ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
విరాటుఁ డుత్తరుఁడు గురుసైన్యంబు గెలువఁబోవుట విని చింతించుట (సం. 4-63-9)
చ. ‘అసమున మీఁ దెఱుంగక మహాగ్రహవృత్తిఁ గడంగి చెచ్చెరం
బసులకుఁ గూయిగాఁ జనియెఁ బాపఁడు; కౌరవసేన యేడ? యొం
టి సనుట యేడ? నా కిది కడింది విచారము వుట్టె; సైన్యముల్‌
వెసఁ జని తోడు గావలయు వేగమ పంపుఁడు చాలునట్లుగన్‌.’
234
చ. అనుటయుఁ గంకుఁ డిట్లనియె ‘నక్కడ వచ్చి సుశర్మ యోడెఁ గా
వున నిట వీరికిన్‌ జయ మవున్‌; వెఱ పేటికి నీకు? నుత్తరుం
డని నొకరుండు నాకుము బృహన్నల సారథి గాన గెల్చు న
య్యనిమిషకోటినైన నతఁ డద్భుతవిక్రమజృంభణంబునన్‌.’
235
చ. అన వినుచుం గలంగు హృదయంబునఁ దాపము నివ్వటిల్ల ని
ట్లను మఱియున్‌ విరాటుఁడు ‘రణావనియందుఁ ద్రిగర్త సేనచే
ననయము నొచ్చినట్టి జనులందఱుఁ దక్కఁగ నేటుఁ బోటుఁ దాఁ
కని ఘనయోధకోటి సనఁగావలయున్‌ బలుపై రయంబునన్‌.
236
క. చని యక్కుమారుఁ డే మ | య్యెనొ? యత్తెఱఁ గెఱిఁగి మనకు నెయిదించుట పు
ట్టిన కార్యమునకుఁ దగియెడు | పని; యట విధి గెలువ వశమె బ్రహ్మకునైనన్‌.
237
వ. అనుచు నుత్తలపడు నయ్యవసరంబున నుత్తరుఁడు పుత్తెంచిన గోపాలురు పఱతెంచి యతనిం గాంచి. 238
చ. ‘కురుబలమున్‌ జయించి మనగోవుల నెల్లను గ్రమ్మఱించి యు
త్తరుఁ డిదె తాను సూతుఁడు నుదగ్రత వచ్చుచు నున్నవాఁడు; త
త్తురగరథధ్వజాలి నొక త్రుప్పుడు రాలదు; మమ్ముఁ బిల్చి వే
పురి నెఱిఁగింపుఁ డన్న నృపపుంగవ! వచ్చితి మేము’ నావుడున్‌.
239
తే. అంతరంగంబు నిండి రెండలువులందు | వెడలు సంతోష పూరంబు విధము దోఁపఁ
గన్నుఁగవ సమ్మదాశ్రులు గడలుకొనుచు | గండపులకాంకురములతోఁ గ్రమ్ముదేర.
240
క. ‘ఏమేమీ!’ యని గోప | స్తోమముఁ బలుమాఱు నడుగుచున్‌ మెయి వొదలన్‌
భూమీశుఁ డపుడు మంత్రుల | మోములు గనుఁగొని సగర్వమున నిట్లనియెన్‌.
241
శా. ‘వీటన్‌ వీథుల నెల్ల నేనుఁగులపై విస్ఫార ఘంటా ధ్వనిం
జాటం బంపుఁడు పేర్మి నుత్తరుజయాశ్చర్యంబుఁ; బుణ్యాంగనా
కోటిం బుచ్చుఁ డెదుర్కొనంగ మహిత క్షోణీసుర వ్రాతమున్‌
ఘోటస్యందన వారణప్రతతులం గూడన్‌ సతూర్యంబుగన్‌.
242
క. ఉత్తమ కన్యాజనములు | నుత్తరయును గంధమాల్యయుక్తముగఁ గుమా
రోత్తము నెదుర్కొనం దగు; | నత్తెఱఁగున సంఘటింపుఁ డభిరామముగన్‌.’
243
వ. అని నియోగించి గోపాలురకుం గట్ట నిప్పించి పుచ్చి, కంకు నాలోకించి ‘నెత్తం బొక పలక యాడుదమే?’ యని యుబ్బుమై మాటగాఁ బలికిన నతండు ‘నీవు సుమాళంబున న్నున్నవాఁడవు; నేఁడు నీతోడ నాడి జయింప రాదు వెఱతు’ ననిన విరాటుండు నగుచుఁ దత్ప్రదేశంబున మెలంగు సైరంధ్రిం గనుంగొని, సారెలు దెమ్మని పనిచి పలక ముందటికిఁ దిగిచికొనుచు ‘నిందు ర’మ్మనవుడుఁ బాండవాగ్రజుండు ‘జూదం బాడుట యెంత లెస్స!’ యనుచుం జేరి యాడందొడంగునప్పుడు మఱియు నిట్లనియె. 244
ఆ. జూదమాడి ధర్మసూనుండు రాజ్యంబు | ననుజులను బ్రియాంగనను బణంబు
గాఁగ నొడ్డి యాడి కాఱియ పడఁడె? య | ట్లగుట దీనితోడి యర్థి కీడు.
245
వ. అని పలికి యాడుచుండు సమయంబున. 246
మ. నరనాథుండు ప్రమోదసంపదుదితోన్మాదంబుమై నిట్లనుం
‘గురు సైన్యంబుల ముట్టి గెల్చి యెలమిన్‌ గోవర్గముం దెచ్చె; ను
త్తరు బాహాబల శౌర్యసారము లుదాత్తంబుల్‌ గదే! యెందు నె
వ్వరు నెక్కాలము నిట్టు సేసిరె కులైశ్వర్యం బవార్యంబుగన్‌?’
247
వ. అనిన విని కంకుం డతని కిట్లనియె. 248
చ. ‘కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజముఖ్య మహోగ్ర యోధ వి
స్ఫురణము నోర్వఁజాలి రణభూమి భుజాబల ముల్లసిల్ల ను
త్తరుఁడ జయించెనేని వసుధావర! యింతటికంటె నింక న
చ్చెరువును గల్గునే? ధరఁ బ్రసిద్ధికి నెక్కఁడె యాతఁ డొక్కఁడున్‌?’
249
తే. అనినఁ గటకటఁ బడి ‘యిట్టులాడు టెల్ల | నతని విజయము సందియ మనుట గాదె?
యింతవట్టును సైరించి తీవు గాన; | యింక నీమాట లుడుగుము కంకభట్ట!
250
వ. అనుచు విరాటుండు గటంబు లదరఁ గన్నులఁ గెంపు గదురఁ బలుక చప్పు డగ్గలంబుగా నాడుచున్న సరకు సేయక యుధిష్ఠిరుండు వెండియు నిట్లనియె. 251
చ. ‘కురుబల మేల దైత్యసురకోటులు వచ్చిన గెల్వరాదె యు
త్తరునకు నా బృహన్నల రథంబుపయిం బరవాహినీ భయం
కర భుజసారమున్‌ మెఱయఁగాఁ దఱి గాంచితి నంచు విక్రమో
ద్ధురగతి నాజికేలినిరతుం డయి దుర్దమలీల నుండఁగన్‌.’
252
వ. అనిన విని సక్రోధహాసోల్లాస వికృతాననుండై మత్స్యమహీనాథుండు. 253
ఉ. ‘వింతలు సాల నీవలన వింటిమి; గాని, ధరిత్రి నెందు నే
మింతకు మున్ను సారథుల నెవ్వరిఁ జూడమె? వైరివీర దు
ర్దాంత భుజావిలాస మలరం దెగి పోరుల నస్త్ర శస్త్ర వి
క్రాంతిఁ గడంగు వారి?’ నని కన్నుల నిప్పులు రాలుచుండఁగన్‌.
254
క. ‘నా కొడుకు పోటుమాటలు | నీకేటికిఁ బొసఁగ నాడ నేరవు మౌర్ఖ్యో
ద్రేకమునఁ బలుకుచుండుట | మాకు సహింపంగరాదు మానుము విప్రా!’
255
క. అనినం జలమునఁ గుంతీ | తనయాగ్రజుఁ డిట్టు లనియె దరహాసం బా
ననమున ముసుఁగువడఁగ న | జ్జననాయకుతోడ ని ట్లశంకిత భంగిన్‌.
256
ఉ. ‘ఆహవకేళి వేడుక బృహన్నల చిత్తమునం దెలర్చినన్‌
సాహసవృత్తి నుత్తరుని సారథిఁగాఁ గొనిపోయి కౌరవ
వ్యూహము నోర్చి నీపసుల నొక్కఁడు దక్కక యుండ సత్వరో
త్సాహతఁ దెచ్చెఁ గావలయుఁ; దప్పదు నా పలు కట్లు చూడుమీ!’
257
క. అని యంతట నిలువక య | మ్మనుజేశ్వరు మొగముఁ జూచి మఱియును నతఁ డి
ట్లనుఁ ‘బురములోనఁ జాటం | బనుపు బృహన్నల జయంబు భవ్యవిచారా!’
258
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )