ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
అర్జునుఁడు భీష్మునితో యుద్ధంబు సేయుట (సం. 4-56-1)
క. బలువిడి మన దివ్యాస్త్రం | బుల చవి చూపంగ వలయుఁ బోనిమ్ము రథం
బలసగతి నతనిదెస’ కని, | పలికిన నతఁ డట్లు చేసెఁ బరమ ప్రీతిన్‌.
163
ఉ. శాంతనవుండు నప్డు నిజశంఖము కౌరవరాజసైన్యముల్‌
సంతస మంద నొత్తుచు ససంభ్రమలీల నెదుర్కొనంగ దు
ర్దాంత భుజాబల ప్రకటదర్ప మెలర్ప నరుండు నొత్తె ది
గ్దంతినికాయ కర్ణపుట దారణ వృత్తము దేవదత్తమున్‌.
164
తే. మలసి ఱంకెలు వైచుచు మాఱుకొనిన | వృషభముల భంగి నక్కురువృషభు లిట్లు
సమదగతిఁ జేరునెడఁ జూచి రమరు లర్థి | ననిమిషత్వంబు దమ కప్పు డచ్చుపడఁగ.
165
వ. ఇవ్విధంబునం గనుంగొనుచు వారలు దమలోన. 166
క. ‘మనలను దానవులను గడ | చినయవి భుజ బలము లస్త్రశిక్షా విధముల్‌
గొనియాడఁ గొలఁది గా దీ | తని నాతఁడ యతని నితఁడ తగుఁ జెనయంగన్‌’.
167
సీ. అనుచుండ సైన్యంబు లార్పులుఁ బెడ బొబ్బ | లును దూర్యనాదంబులును జెలంగఁ
బేర్చి యొక్కుమ్మడి భీష్ము నగ్గింపంగ | నతఁడు నిశాత బాణాష్టకమునఁ
బడగపై హనుమంతు నొడలను బహుశరం | బుల నందుఁ జెలఁగెడు భూతములను
దశవిశిఖముల రథ్యములను సారథి | నేసె; వాసవియును నెసక మెసఁగు
 
తే. నగ్గలిక గాండివంబు చక్రాకృతి ప్ర | కాశవహ్ని స్వరూపత గలిగి విడుపు
తెఱపి గానంగ రాకుండ మెఱసి యొప్పు | సాంద్ర సాయకతతి నాకసంబు గప్పె.
168
తే. అర్జునుఁడు గవియించిన యంపమూడ | మంచు దళముగఁ గప్పిన మార్గణాంశు
జాలముల వెస విరియించె శాంతనవ ప | తంగుఁ డుద్ద్యోతమాన ప్రతాప లీల.
169
క. అమరేంద్రతనయుఁ డుగ్రా | స్త్రములు వడిం గురియఁ గురియఁ దరమిడి వానిం
దుమురుగఁ జేయుచు వచ్చెను | సమరోల్లాసంబు మెఱయ శంతనుసుతుఁడున్‌.
170
క. అర్జునుఁడు దివ్యబాణ | స్ఫూర్జిత దోశ్శక్తి తనకుఁ జూపిన నతఁ డ
త్యూర్జిత బలుఁడై నియమో | పార్జిత ఘోరాస్త్రవితతిఁ బ్రతిహతిఁ జేసెన్‌.
171
క. కవ్వడి యెమ్మెయి నేసిన | నవ్విధమున నాశరంబు లన్నియు దౌ దౌ
దవ్వులన నిలువరింపఁగ | వివ్వచ్చుఁడు కినిసి యేసె విలు విఱుగంగన్‌.
172
మ. తన కోదండము ఖండితం బగుడుఁ గ్రోధంబార మందాకినీ
తనయుం డప్డు సటా విలుంచన సముద్యత్క్రోధ సింహాకృతిన్‌
ధను వొం డుద్ధత లీల నెత్తికొని యస్త్రశ్రేణిఁ బర్వించె న
ర్జునుపైఁ దాఁకిరి చక్రరక్షకులు నార్పుల్‌ నింగి ముట్టన్‌ వడిన్‌.
173
చ. విజయుఁడు వారి నెల్ల నొక వ్రేల్మిడిఁ ద్రుంచియు, భీష్ము సాయక
వ్రజము నడంచియున్‌ రథము వాజుల నొంచియు, నాజికేళియం
దజిత విలాసముల్‌ మెఱయ నప్పుడు విస్మయ మందుచుండెఁ గుం
భజముఖ యోధ వీరతతి; ప్రస్తుతి సేసిరి సిద్ధఖేచరుల్‌.
174
క. కొండొకయెడఁ గని శాంతన | వుం డాఖండల తనూభవుని డా మూఁ పు
ద్దండ భుజబలము మెఱయఁ బ్ర | చండాస్త్రక్షతము సేసె సరభసవృత్తిన్‌.
175
చ. కినుక మనంబునం గదిరి క్రీడి పితామహువిల్లు వ్రేల్మిడిం
దునిమి, నితాంత గాఢరయ దోర్విభవంబున నొండు విల్లు గై
కొనియెడు సందునన్‌ నినిచెఁ గ్రూరశరంబు లురంబునందు గ్ర
క్కున నతఁ డొల్లఁ బోయి రథకూబర మూఁతగ నిల్చె సోలుచున్‌.
176
క. కనుఁగొని సూతుం డరదముఁ | గొనిపోయెం దొలఁగ నపుడు కుంతీతనయుం
డనిఁ దనివి సనక గుంపులు | గొని యున్నెడ లరసెఁ గలయఁ గురుసైన్యములన్‌.
177
వ. ఇ ట్ల ఱ్ఱెత్తి చూచి గాండీవంబు దొడసి గుణంబు సారించి కవదొనలు బిగియించి. 178
క. ఆచార్య సూర్యతనయ కృ | పాచార్య ప్రభృతి రథికు లందఱుఁ బ్రోవై
జూచుచు నుండఁగ నద్దెస | కేచి భుజాబలము మెఱయ నింద్రజుఁ డరిగెన్‌.
179
వ. అప్పు డశ్వత్థామ కర్ణున కిట్లనియె. 180
ఆ. ‘వీఁడె వచ్చుచున్నవాఁడు పార్థుఁడు; మన | మేమి సేయువార? మీవు దక్క
నొరులు నిలువరింప నోపెడువారు లే; | రోట లేక తాఁకి యోర్వవలయు.’
181
క. అని తను నుల్లసమాడినఁ | గినిసి యినతనూజుఁ ‘డేను గ్రీడి నిచట మా
ర్కొను వీఁకఁ గన్నులారం | గనుఁగొనుమీ నిలిచి’ యనుచుఁ గవిసెం బెలుచన్‌.
182
క. దొరలును సుభటులుఁ గర్ణుని | యరదమునకు మున్న పొదివి; రర్జును నచటం
గరి సొచ్చిన తుంగ మడువు | పరుసున మొన చాఁపకట్టు వడియె నతనిచేన్‌.
183
తే. ఇవ్విధంబునఁ బోరెడు నింద్రతనయు | నుక్కులావును నంతంత కెక్కుడయ్యె
నలసి మేనులు తూలాడ నిలిచి రంత | నంత నయ్యోధముఖ్యు లాహవము దక్కి.
184
వ. అట్టియెడ నుత్తరుండు నరున కిట్లనియె. 185
చ. ‘ఉడుకువ లేని కయ్యమున కోర్వఁగ వచ్చునె? నాకు డప్పి వు
ట్టెడు; నొకమాటు నాగ్రహము డింపవు నీవును; జక్కుసేసి ప
చ్చడి గలపంగ వెండియును జండితనంబున వచ్చి వచ్చి పో
రెడు మొన, లింకఁ జాల నొనరింప భవద్రథసూతకృత్యమున్‌.’
186
వ. అనిన విని కవ్వడి నవ్వుచు ‘నేను గలుగ నీకు నోహటింప నేల? యంతియ; వలసినం దురంగంబులఁ దోడు గడపెద; నించుక సైరించి నిలువ వలయు; నెల్లపనులును జక్కనయ్యె; రా జొక్కరుండు కొఱంత; యాతం డభిమాని; మనలం గని సరకుగొనఁ; డిప్పుడున్న చందంబు మనతోడం దలపడం గడంగుట దోఁచుచున్న యది; తమ్ములు నాప్తభృత్యులు నిరుగెలంకుల నగ్గలిక మెఱసి డగ్గఱి యున్న వా’రని కౌరవేశ్వరుని గట్టి మోహరంబు సూపి యతనిం బురికొల్పి యద్దిక్కు తేరు పోవనిమ్మనుటయు నతండును దలకొని యట్ల చేయ నడరి యెడనెడ నడ్డుపడు కురుబలములఁ జిఱునగవు నిగుడ మెఱుంగు వాలమ్ములఁ దొలంగ జడియుచుం గదిసిన, నమ్మేదినీవల్లభుండు. 187
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )