ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
విరాటుండు కంకుని సారెఁగొని వ్రేయుట (సం. 4-63-44)
ఆ. అనిన రౌద్రరసము మనమున నడరంగఁ | బడగ యెత్తు నురగపాలు రేఖ
నెనయు చేతిసారెఁ గొని వ్రేసెఁ బతి ‘పేడి | గడన యుడుగు మన్న నుడుగ’ వనుచు.
259
వ. ఇవ్విధంబున వ్రేటువడి యజాతశత్రుం డలుక గదురని హృదయంబుతోడం బాంచాలి దెసం జూడ్కిమలఁగ నూరకుండె; నన్నారీరత్నంబును రయంబునం జేరి వ్రేటుగంటిం దొరఁగు రుధిరంబుఁ దన యుత్తరీయంబున మెత్తన యొత్తి యచ్చేరువ నున్న కనకకలశంబు జలంబులం గరతలంబు దడిపికొని తుడుచున్నప్పుడు మత్స్య మహీవల్లభుం ‘డీశోణితంబు పైచీరం బట్టుటకుఁ గతం బేమి?’ యని తన్నడిగిన నతని కిట్లనియె. 260
తే. ‘విమల వంశంబునను బుణ్యవృత్తమునను | వఱలు నీతని రక్తంబు వసుమతీశ!
ధరణిపై నెన్ని బిందువుల్‌ దొరఁగె నన్ని | వర్షములు గల్గు నిం దనావర్షభయము.’
261
వ. అని చెప్పి యుత్తమ ద్విజలోహితపాతం బెట్లునుం గీడు గావున నీకు నొకహాని పుట్టుటకుఁ జాలక యిబ్భంగిం జేసితి’ నని వెండియుఁ గొండొక కీలాలంబు దొరఁగం దొరఁగం దుడుచుచుండె; నంత నట యుత్తరు నెదుర్కొనం బోయి. 262
క. మంగళ తూర్యరవములు సె | లంగఁగ మౌక్తిక విమిశ్ర లలితాక్షత వృ
ష్టిం గురిసిరి విప్రులుఁ బు | ణ్యాంగనలును భద్రవాక్చయంబులతోడన్‌.
263
ఉ. అత్తఱిఁ గన్యకాజన సహస్రముఁ దానును జేరి వేడ్కమై
నుత్తర చందనార్ధ్ర కుసుమోత్కరమున్‌ నవరత్న సంచయో
దాత్త సువర్ణ పుష్పములు దందడి చల్లెఁ గిరీటిమీఁద న
య్యుత్తరుపైఁ బ్రమోదకలనోత్కట సంభ్రమ సంభృతంబుగన్‌.
264
ఉ. తక్కటి వారలుం గని ముదం బలరారఁగఁ గౌఁగిలించుచున్‌
మ్రొక్కుచు నాదటం దనదు మోముపయిం దనివోని చూడ్కులం
గ్రిక్కిఱియించుచుం బొదివి గెల్పు నుతింపఁగ రాజపుత్రుఁ డ
య్యెక్కుడుమాట కోరువక యిట్లను నర్హజనంబుతోఁ దగన్‌.
265
చ. ‘కురుబలమున్‌ జయించుటయు గోవులఁ దెచ్చుటయున్‌ బృహన్నలా
స్ఫురిత భుజాబలంబునన చూవె; నిజం బిది; నాక యేల? యె
వ్వరికిని నెవ్వరిం గెలువ వచ్చున యిట్టి సహాయ సంపదం
బొరయక యున్న? మీ కెఱుఁగఁ బోలునె నాబ్రదు కెట్టి భంగియో?’
266
వ. అని సారథ్య ప్రశంసా ప్రకారంబుగా నక్కుమారుం డత్యుపచార వచనంబుల చందంబున సంక్రందననందను నుతించుచుం జనుదెంచి రాజమందిర ద్వారంబుఁ జేరు నవసరంబునఁ బ్రతిహారి ససంభ్రమగతిం జని భూవల్లభునకుం బ్రణమిల్లి భూమింజయ ప్రవేశంబు తెఱంగు విన్నవించిన, ‘నా రథికసారథులం జూచు వేడ్క మనంబు వేగిర పెట్టెడు, నయ్యిరువుర నియ్యెడకుం జయ్యనఁ దోడితె’మ్మను విభుని పలుకులు విని ధర్మ తనయుండు పణిహారితో నల్లన యిట్లనియె. 267
క. ‘ఇన్నెత్తురు గనుఁగొనిన బృ | హన్నల కోపించు నన్ను నతిభక్తిమెయిన్‌
మన్నించుఁ గాన; రాజుం | దన్ను విచారింప కేమి తప్పు దలఁచునో?
268
వ. ఇది లెస్సగాఁ దుడుచునంతకుఁ దదీయ ప్రవేశం బించుకవడి వారింపుము; పదంపడి రానిత్తు గాని; యంతకు నుత్తరుం డొక్కరుండ వచ్చునట్లుగాఁ జేయుము.’ 269
క. అని చెప్పి హర్ష సంభ్రమ | మున నజ్జననాయకుండు మునుఁగుట నదియే
మని యడుగఁ దలంపమిఁ దన | కనువై కార్యము ఘటించి యతనిం బుచ్చెన్‌.
270
చ. అతఁడును బార్థు నిల్పి, వినయంబున నుత్తరుఁ దోడి తెచ్చినం
బితృచరణాంబుజంబులకుఁ బ్రీతి మెయిం బ్రణమిల్లె నాతఁ; డా
పతియును జక్కఁ జేర్చె గరుపాఱెడు మేనును హర్ష బాష్ప సం
ప్లుత మగు నాననంబు నయి పుత్రునిఁ బెద్దయుఁ బ్రొద్దు కౌఁగిటన్‌.
271
వ. ఇవ్విధంబున నాలింగితుండయి భూమింజయుండు పునః పునః ప్రణామంబు సేసి, కంకునిం గనుంగొని సగౌరవంబుగా నమస్కరించి, మొగంబుగంటి సూచి ‘యిది యేమి?’ యని యడిగిన. 272
క. ‘ఏ నీ విజయము వొగడఁగఁ | దా నప్పుడు పేడిఁ బొగడె; దానం గోపం
బూనిన సైరింపక నా | చే నడిచితి సారెఁ గొని విశృంఖలవృత్తిన్‌’.
273
క. అని పతి పలికిన విని నె | మ్మనమున భయ సంభ్రమములు మల్లడిగొన న
మ్మనుజేంద్రనందనుం డి | ట్లను నత్యాదరము మెఱయ నాతనితోడన్‌.
274
తే. ‘తప్పు చేసితి రీ; రిట్లు దగునె? వీర | లేమిగతిఁ బల్కినను నది యెల్ల మనము
గైకొనవలయుఁగా; కిట్లు గాదు కూడ | దని నిషేధించు టొప్పునె మనుజనాథ!
275
వ. అని మఱియును. 276
క. ‘సవినయముగఁ బ్రార్థింపుఁడు | పవిత్ర చారిత్రులైన పరమ ద్విజు లి
ట్లవమతులై కోపించిన | నవనీశుల కేల కల్గు నాయువు సిరియున్‌?’
277
వ. అనిన విని యమ్మాటలు పాటిగాఁ బట్టి విరాటుండు భయ భక్తియుక్తంబుగా వేఁడికొనినఁ బాండవాగ్రజుండు నగుచు ‘నాకు నలుక యెక్కడిది? యితండును గీడుతెరువువాఁడు గాఁ; డిదియొక్క కీడుప్రొద్దున నయ్యెం గాని’ యని తాను రాజుదెసఁ బ్రసన్నుం డగుట తెలియునట్లుగా నుత్తరుతోడం బలికిన, నమ్మహీవల్లభుండు సంతసిల్లి, తదవసరంబునఁ బ్రవేశించి కాంచిన యా బృహన్నల నాదరించి నిజనందను నాలోకించి యిట్లనియె. 278
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )