ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
అర్జునుఁడు దుర్యోధనునితో యుద్ధంబు సేయుట (సం. 4-60-1)
క. పులిఁ గోల వేసిన ట్టి | ట్టలపు రయంబునఁ గడంగుటయుఁ దద్వక్షః
స్థలమునఁ గిరీటి రెండ | మ్ముల నాఁటఁగ నేసె బొమలు ముడివడుచుండన్‌.
188
క. క్షతములఁ బెల్లు దొరఁగు శో | ణిత ధారలు మదముగా వినిర్గళకరి యా
కృతిఁ గవిసి యతం డేసెను | శతమఖసుతు ఫాలతలము శాతశరమునన్‌.
189
తే. రక్తధారలు వెడలంగ రశ్మి వెలుఁగఁ | బొలుచు బాలార్కు చాడ్పునఁ జెలువు మిగిలి
ఫల్గునుండు ప్రతాప సంభరిత మూర్తి | యగుచు శరకిరణంబులు నిగుడఁ జేసె.
190
శా. వానిం దీవ్రశరంబులం దునిమి గర్వం బెక్క నానాస్త్ర సం
తానంబుల్‌ గురిసెన్‌ సుయోధనుఁడు దుర్దాంతాకృతిన్‌ గోత్రభి
త్సూనుండుం బటు సాయకోత్కరమునం జూపెన్‌ భుజాటోప మి
ట్లేనుం గేనుఁగుఁ దాఁకునట్లు సమరం బేపారఁగా నయ్యెడన్‌.
191
తే. హస్తిపురిఁ బేరు గల మదహస్తి నెక్కి | క్రాలు కావలి రథములు గవియుఁదేర
నభ్రగజముపైఁ బర్జన్యుఁ డనఁగ నంప | వాన పరఁగ వికర్ణుండు వచ్చి తాఁకె.
192
ఉ. వీఁక నెదిర్చి యిట్లు కురువీరులకుం బ్రమదం బొనర్చుచుం
దాఁకినఁ గ్రోధవేగ సముదగ్రత నెఱ్ఱని చూడ్కిఁ జూచి పే
రాఁకలితోడ నున్న జమునాకృతి భీషణరేఖ యొప్పఁగా
వ్రేఁకని నారసంబుఁ దొడి క్రీడి కరిన్‌ దృఢముష్టి నేసినన్‌.
193
ఆ. ఫాలకుంభ సంధిఁ బడి వాలమున వెస | నుచ్చి పోవుటయును నుర్వి యద్రువఁ
గూలె నగ్గజంబు కులిశ చండాహతిఁ | బడు మహానగంబు భంగి దోఁప.
194
క. అరుణ మణి మాలికా వి | స్ఫురణంబున దంతితనువు చూడఁగ నొప్పెన్‌
ధరణిఁ బడియున్న బహుముఖ | పరిగత దావాగ్నిఁ బొల్చు పర్వతము క్రియన్‌.
195
వ. ఇవ్విధంబున నేనుంగు పీనుంగైన వికర్ణుండు వెఱ చఱచి పఱచి వివింశతిరథం బెక్కె; నాలోనన యట్టి నారాచంబున రారాజు నురంబు నోనాట నేసినఁ గరీంద్రుండు వడుటయు నరేంద్రుండు నొచ్చుటయుం గని ఱిచ్చపడు రథికుల వివ్వచ్చుం డనర్గళ ప్రసారం బగు మార్గణాసారంబున ముంచిన వెగడుపడి విఱిగి పాఱి; రిత్తెఱంగునఁ దనచుట్టును బయలైన నయ్యురగకేతనుండును మరలె; నిట్లు దొరయును విఱిగి కలను వాసి కాలు ద్రోసిపోవుటయు, నతిరథ మహారథు లెల్లం జెల్లాచెద రగుటయుం జూచి సైన్యంబు లున్నవి యున్నచోటన తెరలి కనుకనిం బఱవం దొడంగిన. 196
తే. యూథపతితోడి దంతిసముత్కరంబు | వెనుకఁ దగిలెడు సింగంబు విధము దోఁప
నార్పు నాదంబుగా నరుఁ డంటఁ దాఁకె | రాజుఁ దారును బాఱెడు రథిక వరుల.
197
క. వెనుకొని కర్ణుని పెడతల | యును దుశ్శాసనుని వీఁపు నొక్కొక్క శరం
బున నేసె నప్పు డయ్యిన | తనయుం డిట్లనియె నతిరథశ్రేష్ఠులతోన్‌.
198
ఆ. ‘కూడముట్టెఁ గ్రీడి కురువంశమున కెల్ల | మూలకంద మీ నృపాలుఁ డితని
నిచటఁ గాచికొనుట యెల్ల పౌరుషములు | జేఁత; నిలిచి లావు సేయవలయు.
199
క. అన వినుచుఁ గురుపితామహుఁ | డును ద్రోణుఁడు ద్రోణపుత్రుఁడును గృపుఁడును గ
ర్ణుని మాట సరకుసేయక | చనుచుండఁగ దీనవృత్తి జనపతి పలికెన్‌.
200
క. ‘లోకంబు తోడివారుగ | మీకుం జనునయ్య? మగఁటిమికి గుఱిగాదే
నా కెడరైన యెడం దగఁ | జేకొని యది మీరు చక్కఁ జేయుట యరయన్‌.’
201
వ. అనిన విని వారలు వెనుకయై యాశ్వాస వచనంబులు పలుకుచుం బోవం బోవుచున్న యన్నరేంద్రు నెలుంగెత్తి పిలిచి పార్థుం డిట్లనియె. 202
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )