| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అనిన విని యతండు విస్మయ సంశయంబులు మనంబునం బెనంగొన ‘నితండు ధర్మతనయుండయేని భీమార్జున నకుల సహదేవులుం బాంచాలియు నేరి?’ యని యడిగినఁ గవ్వడి యిట్లనియె. | 322 |
| చ. |
‘వలలుఁ డనంగ నీ నగర వంటలవాఁ డయి నిల్చి, వేడ్కకుం బులిఁ గరిఁ గేసరిం దొడరి పోరఁగఁ బంచినఁ బోరు, జెట్టి మ ల్లుల విఱుచుం గడంగి ప్రబలుం డనఁగాఁ జరియించుచుండు వి చ్చలవిడి; భీముఁ డీతఁ డవిషహ్య పరాక్రమదుర్దముం డనిన్. |
323 |
| తే. |
బక మహాసురు నిర్జించి బ్రాహ్మణులకు | బ్రీతిఁ గావించెఁ, గిమ్మీరు పే రడంచి వనము నిష్కంటకము సేసె; ఘను హిడింబుఁ | గూల్చి యాతని చెలియలిఁ గొనియె నితఁడు. |
324 |
| క. |
నీ మెచ్చువారువంబులఁ | దా మచ్చిగ నరయు నిత్యతాత్పర్యమునన్ దామగ్రంథి యనఁగ నొక | నామము ధరియించె నితఁడు నకులుం డధిపా! |
325 |
| క. |
శత్రునృప కాలకూటము | మిత్రామృతవృష్టి బుధసమీహిత సిద్ధి క్షేత్రము సజ్జన సంస్తుతి | పాత్ర మితఁడు మాద్రి తొలుతపట్టి నరేంద్రా! |
326 |
| క. |
నీ పాలికి వచ్చి నిఖిల | గోపాలక ముఖ్యవృత్తిఁ గొలువు వడసి తం త్రీపాలుఁ డనఁగ మత్స్య | క్ష్మా పాలక! మెలఁగు వీఁడె సహదేవుండున్. |
327 |
| క. |
సుకుమార మానసుఁడు, గొం | తికిఁ బ్రాణము ప్రాణ మితఁడు, తేజో గణ్యుం డకుటిలుఁడు రాజనీతి | ప్రకారసంవేది వంశపావనుఁడు నృపా!’ |
328 |
| వ. | అని యిట్లు ధర్మజ భీమ నకుల సహదేవులం గ్రమంబునం జూపి చెప్పి మఱియు నిట్లనియె. | 329 |
| క. |
‘విను సైరంధ్రీ వేషం | బున మాలిని యనఁగఁ బరఁగి పూతచరిత్రం బునఁ గేకయ భూవరనం | దనకడ మెలఁగు సతి ద్రుపదతనయ మహీశా! |
330 |
| క. |
ఆ చపలాక్షికిఁ గా మన | కీచకు లందఱను రాత్రి గీటడఁచె రహ స్యోచిత విధమున గంధ | ర్వాచరణము పేర భీముఁ డతి భీమముగాన్.’ |
331 |