కావ్యములు మను చరిత్రము ప్రథమాశ్వాసము
ఆశ్వాసాంత పద్యగద్యములు
శా. గంగా స్వచ్ఛ తరంగ భంగిక యశో గాఢ చ్ఛవి చ్ఛన్న సా
రంగాంకాంక! నిరంకుశ ప్రతికళా ప్రౌఢి ప్రియంభావుకా!
గాంగేయాచలచాప నూపుర వచో గాంభీర్య లీలాస్పదా!
బంగా ళాంగ కళింగ భూప సుభటాభ్రశ్రేణి ఝంఝానిలా!
81
క. మండలికతపన! శోభిత
కుండలపతిశయన! కర్ణకుండలిత రసా
ఖండకవికావ్య! దిగ్వే
దండ శ్రుతిదళన కలహ తాడిత పటహా!
82
ఉత్సాహ. కుకురు కాశ కురు కరూశ కోస లాంధ్ర సింధు బా
హ్లిక శకాంగ వంగ సింహళేశ కన్యకామణి
ప్రకర పాణిఘటిత రత్న పాదుకా కలాచికా
ముకుర వీటికాకరండ ముఖ్య రాజలాంఛనా!
83
గద్యము. ఇది శ్రీ మదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక, పంకజాక్ష
పాదాంబుజాధీన మానసేందిందిర, నందవరపుర వంశోత్తంస, శఠకోప
తాపస ప్రసాదాసాదిత చతుర్విధ కవితామతల్లి కాల్లసాని చొక్కయా
మాత్య పుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవం బను
మహా ప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - prathamAshvAsamu ( telugu andhra )