ఇతిహాసములు మొల్ల రామాయణము అరణ్య కాండము
సీతను గానని శ్రీరామచంద్రుని విరహాతిశయము
ఆ. పర్ణశాలలోనఁ బరికించి పరికించి,
సీత కానఁ బడమిఁ జిన్న వోయి,
చిత్తమంతఁ గలఁగి, శ్రీరామచంద్రుండు
పలువరింపఁ జొచ్చె బ్రమసి బ్రమసి.
51
సీ. నీ దృగ్విలాసంబు నెఱి నభ్యసించెడు-గురు కుచఁ గానవే హరిణ విభుఁడ?
నీ మంజులాలాప నిచయంబుఁ గైకొన్న-సుకుమారిఁ గానవే పిక కులేంద్ర?
నీ నిండు సత్కాంతి నెమ్మోము గలయట్టి-రుచిరాంగిఁ గానవే రోహిణీశ?
నీ పక్ష విస్ఫూర్తి నెనయు ధమ్మిల్లంబు-గల యింతిఁ గానవే యళి కులేశ?
 
తే. స్తన భరంబున నీ పోల్కిఁ దనరినట్టి-యతివఁ గానవె చక్రవాకాధినాథ?
నెఱయ నినుఁ బోలు నెన్నెడ నేర్చినట్టి-రమణిఁ గానవె నీవు మరాళ రాజ?
52
సీ. ఘనసార భూజంబ! కానవే నీ వంటి-గంధంబు గలయట్టి కరటియానఁ?
గదళికా తరురాజ! కానవే నీ యట్టి-మెఱుఁగుఁ బెందొడల మా మీననేత్ర?
విలసిల్లి చంపక వృక్షంబ! కానవే-లలి నీదు పుష్ప విలాస నాసఁ?
గమనీయ లత! నీవు కానవే నీయట్టి-కరములు శోభిల్లు కంబుకంఠిఁ?
 
తే. గ్రముక ధరణీరుహాధీశ! కానవయ్య-నీ ఫల స్ఫూర్తి కంఠంబు నీలవేణిఁ?
గళికలను మించు నవకుంద! కానవమ్మ-నీదు కోరిక నిభదంత నీరజాస్య?
53
సీ. వనజాస్య! నినుఁగూడి వర్తించు నతి ఘోర-వనములు శృంగార వనము లగును,
పడఁతి! నీతోఁగూడి పవళించు కర్కశ-శయ్యలు పూవుల శయ్య లగును,
గలకంఠి! నీచేతి కంద మూలాది భో-జనములు మధుర భోజనము లగును,
హరిమధ్య! నినుఁ గూడి చరియించు నటువంటి-తపములు సత్పుణ్య తపము లగును,
 
తే. ఇంతి! నీతోడఁ గూడి భోగించునట్టి-భోగమంతయు దేవేంద్ర భోగ మగును,
సుదతి! పొడకట్టఁ గదె నాకుఁ జూడవలయుఁ-గన్నులకుఁ గానఁబడ వేమి కమల నయన!
54
వ. అని మఱియును, 55
సీ. ఏ మృగంబును గన్న నేణాక్షిఁ గానవే?-యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే పక్షిఁ గనుఁగొన్న నెలనాఁగఁ గానవే?-యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే మ్రానుఁ బొడగన్న వామాక్షిఁ గానవే?-యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే గట్టుఁ బొడగన్న నిభయానఁ గానవే-యని పెక్కు భంగుల నడిగి యడిగి,
 
ఆ. కలఁగు, భీతి నొందుఁ, దలఁకుఁ జిత్తములోన,-సొలయు, మూర్ఛఁ బోవు, వలయు, నలఁగు,
సీతఁ గానఁబడమి శ్రీరామచంద్రుండు-విరహ తాప వహ్ని వేఁగి వేఁగి.
56
వ. ఇట్లు సీతా వియోగంబునకుఁ బలవరించుచున్న యన్నం గని సౌమిత్రి యిట్లనియె, 57
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - araNya kAMDamu ( telugu andhra )