ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
శ్రీకృష్ణుఁడు బలదేవాదులతోఁ బాండవులఁ జూడవచ్చుట (సం. 4-67-19)
వ. ఇవ్విధంబునం బ్రకాశులై పాండునందనులు శమీవృక్ష నిక్షిప్త సమస్త సాధనంబులుఁ బూజాపూర్వకంబుగాఁ దెచ్చుకొని, యుపప్లావ్యంబున వసియించి, మత్స్యమహీనాథుండు పంపుసేయం బెంపు మిగిలి పౌర జానపద సమానీత నానావిధోపహారంబులు గైకొనుచు, బహురత్నంబులకు భాజనంబులై మహనీయ విభూతి శోభిల్లుచున్నంత, వాసుదేవుండు బలభద్ర పురస్సరంబుగా సాత్యకి సమేతుండై సుభద్రాభిమన్యులం దోడ్కొని, కృతవర్మయుఁ బ్రద్యుమ్నుండును సాంబుండును యుయుధానుండును రుక్ముండును నక్రూరుండును నింద్రసేనాది పాండవ సారథులును రథారూఢులై కొల్చిరా, మఱియు ననేక యాదవ కుమారులును గరితురగ స్యందన నిబిడంబు లగు బలంబులతోడ నిరుగెలంకుల నడవం జనుదెంచి. 375
తే. భవ్యవిభవంబుతో నుపప్లావ్యపురము | చొచ్చి సంభ్రమమునఁ బాండుసుతులు తనకు
నెదురు వచ్చిన నాహ్లాద మెసక మెసఁగఁ | దత్సమాగమ యోగ్య విధంబు నడపె.
376
వ. బలదేవ ప్రముఖులకును దదీయ సందర్శన సముచిత సమాచారంబు లొనర్చి సుభద్రాభిమన్యులం బాంచాలి పాలికిం గొనిపోవ నభ్యంతర జనంబుల నియోగించి. 377
క. లలిత మణిమయ విభూషణ | ములు రుచిరాంబరములును బ్రమోద మెదల ని
ట్టలముగ హరి కుంతీపు | త్రుల కెల్లను నిచ్చి పిదప ద్రోవది కిచ్చెన్‌.
378
వ. ఇట్లు కట్టనిచ్చి వేఱు వేఱ రథకరితురగ దాసదాసీ జనంబుల నొసంగి పద్మనాభుండు పాండవులుం దానునుం గలసి సంతసంబున నలరారుచుండెఁ; దదనంతరంబ. 379
సీ. ద్రుపదభూవిభుఁడు పుత్రులుఁదానుఁ జతురంగ | బలములతో వచ్చి పాండుసుతులఁ
గాంచి వారలు తన్నుఁ గరము సంప్రీతిమై | గారవింపఁగ నుండెఁ, గాశిరాజు
శైబ్యుండుఁ బదపడి సైన్య సమేతులై | చనుదెంచి ధర్మనందనుని చేయు
సత్కారముల గాఢ సమ్మదంబునఁ బొంది | రవ్విరాటుండును నంతవట్టు
 
తే. వారలకు; దత్తదుచిత ప్రకారములఁ బ్రి | యంబుఁ దలకొన సంవిధానంబు సేసె
మఱియు బహుదేశముల బంధు మాన్య మిత్ర | వర్గములు వేడ్కఁ బెండ్లికి వచ్చెఁ గలయ.
380
వ. ఇవ్విధంబున రెండు దెఱంగుల చుట్టంబులు నైన భూపతులు తమ తమ విభవంబులు మెఱసి వచ్చియుండ విరాటుండు పురంబున నుత్సవంబు సాటించిన. 381
క. కలువడములు మణితోరణ | ములుఁ గట్టిరి, క్రముక కాండ మోచా స్తంభం
బులు నాటిరి, కుంకుమమునఁ | గలయ నలికి మ్రుగ్గులిడిరి కర్పూరమునన్‌.
382
క. వివిధాలంకరణంబుల | నవకాంతి వహించి పట్టణంబు వివాహో
త్సవ మాధవలక్ష్మికి లలి | త వనంబై యెలమి కలిమి తావల మయ్యెన్‌.
383
ఉ. తాను సుదేష్ణయున్‌ సుతులుఁ దమ్ములు బంధులు గంధమాల్య నా
నా నవరత్న భూషణమనః ప్రియ మాంగలిక ప్రసాధనా
నూన విభూతి మత్స్యవిభుఁ డుజ్జ్వలలీల వహించి భూమిదే
వానయనాది కృత్యపరులైన జనంబుల గారవించుచున్‌.
384
వ. గరువంపు సంభ్రమంబులతోడ నిజమందిరంబునందు. 385
సీ. అమల రత్న ప్రదీపావలి మెఱుఁ గిడఁ | బనిచి మణిస్తంభ పంక్తిఁ గ్రొత్త
జిగి దళు కొత్తునట్లుగఁ దొడయించి వి | చిత్ర వితానముల్‌ చెలువు మిగులఁ
గట్టించి నూత్న ముక్తాదామములతోడఁ | గుసుమ మాలిక లెడఁ గ్రుచ్చి వ్రేలఁ
గీలింప నియమించి కేవల మంగళ | భూరుహపల్లవ తోరణములు
 
తే. సంఘటింప నియోగించి చందనమునఁ | బరిణయాగార మలుకంగఁ బాణియాణి
గలుగు ముత్తియముల మ్రుగ్గుగా నొనర్పఁ | జతుర పుణ్యాంగనా జనతతిఁ బొనర్చె.
386
క. వైదిక లౌకిక విధి సం | పాదిత వివిధార్హ వస్తుభరితత్వమునన్‌
వేదిక పొలు పగునట్లుగ | మోదమునఁ బురోహితుండు మునుకొని చేయన్‌.
387
క. ఉత్తర నలంకరింప ను | దాత్తాభరణాది వస్తుతతి యొసఁగి నరేం
ద్రోత్తముఁడు నేర్పు గల చెలి | కత్తియలం బుచ్చెఁ బ్రీతి కడలుకొనంగన్‌.
388
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )