| కావ్యములు | మను చరిత్రము | అవతారిక |
| పెద్దనామాత్యునకుఁ గృష్ణరాయని యభ్యర్థనము | ||
| సీ. |
ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమా, రతకుఁ గ్రౌంచాచల రాజ మయ్యె నావాడపతి శకంధర సింధురాధ్యక్షు, లరిగాఁపు లెవ్వాని ఖరతరాసి కాపంచగౌడ ధాత్రీపదం బెవ్వాని, కసివాఱుగా నేఁగునట్టి బయలు సకల యాచకజనాశాపూర్తి కెవ్వాని, ఘన భుజాదండంబు కల్పశాఖి |
|
| తే. |
ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజపరమేశ బిరుద విభ్రాజి యెవ్వఁ డట్టి శ్రీకృష్ణరాయ వీరాగ్రగణ్యుఁ డొక్కనాఁడు కుతూహలం బుప్పతిల్ల. |
11 |
| సీ. |
ఇందీవరంబులనీను క్రాల్గన్నుల, శరదిందుముఖులు చామరము లిడఁగఁ బణినసూను కణాద బాదరాయణ సూత్ర, ఫక్కి విద్వాంసు లుపన్యసింపఁ బార్శ్వభూమి నభీరుభటకదంబ కరాళ, హేతిచ్ఛటాచ్ఛాయ లిరులు కొనఁగ సామంత మండనోద్దామ మాణిక్యాంశు, మండలం బొలసి యీరెండ గాయ |
|
| తే. |
మూరురాయర గండపెండార మణి మ రీచి రింఛోళిఁ గలయ నావృతము లగుచు నంకపాళి నట ద్దుకూలాంచలములు చిత్రమాంజిష్ఠ విభ్రమశ్రీ వహింప. |
12 |
| క. |
భువనవిజయాఖ్య సంస ద్భవన స్థిత భద్రపీఠిఁ బ్రాజ్ఞులగోష్ఠి\న్ గవితామధురిమ డెందము దవుల\న్ గొలువుండి సదయత\న్ ననుఁ బల్కె\న్. |
13 |
| గీ. |
సప్తసంతానములలోఁ బ్రశస్తిఁ గాంచి ఖిలము గాకుండునది ధాత్రిఁ గృతియ, కానఁ గృతి రచింపుము మాకు శిరీషకుసుమ పేశల సుధామయోక్తులఁ బెద్దనార్య! |
14 |
| క. |
హితుఁడవు చతురవచోనిధి వతుల పురాణాగమేతిహాస కథార్థ స్మృతియుతుఁడ వాంధ్రకవితా పితామహుఁడ వెవ్వ రీడు పేర్కొన నీకు\న్? |
15 |
| క. |
మనువులలో స్వారోచిష మను సంభవ మరయ రస సమంచిత కథల\న్ విన నింపు, కలిధ్వంసక మనఘ! భవ చ్చతుర రచన కనుకూలంబున్. |
16 |
| వ. |
కావున మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పు మని కర్పూర తాంబూలంబు పెట్టినం బట్టి, మహాప్రసాదం బని మోదంబున నమ్మహాప్రబంధ నిబంధనంబునకుఁ బ్రారంభించితి, నేతత్కథానాయకరత్నంబగు నమ్మహీనాథు వంశావతారం బెట్టి దనిన. |
17 |