కావ్యములు గంగాలహరి రామచంద్ర కౌండిన్య
(ఓరుగంటి రామచంద్రయ్య)
లోచనము - శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ

గంగాలహరి జగన్నాథ పండితరాయకృత లహరీపంచకములో నొకటి. అమృతలహరి (యమునాస్తవము), సుధాలహరి (సూర్యస్తవము), లక్ష్మీలహరి (లక్ష్మీస్తవము), కరుణాలహరి (విష్ణుస్తవము) అనునవి మిగిలిన లహరీచతుష్కము.

లహరీపంచక కర్తయైన జగన్నాథుడు తపోవనభూమికి దీటయి, వేదశాస్త్రాధ్యాపకుల కాలవాలమై, ఫలవృక్షారామాభిరామ మయిన కోన మండలము నందలి ముంగండాగ్రహారము లోని యుపద్రష్ట వంశమున జనించిన సుకృతి, యజుశ్శాఖాధ్యాయి, ఆపస్తంభ సూత్రుడు, కౌండిన్య గోత్రుడు; తల్లి లక్ష్మీదేవి; జనకుడు పేరుభట్టు వ్యాకరణమీమాంసా వేదాంతశాస్త్రముల లోను, న్యాయవైశేషికదర్శనముల లోను అపార పాండితీ ప్రజ్ఞావైభవములు గల భట్టకుల భాస్కరుడు.

జగన్నాథుడు జనకుని యొద్ద శాస్త్రాదు లన్నియు జదివియు, విజ్ఞానతృష్ణ తీరక, సకలశాస్త్రాగమాది విద్యానిలయ మైన సర్వజ్ఞనగరి వారాణసి కరిగి జనకునికి వ్యాకరణశాస్త్రాచార్యు డయిన పండితశిఖామణి శేష వీరేశ్వర చరణసన్నిధి వసించి పాణినీయ వ్యాకరణ రహస్యార్థతత్వమవబోధము చేసికొన్న మహామనీషి. మీమాంసావ్యాకరణ శాస్త్రాఖండ పాండితీగరిమ మాతని వాదకౌశలమునకు వన్నెవెట్టి యాతనిని విమర్శక శిరోభూషణమును గావించినది; అట్టి యాతడు వాదోపవాదముల నపరాజితుడై యుద్ధతు డగుటలో నాశ్చర్యము లేదు; స్వశక్తి సత్త్వ విజ్ఞాత యతడు.

జగన్నాథపండితుని జీవిత మొకవిధముగా జూచిన శ్రీనాథ మహాకవి జీవితమున కనుప్రాసము. ఉదయ (జయ) పురాధినాథుని యాహ్వానము ననుసరించి తదాస్థానవిద్వాంసుడై విద్యావినోదముల దన ప్రభువును మెప్పించి, శాస్త్రవాదముల మహాపండితుల వాదములను మట్టుపరచిన జగన్నాథుని యశశ్చంద్రికలు ఢిల్లీవరకు ప్రసరించినవి; జగన్నాథ ప్రతిభావిశేషములు ఢిల్లీవిద్వల్లోకమున గాథలై జేగీయమానము లైనవి. తుదకు జగన్నాథుడు ఢిల్లీ మొగలాయిపాదుషా జహాంగీరు కాశ్రితు డగుటకు అతని సర్వసైన్యాధిపతి ఆసఫఖాను మున్నగు వారు నిమిత్తమాత్రు లైరి. క్రీ.శ. 1628లో ఢిల్లీ సింహాసన మధిష్ఠించిన జహాంగీరుతనయుడు షాజహానుపాదుషా సకలకలాకోవిదుడు; రసజ్ఞుడు. షాజహాను ఢిల్లీ సింహాసనారోహణము జగన్నాథుని జీవనవల్లికి వసంతాగమ మయినది. షాజహానుపాదుషా జగన్నాథుని పాండితీవైభవమునకు, కవితావినోదములకు పరితోషితస్వాంతుడై యాతని నినుమిక్కిలిగ నాదరించి పండితరాయ బిరుదగౌరవముల నొసగి సమ్మానించెను. నాటినుండి జగన్నాథుడు పండితరాయలని యన్వర్థనాము డయ్యెను. ఆ నా డతని జీవితము మూడుపూవులు ఆరుకాయలుగ పెంపు వహించినది. షాజహాను జ్యేష్ఠతనయుడు దారాషికో పండితరాయ శిష్యుడై యుపనిషద్‌ జ్ఞానామృతమును గ్రోలి యా తత్వఖనులను ఫారశీభాష లోని కనువదింప జేసెను; దర్శనములను, శాస్త్రరహస్యములను అవబోధము కావించుకొనెను. దారాషికో ఢిల్లీ సింహాసన మెక్కియుండినచో దేశచరిత్రయే తారుమా రయ్యెడిది; కాని యాతని కట్టి యదృష్టము లేదు. అతని సోదరుడు ఔరంగజేబుకు ఢిల్లీ సామ్రాజ్యము కైవస మయినది. పండితరాయల జీవితమున కా కాలము నిప్పులు చెరుగు నడివేసవి. ఢిల్లీని విడిచి యాతడు కాశికాపురి కరిగెను. కాని యాతని పేరు ప్రఖ్యాతుల కీర్ష్యాళువులయిన పండితుల సత్యదూరములగు నపనిందాంచిత వాగ్ధోరణి హృదయకంటకమై బాధింప నా పురిని విడిచి పండితరాయలు నిలువనీడ వెదకికొనుచు పలుతావుల కరిగెను; పలువురు భూవరులను సందర్శించెను. ఏమయిననేమి ఆ మహాకవి పండితరాయల జీవితము చరమదశ విషాదాంతము, నజ్ఞాతము నయినది.

జగన్నాథ పండితరాయలు రచించిన గ్రంథము లన్నింటిలో నుత్తమోత్తమ మయినది అలంకారగ్రంథము రసగంగాధరము. సంస్కృత సాహిత్యశాస్త్రపారంగతత్వమున కాత డెత్తిన సువర్ణయశఃపతాక రసగంగాధరము. కావ్యమున కాతని ప్రవచనమే ఇంతవరకు తుది నిర్వచనము. తన రచనములు ప్రశస్తము లయినవను ఆత్మవిశ్వాసము దర్పము కల విద్వత్కవి యగుటచేత రసగంగాధరమున దాను నిర్వచించిన లక్షణముల కనురూప మయిన లక్ష్యోదాహరణముల నన్నిటిని స్వీయకావ్యముల నుండియే యిచ్చెను గాని యితరుల కావ్యముల నుండి యొక్కటైన గైకొననే లేదు; ఇందు కాతని కారణ మిది.

శ్లో.
నిర్మాయ నూతన ముదాహర ణానురూపం
కావ్యం మయాత్ర నిహితం న పరస్య కించిత్‌
కిం సేవ్యతే సుమనసాం మనసాపి గంధః
కస్తూరికాజననశక్తి భృతా మృగేణ?

కస్తూరి పెట్టునట్టి మృగము పుష్పగంధమున కెన్నడైన నాశింప దలచునా యని పండితరాయల ప్రశ్న.

జగన్నాథ పండితరాయల కవితాచమత్కృతి లహరీపంచకమున మాత్రమే కాక అతని పద్యకృతు లితరములు పెక్కింటిలో కాననగును. ఆ భావశబలత, సమస్తపద సౌందర్యము, ప్రయుక్తశబ్దౌచితీరీతి, ధ్వన్యనుకరణవాగ్రచనా వైచిత్రి, గీర్వాణవాణి సహజముగ దిద్దుకొన్న యలంకార రేఖలు. జగన్నాథ పండితుని యొద్దికలో సాహితీరంగము నందది కార్తికిక సుధాధవళచంద్రికలో చంచత్తరంగభంగీ విభ్రమ శైవలినిం బోలె చతురనర్తకి యైనది.

పండితరాయకృత లహరులు స్తుత్యాత్మకములు; చాల చిన్ని కబ్బములు, లహరీపంచకమును "పండితరాజపంచామృత" మనుపేర నాంధ్రీకరించిన వారు డాక్టరు బూరుగుల రామకృష్ణరాయ మహోదయు లొక్కరే. పండితరాయ లహరీపంచకములో విద్వత్కవిజనాదరాభిమాన పాత్ర మైనది గంగాలహరి యొక్కటే. కావుననే దీని కాంధ్రానువాదము లనేకములు వచ్చినవి. రసజ్ఞుల నంత యెక్కువగ నాకర్షించినది పండితరాయల గంగాలహరి, దీనికి శ్రీ రామచంద్ర కౌండిన్యుల క్రొంగ్రొత్త యనువాద మిది.

శ్రీ రామచంద్ర కౌండిన్యులు చమత్కార వచోవిలాసులు; వ్యంగ్య సంభాషణ ప్రియులు; కావ్యానుశీలన వ్యాసంగ పరాయణులు; రసజ్ఞులు; చక్కని కవిత్వము చెప్పగల సమర్థులు. వీరి గేయరచనలు, పద్యరచనలు, ఇంతవరకు ప్రకటితము లైనవి చాల కొద్ది. వానిలో కవి కనబడుచునే యుండును. కాని ఇంతవరకు ఈయన మరుగుపడిన మాణిక్యము. అది పద్యమయిన నేమి, గద్యమయిన నేమి, ఈయన వచోరచనావిన్యాసము పరిమితపదగ్రథితమైన సూత్రానుకృతి. అనూదితమైన ఈ గంగాలహరియే అందుల కనురూప దృష్టాంతము. ప్రకటితము లైన వీరి కృతు లన్నిటిలో నిది నా కెక్కువగ రుచించినది.

భాషాంతరీకరణము చాల కష్టసాధ్య మయిన కృషి. ఒక్కొక్క భాష కొక్కొక్క విధ మయిన నుడికారము, అలంకారఫణితి, పలుకుల కూర్పు తీర్పు, శబ్దమాధుర్యము మొదలైనవి సహజములు. అందువల్లనే ఒక భాష లోని సొగసు మరియొక భాష లోని కనువదింపజేయుట భగీరథ ప్రయత్నమే. అట్లని యుత్తమగ్రంథముల కనువాదములు చేసికొనక యుండలేము. అనువాదములు మన భావనాశక్తిని ప్రకోపింపజేసి పటిష్ఠము చేయును; అన్యదేశీయులైన మహాకవుల, పండితుల మేధాసంపదతో పరిచయము గలిగి జ్ఞాననేత్రమునకు దీప్తిహెచ్చి మన విజ్ఞానవల్లరి మారాకు తొడుగును. అది యటుండ సంస్కృతముతో నత్యంత సన్నిహిత సంబంధము కలదగుటచేత నందుండి యాంధ్రమున కనువదించుటయే సులువేమో! తెలుగులో కూడ తద్భాషా సహజమైన నుడికారము, పదసౌకుమార్యము, శయ్యాసారళ్యము, వాగ్రచనాసౌందర్యము, భావగాంభీర్యము, శబ్దాలంకారస్ఫూర్తి అనూదిత గ్రంథమున గాన్పించిననే అనువాదమునకు సార్థకత. తు, చ, తప్పకుండ మక్కికి మక్కిగ అనువదించిన గ్రంథ మెంత మూలానుసారి యైనను అది యనువాదము కానేరదు.

పండితరాయ లిదివరలో నుడివినట్లు కవిరాజచూడామణి. అతని కవిత ప్రతిభాచమత్కార భాసురము. సాధ్య మయినంత వరకు గంగాలహరి యాంధ్రీకర్త లా యింపుసొంపుల నన్నిటిని తమ యనువాదముల దీసికొని వచ్చినవారే - కృతార్థతలో తరతమ భేదము లుండుగాక. శ్రీ రామచంద్ర కౌండిన్యుల యీగంగాలహరి ఒక విశిష్టతను సంతరించుకొన్న యనువాదము.

పండితరాయలు గంగాలహరీ రచనకు వరించిన వృత్తము శిఖరిణి. ఇందలి ప్రతిచరణము నాతిదీర్ఘ మయినది; కాని యందు ప్రతిపాదితమైన భావ మతివిస్తృత మైనది. ప్రతిభాశాలి యగుటచేత ఆయనకా వృత్తమే సరిపోయినది. ఆంధ్రీకర్త లనువాదమునకు బహుళముగ శిఖరిణి కంటె దీర్ఘమయిన శార్దూల, మత్తేభములను, చంపకోత్పలములను సంభావించుకొనిరి - ఎడనెడ దేశి గీతి కాటవెలదులను వాడిన నేమి, శ్రీ రామచంద్ర కౌండిన్యకృత గంగాలహరి సరళమైన గీతికలలో సాగి గంగాలహరీమంజులమధురరవళి కనుకృతి యైనది. పండితరాయల సంస్కృతవృత్తము లందలి యుదాత్తభావసంపద వీసరవోవకుండ దానిని చిన్నగీతికలలో ప్రదర్శింప గల్గుట గొప్ప ప్రజ్ఞా విశేషము; ప్రశంసనీయము. గీతికారచన యని మూలము నందలి భావపుష్టికి నష్టి కలుగ లేదు; శయ్యాసౌకుమార్యములు సన్నగిల లేదు; ధారాశుద్ధి కుంటువడ లేదు. ఆంధ్రీకర్త యంత చతురతతో చేసిన యనువాద మిది.

మరొక వైశిష్ట్య మిందలి తెలుగు దనము. ఇందలి ప్రతితేటగీతియు తెలుగుదనపు కమ్మతావులు విరజిమ్ము నవమల్లికా ప్రసవగుచ్ఛము. అందుకీ దిగువ నిచ్చిన యుదాహరణములే తార్కాణము:

శ్లో.
నిధానం ధర్మాణాం, కిమపి చ విధానం నవముదాం
ప్రధానం తీర్థానా, మమలపరిధానం త్రిజగతః ।
సమాధానం బుద్ధే, రథ ఖలు తిరోధాన మధియాం,
శ్రియా మాధానం నః పరిహరతు తాపం తవ వపుః ॥ 18
గీ.
ధర్మముల లిబ్బి, నూత్న మోదముల యుబ్బు,
మొదలి తీర్థము, త్రిభువనమ్ముల దుకూల
మజ్ఞుల హుళక్కి, విబుధజనాదృతంబు
సిరుల యుంకున నీమేను చెఱుచు వ్యథల.

ఎంత చిక్కటి తెనుగు నుడికారపు చక్కని తెనుగుసేత యిది; అచ్చ తెనుగు పద్దెమే. ఇట్టివెన్నని! - మచ్చునకు,

శ్లో.
స్వభావస్వచ్ఛానాం సహజశిశిరాణామయమపా
మపారస్తే మాతర్జయతి మహిమా కోఽపి జగతి ।
ముదా యం గాయంతి ద్యుతలమనవద్యద్యుతిభృతః
సమాసాద్యాద్యాపి స్ఫుటపులకసాంద్రాః సగరజాః ॥ 16
గీ.
పుట్టుచల్వలు తేట లంబువుల మహిమ
లగణితంబులు, ముదముమై సగరసుతులు
దివ్య తనుకాంతు లెనసి నుతింప రెందు
నాఁడు నేఁడును బులకరింతల వెలార్చి.
శ్లో.
మంత్రైర్మీలితమౌషధైర్ముకులితం త్రస్తం సురాణాం గణైః
స్రస్తం సాంద్రసుధారసైర్విదళితం గారుత్మతైర్గ్రావభిః ।
వీచిక్షాళితకాళియాహితపదే స్వర్లోకకల్లోలిని
త్వం తాపం నిరయాధునా మమ భవజ్జ్వాలావలీఢాత్మనః ॥ 50
గీ.
అడఁగె మంత్రము, లోషధుల్‌ ముడిఁగె, సురలు
వెఱగొనిరి, సాంద్ర మమృతంబు పఱచె, గరుడ
మణులు చెదరెను, భవవహ్ని మలుచు నన్ను,
కరుణ నిఁకఁ దాప మార్పవె, కాళియాహి
యహితు పదములఁ గడిగిన యమరగంగ.
శ్లో.
మరుల్లీలాలోలల్లహరి లులితాంభోజపటలీ
స్ఖలత్పాంసువ్రాతచ్ఛురణవిసరత్కౌంకుమరుచి ।
సురస్త్రీవక్షోజక్షర దగురు జంబాలజటిలం
జలం తే జంబాలం మమ జననజాలం జరయతు ॥ 20

పై శ్లోకము నందలి ప్రథమ చరణము వాయువ్యాపారలీలా సంచలితమైన ప్రవాహము. అందు కదలాడుచున్న పద్మములు, వాని నుండి రాలు ధూళి నయనగోచర మగునట్లు స్ఫురింప జేయు చక్కని శబ్దచిత్రము. అందలి సొగసును స్ఫురింపజేయుటకు సాధ్య మయినంత వర కేతత్కృతికర్తయు యత్నించి యున్నాడు. చూడు డీయనువాదము -

గీ.
చలదనిలలోల లహరులఁ గలఁగు తమ్ము
లురలుచు పరాగ మొలసి, సిందురము బలసి,
అచ్చరల చన్నుగవ జారు నగురు టసలఁ
జిక్కనౌ గంగ నాదు సంసృతిని జదుపు.

'మరుల్లీలాలోలల్లహరి లులితాంభోజపటలీ' అను దానికి 'చలదనిలలోల లహరుల గలఁగు తమ్ము'లను పదములకూర్పు ఛాయాస్ఫోరక రేఖాచిత్ర ప్రతికృతి.

గంగాలహరీ శ్లోకము లన్నిటిలో రచయిత సత్తా పట్టి చూచున దీ దిగువ శ్లోకము:

శ్లో.
నరాన్‌ మూఢాంస్తత్తజ్జనపదసమాసక్తమనసో
హసంతః సోల్లాసం వికచకుసుమవ్రాతమిషతః ।
పునానాః సౌరభ్యైః సతతమలినో నిత్యమలినాన్‌
సఖాయో నః సంతు త్రిదశతటినీతీరతరవః ॥ 43

తెలుగున విపులీకరించిన గాని యర్థము సుబోధము కాని భావము; ఇముడ్చవలసినది తేటగీతిలో. దీనిలో కూడ కృతికర్త యెట్లు కృతార్థత గాంచెనో దీని యనువాదము చూడుడు:

గీ.
ఊరిప్రేముడి విడివోని మోఱకులకు
విరియు పూవుల నవ్వుల వెక్కిరింత,
కమ్మతావుల నళికోటి కప్పు విప్పు
లొలయు నీ తీరతరువులు చెలులు మాకు.

శ్రీ రామచంద్ర కౌండిన్యుల కవిత కళామర్మజ్ఞుడైన తిక్కయజ్వను దలపునకు దెచ్చుచుండును. ముక్తసరు మాటలతో అచ్చపు తెలుగుదనము నొడిచికొని పెంపెసలారిన నెల్లూరికవితాశైలి యగుట చేత, జటిలముగ నుండి కొందరి కచ్చటచ్చట పద్యార్థము సుబోధము కాక పోవచ్చును, కాని ప్రయత్నగ్రాహ్యము మాత్ర మగును.

ఈ యనూదిత కృతియే యింత మనోహరముగ నుండ వారి స్వతంత్రకావ్యకృతి యెంత హృద్యమై మనోరంజకముగ నుండునో, అట్టి శుభావసరమునకు ప్రతీక్షించుచుందము గాక!

AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - gaMgAlahari - rAmachaMdra kauMDinya - OrugaMTi rAmachaMdrayya - Ramachandra Kaundinya - Oruganti Ramachandrayya - jagannAtha paMDitarAya gangAlaharI - Jagannadha Pandita gangalahari Panditaraya Gangalahari ( telugu kAvyamulu andhra kAvyamulu)