ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
అర్జునుఁడు దుర్యోధను నుపాలంభించుట (సం. 4-60-15)
ఉ. ‘క్షత్రియుఁ డోడునే? తగదు కౌరవరాజ! యొకండ నేఁ బృథా
పుత్రులలోనఁ బిన్న; నినుఁ బోరికిఁ బిల్వఁగ, మాని నాఁగ ని
ద్ధాత్రిఁ బ్రసిద్ధి కెక్కి బలదర్పసమగ్రుఁడవైన నీవు నీ
మిత్రులుఁ గూడ నిట్లయిన మెత్తురె? వత్తురె కొల్వ భూభుజుల్‌?
203
సీ. ఏనుంగు నెక్కి పె క్కేనుంగు లిరుగడ | రాఁ బురవీథులఁ గ్రాలఁ గలదె?
మణిమయంబైన భూషణ జాలముల నొప్పి | యొడ్డోలగంబున నుండఁ గలదె?
కర్పూర చందన కస్తూరికాదుల | నింపు సొంపార భోగింపఁ గలదె?
యతిమనోహర లగు చతురాంగనలతోడి | సంగతి వేడ్కలు సలుపఁ గలదె?
 
తే. కయ్యమున నోడి పాఱినఁ గౌరవేంద్ర | వినుము నా బుద్ధి; మరలి యీ తనువు విడిచి
సుగతి వడయుము తొల్లింటిచూఱ గలదె? | జూద మిచ్చట నాడంగరాదు సుమ్ము!
204
వ. అని వెండియు. 205
క. ‘నీ యట్టివాఁడు నిస్సీ! | పోయెడిదే యిట్లు? వోకు పోకు’ మనుడు భూ
నాయకుఁడు మరలి పటుకో | పాయత్తతఁ ద్రొక్కఁబడ్డయహిగతిఁ గవిసెన్‌.
206
వ. ఇట్లు కవిసి రథంబులం గడచి కవ్వడిం దలపడియె; భీష్మ ద్రోణాది యోధవీరులు నొక్కుమ్మడి మగిడి యధిపతి తోడన నిగిడి క్రీడియరదంబుఁ బొదివిరి; తక్కిన బలంబులు నంతకుమున్ను కాంతేయు దెస మరలి చూచుచుం బాఱుచునికిం జేసి యేలినవాఁ డఱుముటయును దొరలు తెగువకుం జొచ్చి తిరుగుటయుం గని తెంపుసేసి కూడికొని రభసంబునం జుట్టుముట్టి యతనిపైఁ గ్రందుకొన నడరె; నవ్విధంబున వివిధ వ్యూహంబు లగు బహుయోధయూధంబులు గురిసిన యనేకాస్త్ర శస్త్రంబులు నానాప్రకారంబులఁ గుప్పంగూరలుగాఁదొరఁగినం బెరిఁగిన శౌర్యసంరంభంబున విజృంభించి విజయుం డాశ్చర్య ధుర్య నిరతిశయ రయభరిత(భుజ)కరయుగళుం డయి రథరథ్య సారథి స్వాంగంబులు కాచికొని తన తోడంబుట్టువుల ప్రతిన లూహించి యొండుసేయ నొల్లక, సపరివారంబుగా ధార్తరాష్ట్రుల భంగపెట్టం దలంచి, యింద్రదైవత్యంబును సత్యసంపాతంబును నరాతిసైన్య దైన్య సంపాదనంబును నగు సమ్మోహనాస్త్రంబుం బ్రయోగించిన. 207
ఆ. ఆయుధములు విడిచి యంగముల్‌ సోలంగఁ | దలలు మెడలుఁ జక్క నిలువ కొఱగ
నెల్లవారు నెఱుక లెడలి చొక్కెక్కిని | ద్రాతిశయము గూరినట్టు లైరి.
208
వ. అప్పుడు పాండవోత్తముం డుత్తర మాటలు దలంచి యుత్తరుం గనుంగొని. 209
సీ. ‘ఇక్కురుసైన్యంబు సొక్కు దక్కకమున్న | గ్రక్కునఁ జనుము; రారాజు ద్రోణ
తనయుండుఁ జుట్టిన తలచుట్లు నల్లని | యవి; సూతపుత్రు శిరోంబరంబు
పచ్చనియది; కుంభభవ కృపాచార్యుల | యుష్ణీషములు వెల్ల; లుఱక నీవు
దె మ్మింతవట్టును; దేవనదీసూనుఁ | డియ్యస్త్రమునకు మా ఱెఱుఁగుఁ గాన
 
ఆ. నతఁడు దెలిసియుండు; నాతని దెస వోకు’ | మనిన మత్స్యరాజతనయుఁ డెలమి
దొలఁక నొగలఁ బగ్గములు గట్టి చని వాని | నెల్లఁ దెచ్చి యరద మెక్కుటయును.
210
వ. ‘ఈ రథబృందంబుల యిఱుకటంబు వెడలి నిలుత’ మని కదలినం గిరీటిం దాఁకి గురుపితామహుండు శరవర్షంబులు గురిసిన. 211
క. ఆతని రథ్యంబులఁ డ | త్సూతుని నొప్పించి సాంద్ర సునిశిత బాణ
వ్రాతంబు మేన నించి పృ | థాతనయుఁడు నిలిపి వెడలె దర్పోజ్జ్వలుఁడై.
212
వ. ఇవ్విధంబున నరదంబుల యిఱుకటంబు గడచి యెడఁ గలుగ నిలిచి రాహు నిగ్రహ నిరాస భాసురుం డగు భానుండునుం బోలె వెలుంగుచున్నంత బలంబులు దెలిసిన. 213
ఆ. కౌరవేశ్వరుండు గనువిచ్చి దిక్కులు | గలయఁ జూచి పార్థుఁ గాంచి కడఁగి
యడరఁ జూచుటయును నమరనదీసూనుఁ | డతని కిట్టు లనియె నల్ల నగుచు.
214
క. ‘ఇంత యెఱుంగవు సైన్యము | లింతవడిం దలల చీర లెఱుఁగక మోహా
క్రాంతంబులయ్యెఁ బని దెగుఁ | గౌంతేయుఁడు సొరఁడుగాని క్రౌర్యంబునకున్‌.
215
క. మెడ యొఱగఁ జేతికైదువు | వడ నిను నీ వెఱుఁగకున్న భంగి గనియుఁ గ
వ్వడి యూరకుండు నటె చె | ప్పెడు కొలఁదియె వాని కరుణపెంపు కుమారా!
216
వ. అతండు మన ప్రాణంబులపై రా నొల్లక నిలిచిన మన మింతట నిలుచుట కార్యంబు. 217
ఉ. మోహనబాణపాతమున ముందలచీర లెఱుంగ కున్న యీ
బాహుబలంబుతోఁ గడఁగి పార్థునిఁ దాఁకెడుబుద్ధి గ్రమ్మఱన్‌
సాహసవృత్తిఁ జేసి యవిచారతఁ బోయితిమేని వాఁడు పూ
ర్ణాహుతి సేయఁడే మనల నందఱ నొక్కట మార్గణాగ్నికిన్‌?
218
వ. కావున. 219
క. మనదేశమునకుఁ బోదము | మన మల్లన తెరువు వట్టి; మత్స్యవిభుని గో
ధనముఁ గొని యతఁడు ప్రీతిం | జనుఁగా; కటు మనకు నంతచల మేమిటికిన్‌?’
220
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )