కావ్యములు మను చరిత్రము ప్రథమాశ్వాసము
ప్రవరునికి సిద్ధుఁడు పాదలేప మొసంగుట
చ. వెఱవక మీ కొనర్తు నొక విన్నప మిట్టివి యెల్లఁ జూచిరా
నెఱకలు గట్టుకొన్న మఱి యేండ్లును బూండ్లును బట్టుఁ బ్రాయపుం
జిఱుత తనంబు మీ మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్య! మా
కెఱుఁగఁ దరంబె! మీ మహిమ లీర యెఱుంగుదు రేమిచెప్పుదు\న్‌?
73
క. అనినఁ బరదేశి గృహపతి
కనియెన్‌ సందియముఁ దెలియ నడుగుట తప్పా?
వినవయ్య! జరయు రుజయును
జెనకంగా వెఱచు మమ్ము సిద్ధుల మగుట\న్‌.
74
మ. పరమంబైన రహస్య మౌ నయిన డాఁప\న్‌, జెప్పెద\న్‌ భూమిని
ర్జరవంశోత్తమ! పాదలేప మను పేరం గల్గు దివ్యౌషధం
పు రసం బీశ్వరసత్కృపం గలిగెఁ దద్భూరి ప్రభావంబునం
జరియింతున్‌ బవమాన మానస తిరస్కారిత్వరాహంకృతిన్‌.
75
క. దివి బిసరుహబాంధవ సైం
ధవ సంఘం బెంత దవ్వు దగ లే కరుగు\న్‌
భువి నంత దవ్వు నేమును
ఠవఠవ లే కరుగుదుము హుటాహుటి నడల\న్‌.
76
మ. అనినన్‌ విప్రవరుండు కౌతుకభర వ్యగ్రాంతరంగుండు భ
క్తి నిబద్ధాంజలి బంధురుండు నయి మీ దివ్య ప్రభావం బెఱుం
గని నా ప్రల్లదముల్‌ సహించి మునిలోకగ్రామణీ! సత్కృప\న్‌
నను మీ శిష్యుని దీర్థయాత్రవలనన్‌ ధన్యాత్ముఁగాఁ జేయరే!
77
క. అనుటయు రసలింగము నిడు
తన వట్రువ ప్రేఁపసజ్జ దంతపుబరణి\న్‌
నినిచిన యొకపస రిది యది
యని చెప్పక పూసెఁ దత్పదాంబుజ యుగళిన్‌.
78
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - prathamAshvAsamu ( telugu andhra )