ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
విరాటునకు భీముఁ డర్జును నెఱింగించుట (సం. 4-66-1)
వ. అనియె; నప్పుడు వృకోదరుండు. 332
సీ. ‘షండరూపమునఁ బ్రచ్ఛన్నుఁడై వచ్చి, క | న్నియలకు నెల్లను నృత్తగీత
వాద్యనైపుణ మనవద్య శిక్షావిధి | నలవరించుచు బృహన్నల యనంగఁ
బరఁగు నీతండు బీభత్సుండు సుమ్మని | చూపి, యమ్మత్స్యరాజునకుఁ జెప్పి
వెండియుఁ బలుకు ‘నాఖండలు నోడించి | ఖాండవ మేర్చె, నాతండు దన్ను
 
తే. గారవించిన నెక్కటి కాలకేయ | వర్గములఁ బరిమార్చె, నివాత కవచ
సంఘముల నోర్చె, గంధర్వసమితి గెలిచి | ధార్తరాష్ట్రాగ్రజుని చెఱఁ దలఁగె నితఁడు.’
333
వ. అనిన విని యద్భుతరసాక్రాంతం బగు నంతరంగంబునం గలుగు సందేహావేశంబు వినయ సంభ్రమంబుల నిగుడనీకునికిం జేసి చిక్కువడి యున్న నిజజనకునకు నర్జునుం జూపి యుత్తరుం డిట్లనియె. 334
తే. ‘ఈతఁ డింతకు మీకుఁ దన్నెఱుఁగఁ జెప్ప | వలవదని నియమించినఁ దెలియఁ బలుక
నలికి; యొక దేవసన్నిభుం డంటిఁ గాని | నిన్న యంతయుఁ దాఁ గదా నిర్వహించె!
335
చ. ఒకరుఁడ తాను భీతి వెగడొందెడు రెండవ యేను నెట్టకే
లకుఁ ననుఁ దేర్చునప్పుడు బలంబులతోఁ గురురాజు సూడ దా
నికి మది శంక లేమి మహనీయ పరాక్రముఁడైన యీ కిరీ
టికిఁ జనుఁ గాక యివ్విధము డెప్పర మన్యుల కోర్వ వచ్చునే?
336
చ. తము నెఱిఁగించి యల్ల నుచిత ప్రియభాషల నన్ను సూత కృ
త్యమునకుఁ జొన్ప, నేను బ్రమదంబున నప్పటి కియ్యకొంటి లో
కము సమరంబులట్ల యని; కయ్యము తీవ్రతకుం దగంగ ర
థ్యములఁ జరింపఁ జేఁత భరమై తుదిఁ బల్మఱు నోహటించితిన్‌.
337
క. మొగ మోడఁ డితఁడు కౌరవ | జగతీశుఁడు విఱిగినపుడు జవమున వెనుకం
దగిలి ‘యిది జూద మాడఁగ | నగునెడఁగా దఱుమ వలయు’ ననియె నతనితోన్‌.’
338
ఆ. అనిన నతఁడు వెఱపు నత్యాదరంబును | సంతసంబు మానసమున బెరయ
నవయవముల సంభ్రమావేశ మేర్పడ | గారవమున విజయుఁ గౌఁగిలించె.
339
క. వినయంబు మిగులఁ గుంతీ | తనయాగ్రజు పాదపీఠతలమున ఫాలం
బును బొందఁ జాఁగి మ్రొక్కి య | తని కౌఁగిలి వడసె సమ్మదము దళుకొత్తన్‌.
340
ఆ. ప్రీతి నలుమడింప భీమునిఁ గవల నా | లింగనంబు సేసి యంగకములఁ
బులక లెగయఁ గేలు దల మోడ్చి ధర్మజు | నాననమున దృష్టి యడర నిలిపె.
341
ఉ. అత్తఱి లేచి వచ్చి తన యన్నలఁ దమ్ములఁ గానిపించె న
య్యుత్తరు నర్జునుండు; దగ వొందఁగ నప్పుడ పిల్వఁ బంచె మా
త్స్యోత్తముఁ డార్యమిత్ర సచివోత్కర సోదరవర్గపుత్రకో
దాత్త భటాదియోగ్యుల ముదంబునఁ బాండవ దర్శనార్థమై.
342
వ. ఇట్లు సమస్తజన సమేతంబుగా ధర్మతనయ సేవా తత్పరుండై తదనుమతి సముచిత రుచిరాసనంబున నుండి విరాటుం డంతఃపురవర్తులం బిలిచి యంతయు సుదేష్ణ కెఱింగింపం బనిచి, పాంచాలిం దగిన తెఱంగున గారవించునట్లు గావించె; నట్టియెడ ధనంజయుం డతని కిట్లనియె. 343
తే. ‘చాల దుస్తరమైన యజ్ఞాతవాస | వత్సరంబు భగద్గర్భవాస గుప్తి
వలనఁ గడపితి మతి సుఖావాప్త చిత్త | వృత్తి నేము నిర్భయులమై విందులట్ల.’
344
వ. అనిన విని విరాటుం డతని కిట్లనియె. 345
ఉ. ‘ఏనన వేఱ యొక్కఁడనె? యిట్లనఁగాఁ దగునయ్య? యిమ్మెయిం
గానన దేశవాసములఁ గాఱియ కోర్చి యడంగి యుండి మీ
పూనిక దీర్చి మీ రెలమిఁ బొందుట యెల్లను బుణ్యదేవతా
నూన దయాసమృద్ధి నను నొందుట గాదె సురేంద్రనందనా!’
346
వ. అని పలికి ధర్మనందనుం జూచి. 347
చ. ‘ధరణియుఁ బట్టణంబు హయదంతి రథంబులు గోవులున్‌ భటో
త్కరము నమాత్యవర్గమును గాఁ గలరాజ్య మితండ యేలు; ని
ర్భరమున నేనుఁ బుత్రులును బంధులుఁ దమ్ములుఁ గొల్చి యుండెదం
గరిపురి కెత్తునట్టిపని గల్గిన నోపిన యంత సేసెదన్‌.’
348
చ. అన విని యుత్తరుండు తగ నజ్జనపాలకుతోడ నిట్లను
‘న్మన కొక రాజ్యముం గలదె? నన్నును నిన్నును నిన్న మొన్న వీ
రనితరసాధ్య శత్రు విజయంబునఁ గాచినయప్డు గల్గఁ జే
సినయది దక్క; దాని మఱి సెప్పఁగ నేటికి నింత వింతగన్‌?
349
వ. అది సిద్ధం బట్ల చెల్లుం గాక! యించుక విశేషంబు గలదు; వినుము. 350
చ. సవినయ వృత్తిఁ గొల్వ మిట చన్న దినంబుల వీరు నీఱుపైఁ
గవిసిన నిప్పులట్ల యధికంబగు తేజము దోఁప కున్కి; న
ట్టి విధము సాపరాధతను డెందము లూఱటఁ బొంది యుండ నే
రవు మన; కట్లు గానఁ దగఁ బ్రార్థన సేయుట యుక్త మిత్తఱిన్‌.
351
వ. అదియునుం గాక. 352
క. ధనవర్గంబులు వీరి | చ్చినయవి; యట్లగుట వేడ్క సేయవు; తగ నూ
తన మగు కానిక యీవల | యును వే తోడ్తేరఁ బనుపు ముత్తరఁ బ్రీతిన్‌.’
353
వ. అనిన విని మత్స్యమహీవల్లభుండు మనంబలర మంత్రుల మొగంబు సూచి ‘కుమారికనలంకరించుకొని తెం’ డని నియోగించిన, వారును బ్రియంబునం జని తత్కార్యశ్రవణ సంప్రీతయగు సుదేష్ణ యనుమతంబున. 354
క. పదనికి రాఁ బులు గడిగిన | మదనాస్త్రము రేఖ గలిగి మానినిమెయి సె
న్నొదవఁ గయిసేసి రప్పుడు | ముదితా జనములు ప్రమోదమున లలితముగన్‌.
355
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )