కావ్యములు మను చరిత్రము అవతారిక
కృష్ణరాయల ప్రతాపాది వర్ణనము
సీ. తొలఁగెను ధూమకేతుక్షోభ జనులకు, నతివృష్టి దోష భయంబు వాసెఁ
గంటకాగమ భీతి గడచె నుద్ధత భూమి, భృత్కటకం బెల్ల నెత్తువడియె
మాసె నఘస్ఫూర్తి మరుభూములందును, నెల మూఁడువానలు నిండఁ గురిసె
నాబాలగోపాల మఖిల సద్వ్రజమును, నానందమున మన్కి నతిశయిల్లెఁ
 
తే. బ్రజల కెల్లను గడు రామరాజ్య మయ్యెఁ
జారుసత్త్వాఢ్యుఁ డీశ్వర నారసింహ
భూవిభుని కృష్ణరాయఁ డభ్యుదయ మొంది
పెంపు మీఱంగ ధాత్రిఁ బాలింపుచుండ.
34
మ. అలపోత్రిప్రభు దంష్ట్ర, భోగివరభోగాగ్రాళిఱా, లుద్భటా
చలకూటోపలకోటి రూపుచెడ నిచ్చల్‌ రాయఁగా నైన మొ
క్కలు భూకాంతకు నున్ననయ్యె నరసక్ష్మాపాలు శ్రీకృష్ణరా
యల బాహామృగనాభిసంకుమద సాంద్రాలేప పంకంబున\న్‌.
35
ఉ. క్రూర వనేభ దంత హత కుడ్య పరిచ్యుత వజ్రపంక్తిఁ బొ
ల్పారు మిడుంగుఱుంబురువు లంచు వెస\న్‌ గొనిపోయిపొంత శృం
గారవనద్రుమాళి గిజిగాఁడులు గూఁడులఁ జేర్చు దీపికల్‌
గా రహిఁ గృష్ణరాయమహికాంతుని శాత్రవపట్టణంబుల\న్‌.
36
సీ. తొలుదొల్త నుదయాద్రి శిలఁ దాఁకి తీండ్రించు, నసిలోహమున వెచ్చనై జనించె,
మఱి కొండవీ డెక్కి మార్కొని నలియైన, యల కసవాపాత్రు నంటి రాఁజె,
నట సాఁగి జమ్మిలోయఁ బడి వేఁగి దహించెఁ, గోన బిట్టేర్చెఁ, గొట్టానఁ దగిలెఁ,
గనకగిరిస్ఫూర్తిఁ గరఁచె గౌతమిఁ గ్రాఁచె, నవుల నాపొట్నూర రవులుకొనియె,
 
తే. మాడెములు ప్రేల్చె, నొడ్డాది మసి యొనర్చెఁ,
గటకపురిఁ గాల్చె గజరాజు గలఁగి పఱవఁ
దోఁకచిచ్చన నౌర యుద్ధరతఁ గృష్ణ
రాయబాహుప్రతాప జాగ్రన్మహాగ్ని.
37
మ. ధరకెంధూళులు కృష్ణరాయల చమూ ధాటీగతి\న్‌ వింధ్యగ
హ్వరముల్‌ దూఱఁగఁజూచి, తా రచటఁ గాఁపై యుండుట\న్‌ జాల న
చ్చెరువై యెఱ్ఱని వింత చీఁకటులు వచ్చెం జూడరే! యంచు వే
సొరిదిం జూతురు వీరరుద్రగజరాట్‌ శుద్ధాంతముగ్ధాంగనల్‌.
38
చ. అభిరతిఁ గృష్ణరాయఁడు జయాంకముల\న్‌ లిఖియించి తాళస
న్నిభముగఁ బొట్టునూరికడ నిల్పిన కంబము, సింహభూధర
ప్రభు తిరునాళ్ళకు\న్‌ దిగు సురప్రకరంబు కళింగమేదినీ
విభు నపకీర్తి కజ్జలము వేమఱుఁ బెట్టి పఠించు నిచ్చలు\న్‌.
39
మహాస్రగ్ధర. ఎకరాలఁ మండువా సా, హిణములఁ గల భ ద్రేభ సందోహవాహ
ప్రకరంబుల్‌ గొంచుఁ దత్త, త్ప్రభువులు పనుప\న్‌ రాయబారుల్‌ విలోకో
త్సుకులై నిత్యంబు శ్రీకృ, ష్ణునియవసరముల్‌ చూతు రందంద కొల్వం
దక యాప్రత్యూష మాసం, ధ్యము పనివడి తన్మందిరాళింద భూమి\న్‌.
40
చ. మదకల కుంభి కుంభ నవ మౌక్తికముల్‌ గనుపట్టు దట్టమై
వదలక కృష్ణరాయ కరవాలమునం దగు ధారనీట న
భ్యుదయమునొంది శాత్రవుల పుట్టి మునుంగఁగ ఫేనపంక్తితోఁ
బొదిగొని పైపయి\న్‌ వెడలు బుద్బుదపంక్తులు వోలెఁ బోరుల\న్‌.
41
సీ. వేదండ భయద శుండాదండ నిర్వాంత, వమధువుల్‌ పైఁజిల్కు వారిగాఁగఁ
దత్కర్ణ విస్తీర్ణ తాళవృంతోద్ధూత, ధూళి చేటలఁ జల్లు దుమ్ము గాఁగ
శ్రమబుర్బురుత్తురంగమ నాసికాగళ, త్పంకంబు వైచు కర్దమము గాఁగఁ
గుపిత యోధాక్షిప్త కుంతకాంతారఖే, లనములు దండఘట్టనలు గాఁగఁ
 
తే. జెనఁటి పగఱ ప్రతాపంబు చిచ్చు లార్చు
కరణి, గడిదేశములు చొచ్చి కలఁచి యలఁచు
మూరురాయర గండాంక వీర కృష్ణ
రాయ భూభృ ద్భయంకర ప్రబలధాటి.
42
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - avatArika ( telugu andhra )