ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
విరాటుఁ డుత్తరుని సమరప్రకారం బడుగుట (సం. 4-64-12)
ఉ. ‘ద్రోణుఁడు భీష్ముఁడుం గృపుఁడు ద్రోణసుతుండును గర్ణుఁడుం బశు
త్రాణ పరాయణత్వమున దర్ప సముజ్జ్వల భంగి నుల్లస
ద్బాణ పరంపరల్‌ గురియఁ బార్థివుఁడున్‌ వెనుదన్ని చూడ న
క్షీణ జవంబునం గవియు సేనకు మార్కొన నగ్గలించితే?
279
ఉ. బాసట లేదు క్రొవ్వడర బంటుతనంబునఁ దాఁకితేనియుం
బాసినచోట వాయుఁ బెఱ పట్టుల వీరు లుదగ్రవృత్తిమై
మూసికొనంగ వత్తు రొక మోహర మమ్ముల మ్రగ్గెనేని నా
సాసల నొక్కరుండ యను నాగ్రహవృత్తి బలంబు పైఁబడున్‌.
280
ఆ. ఒకఁడు పరశురాము నోర్చినవాఁ; డొక్క | రుండు ధనువునకు గురుండు దాన;
హరువరమునఁ బుట్టి యక్షీణ బల విక్ర | మముల నొక్కఁ డొప్పు మాఱు లేక.
281
ఉ. తక్కటి వారలున్‌ సురల దైత్యులనైనను బోర గెల్చువా
రక్కురుసేన మేటిమగ లా ధృతరాష్ట్ర తనూజు లాజి నొ
క్కొక్కఁడ ధాత్రి యంతయును నోర్వఁగఁ జాలుదు రట్టివారి నీ
వెక్కటి దాఁకి నొవ్వకయు నెమ్మెయి గెల్చితి నాకుఁ జెప్పుమా!
282
ఉ. గోవుల నెట్టు లాఁగితి? వకుంఠితవిక్రముఁడైన రాజరా
జేవిధి మానభంగమున కెల్లను నోర్చి పలాయమానుఁడై
నీ విజయంబు సైఁచి ఘననిందకు నియ్యకొనంగఁ జాలెఁ? బు
త్రా! వెఱఁ గయ్యెడున్‌ రణవిధం బఖిలంబు నెఱుంగఁ జెప్పుమా!’
283
చ. అనవుడు నాతఁ డిట్లనియె ‘నక్కురుసేనల నేను గెల్వ; గో
ధనమును నే మరల్ప; మన దైవబలంబునఁ జేసి దేవసం
జనితుఁడు నాఁగ నర్హమగు చందమువాఁడు మహాత్ముఁ డొక్కరుం
డని ననుఁ గాచెఁ; గౌరవుల నందఱ గెల్చి మరల్చె గోవులన్‌.
284
వ. అత్తెఱంగు వివరించి విన్నవించెద నవధరింపుము. 285
తే. ధూళి పెల్లుగ నెగయంగ నేల గోడి | వడఁగఁ జనుమూఁకఁ గని వడవడ వడంకి
పాఱు తేరంగ నమ్మహాభాగుఁ డప్పు | డోడ కోడకు మని నన్నుఁ గూడ వచ్చి.
286
వ. పట్టుకొని మగుడం గొనిపోయి రథంబుపైఁ బెట్టిన నే నతని యాజ్ఞకు మిగులకుండితి. 287
ఉ. కౌరవసేన గోగణముఁ గైకొని పోవ నతండు ముట్టి యం
దారసి రాజుఁ గానక యుపాంతమునం దొలఁగించి వేగ నా
తే రట దోలి యడ్డపడి తీవ్రశరంబుల నబ్బలంబు దు
ర్వారరయంబు మాన్చి పశువర్గము నిద్దెస వెల్చె నార్చుచున్‌.
288
ఆ. చెదరకుండఁ బసులఁ బొదివి యించుకమేర | యిక్క డరుఁగుదెంచి యెలమి మగిడి
కడచి పోవుచున్న కౌరవపతి ముట్ట | నడరినంత సేన లతనిఁ గూడె.
289
మ. కురురాజున్‌ సబలంబుగాఁ గవిసినన్‌ ఘోరాహవం బయ్యె; నం
దరదంబుల్‌ నుఱుమయ్యె, నశ్వములు నుగ్గయ్యెం, గరివ్రాతముల్‌
ధర దంతంబుల యూఁతగా నొఱగె, నుద్యద్బాహుదృప్యద్భటో
త్కరముల్‌ తిట్టినయట్లు గూలెఁ గలయం దద్బాణపాతంబులన్‌.
290
క. శత్రుంతపాదు లగు నృప | పుత్రులుఁ బేరు గల యోధపుంగవులును ద
చ్చిత్ర శరనిహతి సంగర | ధాత్రిఁ బడిరి వారి నెన్నఁ దడవై యుండున్‌.
291
తే. మొనలు దెరలినఁ గర్ణుండు ముంచి తాఁక | నమ్మహావీరుఁ డాతనితమ్ముఁ జంపి
హరుల నొప్పించి సూతు నో నాడ నేసి | యంగముల బాణములు నించి యతనిఁ బఱపె.
292
క. గురుఁడు తలపడిన నతఁ డ | చ్చెరువుగ దివ్యాస్త్రవితతిఁ జిక్కువఱిచి త
ద్వరసుతుఁడుఁ గృపుఁడుఁ దాఁకినఁ | దెరలిచి భీష్మునకుఁ గవిసె దృఢరభసమునన్‌.
293
మ. అతనిం దీవ్రశరంబులం బొదివి నానాస్త్రంబు లేసెన్‌ నదీ
సుతుఁడుం దత్సమయంబునం గినియ నా శూరుండు చాపంబు ద్రుం
చి తదీయాంగము నొంచినన్‌ వివశుఁడై చేడ్పడ్డచో సూతుఁ డు
ద్గత భీతిం దొలఁగంగఁ దోలె రథముం దత్ప్రాణరక్షార్థియై.
294
క. తమ తమ బలములతో ని | ట్లమిత భుజావీర్యులైన యా రథికవరుల్‌
గ్రమమునఁ దలపడి యోడిన | సమరవిహారమునఁ దనివి సనక యతండున్‌.
295
మ. ధరణీనాథుఁడు దానుఁ దమ్ములును దుర్దాంతోద్ధతిం గూడి మో
హర మత్యూర్జితభంగి నేర్చికొని యుద్యద్విక్రమం బొప్ప బం
ధుర సంరంభత నున్నఁ జూచి బలవద్దోఃస్తంభలీలా భయం
కర రేఖా వలమానచాపుఁ డయి వీఁకం దాఁకె నాసేనతోన్‌.
296
క. కౌరవపతి యనుజన్ముల | దూరమునన్‌ విశిఖనిహతిఁ దొలఁగ జడియుచుం
జేరి వికర్ణునికరి నొక | నారసమునఁ గూల్చి కదిసి నరపతి నేసెన్‌.
297
తే. రాజు నొచ్చిన విఱిగిరి రథికవరులు | విభుఁడు దోడన తిరిగె, నవ్వీరుఁ; డపుడు
దోలి యా చిక్కుమూఁకలతోడఁ గూడ | నతని దవ్వుల నడవికి నడిచి మగిడె.
298
వ. ఇది యమ్మహాపురుషు చేసిన విధం’ బనిన విని యచ్చెరువంది విరాటుండు. 299
ఆ. ‘ఆతఁ డెవ్వఁ డొక్కొ! యమ్మహాత్మునిఁ గనుం | గొనఁగఁ గౌఁగిలింప వినయ మొప్ప
నర్ఘ్యపాద్యవిధుల నర్చింప భక్తిసం | యుక్తి నెపుడుఁ గొలిచి యుండవలయు.
300
క. ఎచ్చోట నున్నవాఁ డతఁ? | డిచ్చోటికి నేల రాఁడొ! యిప్పు?’ డనుడుఁ దా
నచ్చట నంతర్హితుఁడై | యిచ్చఁ జనియెఁ; దోఁచు నేఁటి యెల్లిటిలోనన్‌.
301
ఉ. దేవకుమారకుండ యగుఁ దేజము చందము చూడ; నాతఁ డీ
గోవులఁ గ్రమ్మఱించుటకుఁ గూడినయంతియ కాదు; నాకు సం
భావన సేయు వత్సలతభంగులఁ దా మనవంశ మంతయుం
గావను బ్రోవనుం దలఁపు గల్గుట దెల్లము సేసె నెంతయున్‌’.
302
వ. అని చెప్పి యుత్తరుం డతనిం బ్రమోదాయత్తచిత్తుం జేసె; నట్టి సమయంబునఁ గౌంతేయాగ్రజుండు ముఖ ప్రాంతంబు పై చీర చెఱంగునం బొదివికొని ధనంజయునిఁ జక్కం జూడక యుండె; విరాటుండు కిరీటి పరాక్రమంబు క్రమంబున నిట్లు దనతనయునివలన వినియునుం దెలియక యెప్పటి నపుంసకత్వ బుద్ధితోడన సంభావించి పోవం బనిచిన, బృహన్నలయును ‘జతురంబుగాఁ బలికి; తిదియ తెలుపు తెఱంగు; ధర్మనందనునకు నింతకు మిక్కిలి యెఱింగింపకుండునది’ యని వైరాటితో నల్లన చెప్పుచుం జనియె; నజ్జననాయకుండును గంకునిం బొమ్మని, యుచితపరివారపరివృతుండయి భూమింజయు నంతిపురంబునకుం దోడ్కొని యరిగి సుదేష్ణాసందర్శన సమాచరణంబు నడపి, యతం డడుగఁ ద్రిగర్తపతి నోర్చిన తెఱం గెఱింగించె; నట నరుండు నాట్యశాలకుం బోయి. 303
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )