కావ్యములు మను చరిత్రము అవతారిక
కృతిపతి వంశప్రశంస
సీ. కలశపాథోరాశి గర్భవీచిమతల్లి, కడుపార నెవ్వానిఁ గన్నతల్లి
యనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాఁడు, వన్నెవెట్టు ననార్తవంపుఁబువ్వు
సకలదైవత బుభుక్షా పూర్తి కెవ్వాఁడు, పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీఁకటితిండి కరముల గిలిగింత, నెవ్వాఁడు దొగకన్నె నవ్వఁజేయు
 
తే. నతఁడు వొగడొందు, మధు కైటభారి మఱఁది,
కళల నెల వగువాఁడు, చుక్కలకు ఱేఁడు,
మిసిమి పరసీమ, వలరాజు మేనమామ,
వేవెలుంగుల దొర జోడు, రేవెలుంగు.
18
తే. ఆ సుధాధాము విభవమహాంబురాశి
కుబ్బు మీఱంగ నందనుఁ డుదయమయ్యె
వేద వేదాంగ శాస్త్రార్థ విశద వాస
నాత్త ధిషణా ధురంధరుం డైన బుధుఁడు.
19
క. వానికిఁ బురూరవుఁడు ప్ర
జ్ఞానిధి యుదయించె సింహ సదృశుఁడు, తద్భూ
జానికి నాయువు తనయుం
డై నెగడె, నతండు గనె యయాతి నరేంద్రు\న్‌.
20
క. అతనికి యదు తుర్వసు లను
సుతు లుద్భవమొంది రహిత సూదనులు, గళా
న్వితమతులు, వారిలో వి
శ్రుతకీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై.
21
తే. వానివంశంబు తుళువాన్వవాయ మయ్యె,
నందుఁ బెక్కండ్రు నృపు లుదయంబు నొంది
నిఖిల భువన ప్రపూర్ణ నిర్ణిద్రకీర్తి
నధికులైరి తదీయాన్వయమునఁ బుట్టి.
22
మహాస్రగ్ధర. ఘనుఁడై తిమ్మక్షితీశాగ్రణి, శఠకమఠ గ్రావసంఘాత వాతా
శనరా డాశాంతదంతి స్థవిరకిరుల, జంజాటముల్‌ మాన్పి, యిమ్మే
దిని దోర్దండైకపీఠి\న్‌ దిరముపఱిచి, కీర్తిద్యుతుల్‌ రోదసిం బ
ర్వ నరాతుల్‌ నమ్రులై పార్శ్వములఁ, గొలువఁ దీవ్రప్రతాపంబు సూపె\న్‌.
23
క. వితరణఖని యాతిమ్మ
క్షితిపగ్రామణీకి దేవకీదేవికి సం
చితమూర్తి యీశ్వర ప్రభుఁ
డతిపుణ్యుఁడు పుట్టె సజ్జనావనపరుఁడై.
24
చ. బలమదమత్త దుష్టపుర భంజనుఁడై పరిపాలితార్యుఁడై
యిలపయిఁ దొంటి యీశ్వరుఁడె యీశ్వరుఁడై జవియింప రూపఱె\న్‌
జలరుహనేత్రలం దొరఁగి శైలవనంబుల భీతచిత్తులై
మెలఁగెడు శత్రుభూపతుల మేనులఁ దాల్చిన మన్మథాంకముల్‌.
25
సీ. నిజభుజాశ్రిత ధారుణీ వజ్రకవచంబు, దుష్టభుజంగాహితుండికుండు
వనజేక్షణా మనోధన పశ్యతోహరుం, డరిహంస సంసదభ్రాగమంబు
మార్గణగణ పిక మధుమాస దివసంబు, గుణరత్న రోహణ క్షోణిధరము
బాంధవసందోహ పద్మవనీ హేళి, కారుణ్యరస నిమ్నగా కళత్రుఁ
 
తే. డని, జగంబుల మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె
ధరణీధవ దత్త వివిధోపదా విధా స
మార్జితశ్రీ వినిర్జిత నిర్జరాల
యేశ్వరుఁడు, తిమ్మభూపతి యీశ్వరుండు.
26
క. ఆ యీశ్వర నృపతికిఁ బు
ణ్యాయతమతియైన బుక్కమాంబకుఁ దేజ
స్తోయజహితు లుదయించిరి,
ధీయుతులగు నారసింహ తిమ్మనరేంద్రుల్‌.
27
క. అందు నరసప్రభుఁడు, హరి
చందన మందార కుంద చంద్రాంశు నిభా
స్పంద యశ స్తుందిల ది
క్కందరుఁడై ధాత్రి యేలెఁ గలుషము లడఁగ\న్‌.
28
ఉ. శ్రీరుచిరత్వ భూతిమతి జిత్వరతాకృతి శక్తికాంతుల\న్‌
ధీరత సార భోగముల, ధీనిధి యీశ్వర నారసింహుఁ డా
వారిజనాభ శంకరుల, వారికుమారుల, వారితమ్ముల\న్‌,
వారియనుంగు మామలను, వారివిరోధులఁ బోలు నిమ్మహి\న్‌.
29
సీ. అంభోధివసన విశ్వంభరావలయంబుఁ, దనబాహుపురి మరకతముఁ జేసె
నశ్రాంత విశ్రాణ నాసార లక్ష్మికిఁ, గవికదంబముఁ జాతకములఁ జేసెఁ
గకుబంత నిఖిలరా ణ్నికరంబుఁ జరణమం, జీరంబు సాలభంజికలఁ జేసె
మహనీయ నిజవినిర్మలయశ స్సరసికి, గగనంబుఁ గలహంసకంబుఁ జేసె
 
తే. నతిశిత కృపాణ కృత్త మత్తారివీర
మండలేశ సకుండల మకుట నూత్న
మస్త మాల్య పరంపరా మండనార్చి
తేశ్వరుండగు నారసింహేశ్వరుండు!
30
తే. ఆ నృసింహప్రభుండు తిప్పాంబవలన
నాగమాంబికవలన నందనులఁ గాంచె
వీరనరసింహరాయ భూవిభుని, నచ్యు
తాంశసంభవుఁ గృష్ణరాయ క్షితీంద్రు.
31
క. వీరనృసింహుఁడు నిజభుజ
దారుణకరవాల పరుషధారాహత వీ
రారి యగుచు నేకాతప
వారణముగ నేలె ధర నవారణమహిమన్‌.
32
క. ఆవిభు ననంతరంబ ధ
రావలయముఁ దాల్చెఁ గృష్ణరాయఁడు చిన్నా
దేవియు, శుభమతి తిరుమల
దేవియునుం దనకుఁ గూర్చు దేవేరులు గా\న్‌.
33
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - avatArika ( telugu andhra )