీయాంగంబుల నినుపం దొడంగిన రథచక్రరక్షకు లగు చంద్రకేతుండును జిత్రాశ్వుండును మణిమంతుండును మంజుమౌళియు హేమవర్మయును సురథుండును సుషేణుండును నరిష్టుండును సుకేతుండును నుక్కు మెఱయ నొక్కటం దాఁకిన. 148
ఆ. అన్ని వెడఁద వాతియమ్ము లద్భుతముగ | నొక్క ముష్టిఁ దొడిగి గ్రక్కనంగ
నతఁడు లీలఁ దునిమె నందఱ తలలును | ఘోరభంగి రక్తధార లెగయ.
149
సీ. తునిమి, తోడన యొక్క సునిశిత శరమునఁ | గాఁడియు, రెంట నక్షములఁ ద్రుంచి,
హరుల నాల్గిటఁ జంపి, యాలంపు టెలుఁగుతో | నొగలు మూఁడమ్ముల నుగ్గుసేసి,
ధనువును సూతుని తలయుఁ జెఱొక్క ట | నఱకి, లోచనముల నవ్వు మెఱయఁ
గృపుని నాలోకించి క్రీడి తద్వక్షః స్థ | లంబునఁ గ్రూరభల్లంబు నాఁట
 
ఆ. హతరథుండు నిపతితాశ్వుండు సంఛిన్న | చాపుఁడును నికృత్త సారథియును
నయ్యు, నొచ్చియును, భుజార్గళ సంరంభ | మతిశయిల్ల శక్తి నతఁడు వైచె.
150
ఉ. మండుచు వచ్చుదానిఁ బదిమార్గణముల్‌ గొని వేగ మొప్ప నా
ఖండల నందనుండు గడికండలు సేసినఁ జూచి యప్పు డా
తం డుడివోక లేక సమదంబున ఖడ్గము ఖేటకంబు ను
ద్దండతఁ గొంచుఁ దేరు డిగి తాఁ గవిసెన్‌ రయ ముల్లసిల్లఁగన్‌.
151
వ. ఇట్లు గవిసిన. 152
క. పలకయు వాలును నింతిం | తలు దునియలు సేసె బాణతతిఁ బాండవుఁ డి
ట్టల మైన వెఱఁగుపాటున | నిలిచి కృపుఁడు ద్రోణపుత్రుని రథం బెక్కెన్‌.
153
ఆ. అప్పు డే పడంగి యన్ని సేనలు భీష్ము | రథము పొంత కొదిఁగె రౌద్రరస వి
నోది యైన యర్జునుఁడు ధనుశ్చాలన | దీప్తమూర్తి యగుచుఁ దిట్ట కుఱికె.
154
వ. ఇత్తెఱంగున నుఱక తఱియ నుఱికిన. 155
క. బలములు దొరలుఁ బొదివి సం | కుల యుద్ధము సేయఁ గ్రోధ ఘోరాకృతి యై
యిలఁ బ్రోవుగఁ జతురంగం | బుల వ్రేల్మిడిఁ బాండురాజపుత్రుఁడు గూల్చెన్‌.
156
ఉ. చేతులతీఁట వో నిటు లశేషబలంబుల నుగ్గు సేసి మాం
సాతతపంక యై బహువిధాయుధమీనము లొప్పఁ జామర
వ్రాతము ఫేన భంగిగ నిరంతర వీరశిరస్సరోరుహ
స్ఫీత విభూతిఁ బొల్చు నది సేసె రణస్థలియందు నెత్తుటన్‌.
157
తే. ఇట్లు కౌరవానీకంబు నెల్లఁ గలఁచి | యాడి భీష్ముని దెసఁ బోవు క్రీడిఁ దాఁకెఁ
గొండతోఁ దాఁకు తగరు నుద్దండ వృత్తి | దోఁప వృషసేనుఁ డాహవదోహలమున.
158
వ. విజయుండును. 159
తే. భల్ల మొక్కట నాతని విల్లు దునిమి | యైదు నారసములు వక్ష మాడ నేసె;
నతఁడు సైరింపరాని నొ వ్వడరుటయును | బెగ్గలంబున నరదంబు డిగ్గి పాఱె.
160
వ. అట్టియెడ దుశ్శాసన శకుని దుర్ముఖ వివింశతి వికర్ణులు దన్నుం బొదివికొనిన వారల రథరథ్య కేతు వర్మంబులు జర్జరితంబులుగా నేసి గాసిచేసిన నందఱుం గనుకనిఁ బఱవం దొడంగినఁ బార్థుండును బ్రహాసోల్లాస భాసుర ముఖుండగుచు నుత్తరుం గనుంగొని. 161
తే. ‘కనకమయ తాల కేతువు క్రాలఁ జిర త | టిల్లతాలీలఁ గలిగి శోభిల్లు నంబు
దంబుచాడ్పున సురనదీ తనయుఁ డున్న | వాఁడు చూచితె మత్స్యభూవరతనూజ!
162
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )