ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
దుర్యోధనుఁడు పరాజితుఁడై మరలి తన పురంబునకుఁ బోవుట (సం. 4-61-24)
వ. అని చెప్పిన పితామహు హితవచనంబు లాకర్ణించి సంగ్రామాతికామియుం గోపాటోపఘూర్ణమాన మానసుండు నగు నమ్మానవేశ్వరుండు నిట్టూర్పు నిగిడించి, యుద్రేకంబు దక్కి నిలిచెం; దక్కటివారలు నూర్జితంబగు నర్జునానలంబు నాలోకించి ధార్తరాష్ట్రు రక్షణ తాత్పర్యంబున శౌర్యంబు సాలించి, భీష్మువాక్య ప్రకారంబు సేసి; రిట్లందఱు ముందర దమవచ్చిన వంకన తిరిగి యరుగుచున్నం గని కిరీటి శంఖరవ జ్యానాదంబులు సెలంగఁ గొండొకదవ్వు వెన్నడిం దఱిమి బిరుదులతోడి గొడుగులును, నడియాలంబులతోడి సిడంబులును వైపించుకొని తృప్తిం బొంది మరలువాఁడై యెల్లవారును వినం బెద్దయెలుంగునం బోయి వచ్చెద నని చెప్పి, గాంగేయ ద్రోణ కృపాచార్యులకుఁ బ్రణామబాణంబు లేసి వారి వీడ్కొనినవాఁడై, మిట్టకోలల రారాజుమకుటంబు మణులు డులిచి యతనికిం జెప్పినవాఁడై, యఖర్వబాహా గర్వ నిర్వహణంబు మెఱయ నప్పుడు మధ్యందినమార్తాండప్రచండుం డగుచుండఁ, గౌరవవీరు లతనిం దేఱి చూడనుం జాలక చని; రతండును జూపఱం దోలి నిలిచిన మదపుటేనుంగు చందంబున నిలిచి విరాటతనయున కిట్లనియె. 221
ఆ. ‘పసులు మరలె శత్రుబలములు పీనుంగు | పెంట లయ్యె; రాజుఁ బెద్దదొరలుఁ
జీర లొలువఁ బడిరి; సిగ్గఱి బిరుదులు | వైచి; రింక మగుడవలదె మనకు.
222
క. హయముల మరల్పు; మీ త | ల్లియు బంధులు నెడలు సంచలింప గుమురు గ
ట్టి యెదురుసూతురు; వారికిఁ | బ్రియముగ శీఘ్రమ్మునం బురికిఁ బోవలయున్‌.’
223
వ. అనిన నతండును రథంబు మగిడించినం జని చని. 224
తే. కాలు తక్కువ వారలు గలయఁ జెదరి | వెనుకఁ బడిపోవునెడఁ దన్నుఁ గని భయమున
బ్రాణదానంబు వేఁడినఁ బార్థుఁ డభయ | హస్త మిచ్చుచు దయ పెనుపారఁ బలుకు.
225
వ. ఇట్లు నానావిధ దీనదశా దందహ్యమాను లగు కృపణులం దన కృపామృతంబునం దడిపినం దేఱి వారు దీవించుచుం బ్రణమిల్లుచుం బొగడుచుం బోవుచుండ ధనంజయుండు భూమింజయుం జూచి. 226
ఆ. ‘కురుబలంబు గెలిచి గోవులఁ గ్రమ్మఱఁ | దెచ్చు టెల్ల నీ యుదీర్ణ బాహు
బలమకాఁగ నీవు పలుకుము; వెలిఁబుచ్చు | టుడుగు మధిపుపాల నొండు దెఱఁగు.’
227
క. అనవుడు ‘నీచేసిన యీ | పని నాచేఁ గాకయునికి పతి యెఱుఁగఁడొకో!
జనులు నిజము సేయుదురే | నిను నెఱిఁగింపకయ చెప్ప నేర్తునె పొసఁగన్‌.’
228
వ. అని యుత్తరుండు మఱియును. 229
క. ‘నీ వలచిన యప్పుడ ధా | త్రీవల్లభుఁ డెఱుఁగునట్టి తెఱఁగు నడపెదన్‌
దేవేంద్రపుత్ర! యే ననఁ | గా వేఱొక పేరు గలదె కార్యము నడపన్‌.’
230
వ. అను వచనంబు లియ్యకొనుచుం జని, శమీవృక్ష సమీపంబున నిల్చి, గాండీవాది సాధనంబులు పూర్వ ప్రకారంబున నిక్షేపింప నియోగించి, కపిధ్వజ దేవదత్త కిరీటాది దివ్యపరికరంబుల సవినయంబుగాఁ బ్రార్థించి యంతర్థానంబు సేయించి యెప్పటి సింహపతాక రథంబున బంధింపం బనిచి విరాటతనయుండు నిజాయుధంబులు గైకొని రథికుండయి వచ్చునట్లుగాఁజేసి, తొంటిచందంబునం దలచీర యలవరించికొని సారథియై సవ్యసాచి నొగ లెక్కె; నట్టి సమయంబునఁ బురందరాది బృందారకులును దేవముని సిద్ధగంధర్వాదులును బాండుప్రముఖ రాజలోకంబును నాశ్చర్యహర్షాయత్తచిత్తులయి సమర విషయంబు లయిన మాటలాడుచు నిజనివాసంబుల కరిగి; రిట నరుండు నుత్తరు నాలోకించి ‘నీ విజయంబు పురంబున ఘోషింప గోపాలురం బుచ్చు’ మనిన నతం డది దెఱంగుగాఁ గైకొని యట్ల చేయ, నిట్లు నిగూఢంబుగాఁ బట్టణంబునకుం జనుచుండ; నంతకు మున్న మత్స్యమహీవల్లభుం డాహవజయదర్పిత వాహినీ పరివృతుండై నగరంబు సొత్తెంచి. 231
తే. మందిరాభ్యంతరమున కానందలీలలఁ | బాండుపుత్రులుఁ దక్కటి బంధుజనులుఁ
దానుఁ జని విప్రులును వనితాజనంబు | సేస లొలుక సింహాసనాసీనుఁ డయ్యె.
232
వ. ఇవ్విధంబునం దన విజయంబుఁ గొనియాడ వచ్చిన వారి నెల్ల నభినందించి ‘యుత్తరుం డెచ్చట నున్న వాఁ?’ డని యడిగి వారల వలనం గురునాథుండు భీష్మద్రోణ కర్ణ కృపాశ్వత్థామాది యోధవీరులు బెరసిన బలంబులతోడ నడచి యుత్తరంబునఁ బసులం బట్టిన నతండు బృహన్నల సారథింగాఁ గైకొని యొక్కరుండ కుయివోవుట విని విషాద వేదనా దోదూయమాన మానసుం డగుచు మంత్రుల మొగంబు సూచి యిట్టనియె. 233
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )