ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
విరాటుని మంత్రు లుత్తరను బాండవుల యొద్దకుఁ దోడ్తెచ్చుట (సం. 4-66-27)
వ. ఇట్లు శృంగారంబు సేసిన యమ్ముద్దియకు ముక్తాఫల ప్రాలంబ మాలికలతోడి గొడుగు వట్టించి యత్యాదరంబున నయ్యమాత్యులు తోడ్తేర ధారాధర నికర మనోహరయగు పర్జన్యలక్ష్మియుంబోలె వచ్చుచున్నం గని విరాటుం డెదురు వోయి పురోహితులును బంధుజనంబులుం దానునుం బొదివికొని పాండవాగ్రజు నగ్రభాగంబునకుం దెచ్చి యచ్చెలువ నిలిపి, సపరివారంబుగా దండప్రణామంబు సేసి, చేతులు మొగిడ్చి యిట్లనియె. 356
క. ‘ఎఱుఁగమి చీఁకటి నీ పె | ద్దఱికంబు దలంప; నేమి తప్పు గలిగినన్‌
మఱచి దయఁ జూడు; మిట్లం | దఱు నీకుం బనులు సేయఁ దగుదురు వీరల్‌.’
357
వ. అని నిజానుజ తనూజులం జూపి, మఱియును. 358
క. ‘ఇమ్ముద్దియ నర్జునునకు | ని మ్మీపని బంధుజనుల కిందఱకుఁ గడున్‌
సమ్మత; మెల్ల ప్రజకు నే | నిమ్మెయి నినుఁ జేరి బ్రతుకు టిష్టం బధిపా!’
359
క. అని పలికిన విని కుంతీ | తనయాగ్రజుఁ డింద్రసుతువదన మాలోకిం
చిన నాతఁ డిట్టులను న | మ్మనుజేంద్రుఁడు వినుచునుండ మత్స్యాధిపుతోన్‌.
360
క. ‘ఈ కన్నియఁ గోడలిఁగా | గైకొనియెదఁ గాని యిది దగ దుచితవృత్తిన్‌
నాకడన యబల మెలఁగుట | లోకము శంకించు నన్ను లోలాత్మునిఁగన్‌.
361
వ. అదియునుం గాక నృత్తగీతాదులయెడ ని క్కోమలికి గురుండనైన నాకు నివ్విధంబు ధర్మంబు గాదు కావున. 362
మ. హరి మేనల్లుఁడు, బాహువీర్య పటు శౌర్యస్ఫూర్తి త్రైలోక్య సుం
దరుఁ, డాచార పవిత్రుఁ, డంచిత కళాదక్షుం, డుదారుండు, కా
తర సంరక్షకుఁ, డార్య సమ్మతుఁడు, విద్యా వైభవోల్లాసి, య
త్యురుతేజుండు వరించుఁ గాక యభిమన్యుం డీ సరోజాననన్‌.’
363
వ. అనిన విని మత్స్యమహీకాంతుం డత్యంత సంతుష్టాంతరంగుండై. 364
తే. ‘అర్జునుని వియ్య మనియెడు నంతకంటెఁ | గడవఁ బెంపు నా కెయ్యది? కార్యనిశ్చ
యంబు ధర్మతనూభవుం డానతిచ్చు | వాఁడు; మనమెల్లఁ గావించు వార మదియు.’
365
ఆ. అనుడు నతని కిట్టు లనుఁ బాండవాగ్రజుం | ‘డింద్రతనయుఁ డుచిత మెఱిఁగి పలికె;
నిట్లు సేయువార; మిప్పుడు చుట్టాల | కెల్లఁ జెప్పిపుచ్చుఁ డీశుభంబు.’
366
వ. అని నిశ్చయించి పలికిన విరాటుండును ‘గౌరవాన్వయ సంబంధంబున మాత్స్యవంశంబు పావనం బయ్యె’ నని పలుకుచు ధర్మజ భీమార్జున నకుల సహదేవులకుఁ గ్రమంబున నుత్తరఁ బ్రణామంబు చేయించిన, వారు దీవించి యంతఃపుర గమనంబునకు ననుజ్ఞసేయ, నచ్చెలువ నెచ్చెలులుం దానును దత్సమయసముచితపరివార పరివృతయై యరిగిన యనంతరంబ, మౌహూర్తికుల రావించి లగ్న నిరూపణంబు సేసి యాదవ పాంచాలాది బంధుజనంబుల నెల్లఁ బెండ్లికిం బిలువ రెండు దెఱంగుల వారును గాలరులం బనిచి; రజాతశత్రుండును విరటు గారవించి తా రతనిపాల నజ్ఞాతవాసంబు సుఖవృత్తి నడపికొనుట వాక్రుచ్చి పలికి, యతని గుణంబులు గొనియాడి ‘నీవు మాకు వాసుదేవునట్ల కాక సామాన్య బంధుండవే?’ యని సంభావించి, వినయ నిభృతుం డగు నతనిం దిగిచి పునఃపున రాలింగనంబు సేసిన, నతండును ససంభ్రమ పరిజన సముపనీయ మానంబు లగు నానా విధోపకరణంబులం గౌంతేయుల వివిధోపచారంబు లాచరించి, మహార్హ మజ్జన భోజనంబులు నడపె; నంత, నక్కడ దుర్యోధనుండు నిజపురంబునకుం జనిచని నడుమ విడిసిన యెడం గర్ణశకుని దుశ్శాసనుల దుర్మంత్రంబుఁ బట్టి గాంగేయుని వచనంబు లప్రమాణంబులు సేసి, ధర్మతనయుం డసత్యంబున కియ్యకొనమి యెఱింగి యాతనిపాలికి దూతం బుత్తెంచిన, వాఁడు నేతెంచి కాంచి యిట్లనియె. 367
తే. ‘వాలి యజ్ఞాత వాస సంవత్సరంబు | నిండకుండంగ మున్న పార్థుండు బయలు
మెఱసి సమయంబు దప్పె; నీ వెఱిఁగి దీని | కేది తగు నది సేయుము మేదినీశ!’
368
వ. అని పునర్వనవాసకరణంబు దోఁప నాడిన నవ్వి, యధిష్ఠిత సత్యవ్రతుం డయిన యుధిష్ఠిరుం డతని కిట్లనియె. 369
క. ‘నిండె సమయాబ్దములు; నిం | కొం డనలే; దిపుడ చని సుయోధనుతో భీ
ష్ముండును గురుఁడును వినఁగా | నిండె; ననుము నిండె నిండె నిక్కంబునకున్‌.’
370
చ. అని తగఁ జెప్పి పుచ్చఁ జని యాతఁడు తప్పక చెప్పె; నంతయున్‌
విని ధృతరాష్ట్రసూనుఁడు వివేకవిహీనత నాఁటి రాత్రి కొ
ల్వున గురు భీష్మ కర్ణ కృపులుం దనతమ్ములు నుండ ధర్మనం
దనునకు దూతఁ బుచ్చిన విధంబు ప్రకాశము సేయ కిట్లనున్‌.
371
ఆ. ‘మనము మోసపోయి యనిమిషపతి సూతి | తోడఁ బొడిచితిమి యదోషవృత్తి;
నతఁడు సమయకాల మంతయుఁ గడచిన | వచ్చెనో యెఱుంగ వలయు నిజము.’
372
క. అనిన విని ‘యేటి మాటలు | వినువారలు నగరె? యేను వివ్వచ్చుఁడు న
చ్చినయపుడ తెలుపనే? వల | దనుమానము; సమయకాల మట మును కడచెన్‌.’
373
క. అనవుడు భీష్ముని పలుకులు | విని యందఱు సమ్మతించి ‘వెరవిఁడియే ఫ
ల్గునుఁ?’ డనిరి; పతియుఁ బురికిం | జనియెను మఱునాఁడు విరళ సైన్యంబులతోన్‌.
374
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )