| ఇతిహాసములు | మొల్ల రామాయణము | బాల కాండము |
| కౌశికుని యాజ్ఞపై రాముఁడు తాటకను గూల్చుట | ||
| మత్త. |
వారిఁ దోడ్కొని కౌశికుం డట వచ్చు నయ్యెడ ఘోర కాం తార మధ్యమునందు నొక్కతె దైత్య కామిని భీకరా కార మొప్పఁగ నట్టహాస వికాస మేర్పడ రాగ నా క్రూర రాక్షసిఁ జూచి య మ్ముని కుంజరుం డొగి రామునిన్. |
52 |
| క. |
తాటక వచ్చిన దదిగో నాటగ నాఁడుదని మేలమాడక నీ వీ పాటి పడనేయు మని తడ బాటున శంకించు రామ భద్రున కనియెన్. |
53 |
| వ. |
ఇట్లు చెప్పిన యా మునిచంద్రుని పల్కు లాలించి, రామచంద్రుండు తన యంతరంగమ్మున నిట్లని వితర్కించె. |
54 |
| క. |
ఈ యాఁడుదానిఁ జంపఁగ నా యమ్మున కేమి గొప్ప? నగరే వీరుల్? చీ యని రోయుచు నమ్ముని నాయకు భయ మెఱిఁగి తన మనమ్మున నలుకన్. |
55 |
| క. |
వ్రేటు గొని రామచంద్రుఁడు సూటిగ నొక దిట్ట కోల సురలు నుతింపన్ ఘోటక సమ వక్షస్స్థలఁ దాటక నత్యుగ్ర లీల ధరపైఁ గూల్చెన్. |
56 |
| వ. |
అట్లు తాటకం గీటణంచినయంత, నమ్మునీంద్రుండు మేటి సంతోషమ్మున రామునిం గొనియాడుచు నశ్రమంబున నిజాశ్రమంబున కేఁతెంచి, రామ సౌమిత్రుల సాయంబున జన్నంబు సేయుచున్న సమయంబున. |
57 |