కావ్యములు మను చరిత్రము ద్వితీయాశ్వాసము
  శ్రీఖండ శీతనగ మ
ధ్యాఖండక్షోణిమండలాఖండల! వి
ద్యాఖేలనభోజ! సుధీ
లేఖద్రుమ! కృష్ణరాయ! లీలామదనా!
1
వ. అవధరింపుము. జైమిని మునీంద్రునకుం బ్రజ్ఞాసాంద్రంబులగు
పక్షీంద్రంబు లవ్వలికథ యిట్లని చెప్పం దొడంగె.
2
హిమనగర సౌందర్యములఁగని ప్రవరుని యానందము
చ. అటఁ జని కాంచె భూమిసురుఁ డంబరచుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలము\న్‌,
గటక చరత్కరేణు కర కంపిత సాలము, శీతశైలము\న్‌.
3
వ. కాంచి యంతరంగంబునఁ దరంగితం బగు హర్షోత్కర్షంబున. 4
క. నరనారాయణ చరణాం
బురుహద్వయ భద్రచిహ్న ముద్రిత బదరీ
తరుషండ మండలాంతర
సరణి\న్‌ ధరణీసురుండు చనఁ జన నెదుట\న్‌.
5
క. ఉల్లల దలకాజలకణ
పల్లవిత కదంబముకుళ పరిమళ లహరీ
హల్లోహల మద బంభర
మల్లధ్వను లెసఁగ విసరె మరుదంకురముల్‌.
6
సీ. తొండముల్‌ సాఁచి యందుగుఁజిగుళ్ళకు నిక్కు, కరుల దంతచ్ఛాయ గడలుకొనఁగ
సెలవుల వనదంశములు మూఁగి నెఱెవెట్టఁ, గ్రోల్పులుల్‌ పొదరిండ్ల గుఱక లిడఁగ
సెలయేటి యిసుకలంకల వరాహంబులు, మొత్తంబులై త్రవ్వి ముస్తెలెత్త
నడ్డంబు నిడుపు నాపడ్డలగతి మనుఁ, బిళ్ళు డొంకలనుండి క్రేళ్లుదాఁటఁ
 
తే. బ్రబల భల్లుక నఖభల్ల భయదమథన
శిథిల మధుకోశ విసర విశీర్ణ మక్షి
కాంతరాంతర దంతురితాతపమునఁ
బుడమి తిలతండులన్యాయమున వెలుంగ.
7
క. పరికించుచు డెందంబునఁ
బురికొను కౌతుకముతోడ భూమీసురుఁ డ
గ్గిరికటక తట నిరంతర
తరు గహన గుహా విహార తత్పర మతియై.
8
సీ. నిడుదపెన్నెఱిగుంపు జడగట్ట సగరు ము, మ్మనుమండు తపము గైకొనిన చోటు
జరఠ కచ్ఛప కులేశ్వరు వెన్ను గానరా, జగతికి మిన్నేఱు దిగినచోటు
పుచ్చడీకతనంబు పోఁబెట్టి గిరికన్య, పతిఁ గొల్వ నాయాస పడినచోటు
వలరాచరాచవాఁ డలికాక్షు కనువెచ్చఁ, గరఁగిన యల కనికరపుఁజోటు
 
తే. తపసి యిల్లాండ్ర చెలువంబుఁ దలఁచి తలఁచి
మున్ను ముచ్చిచ్చును విరాళిఁ గొన్న చోటు
కనుపపులు వేల్పుఁబడవాలుఁ గన్నచోటు
హర్షమునఁ జూచి ప్రవరాఖ్యుఁ డాత్మలోన.
9
చ. విలయకృశానుకీలముల వేఁడిమిఁ బోఁడిమి మాలి వెల్మిడి\న్‌
గలసిన భూతధాత్రి మఱి క్రమ్మఱ రూపయి నిల్చి యోషధుల్‌
మొలవఁగఁజేయునట్టి నయముం బ్రతికల్పము నెట్లు గాంచు? నీ
చలిమలవల్ల నుల్లసిలు చల్లఁదనంబును నూనకుండిన\న్‌.
10
సీ. పసపునిగ్గులు దేఱు పాఁపజన్నిద మొప్పఁ, బ్రమథాధిపతి యింటిపట్టెఱింగె
శచి కీఁత గఱపుచుఁ జదలేట సురరాజు, జలకేళి సవరించు చెలు వెఱింగె
నదనుతోఁ జేఁపి చన్నవిసి యోషధుల మ, న్మొదవు కొండల కెల్లఁ బిదుక నెఱిఁగె
వేల్పుటింతులలోన విఱ్ఱవీఁగుచు మేన, నవరత్న రచనల రవణ మెఱిఁగెఁ
 
తే. బరిపరివిధంపు జన్నంపుఁ బరికరంపు
సొంపుసంపద నిఖిల నిలింపసభయు
నప్పటప్పటికిని జిహ్వ త్రుప్పు డుల్ల
నామెత లెఱింగె నీతుషారాద్రికతన.
11
మ. తలమే బ్రహ్మకు నైన నీనగ మహత్త్వం బెన్న? నే నియ్యెడం
గల చోద్యంబులు ఱేపు గన్గొనియెదం గాకేమి, నేఁ డేఁగెద\న్‌
నళినీబాంధవ భాను తప్త రవికాంత స్యంది నీహారకం
దళ చూత్కారపరంపరల్‌ పయిపయిన్మధ్యాహ్నముందెల్పెడి\న్‌.
12
తే. అనుచుఁ గ్రమ్మఱువేళ నీహారవారి
బెరసి తత్పాదలేపంబు గరఁగిపోయెఁ,
గరఁగిపోవుట యెఱుఁగఁ డద్ధరణిసురుఁడు,
దైవకృతమున కిల నసాధ్యంబు కలదె?
13
మ. అతఁడట్లౌషధహీనుఁడై నిజపురీ యాత్రామిళత్కౌతుకో
ద్ధతిఁ బోవ\న్‌ సపది స్ఫుటార్తిఁ జరణ ద్వంద్వంబు రా కుండిన\న్‌
మతిఁ జింతించుచు నవ్విధం బెఱిఁగి హా! న న్నిట్లు దైవంబ! తె
చ్చితె! యీ ఘోరవన ప్రదేశమునకు\న్‌ సిద్ధాపదేశంబున\న్‌.
14
క. ఎక్కడి యరుణాస్పదపుర!
మెక్కడి తుహినాద్రి! క్రొవ్వి యే రాఁదగునే?
యక్కట! మును సనుదెంచిన
ది క్కిదియని యెఱుఁగ, వెడలు తెరు వెయ్యదియో!
15
మ. అకలంకౌషధసత్త్వముం దెలియ మాయా ద్వారకావంతి కా
శి కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింప కుద్దండ గం
డక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్ర మిమ్ముంచుఁగొం
డకు రాఁ జెల్లునె? బుద్ధిజాడ్య జనితోన్మాదుల్‌ గదా! శ్రోత్రియుల్‌.
16
సీ. నను నిముసంబు గానక యున్న నూ రెల్ల, నరయు మజ్జనకుఁ డెంతడలునొక్కొ!
యెపుడు సంధ్యలయందు నిలు వెళ్ళనీక న, న్నోమెడుతల్లి యెంతొఱలునొక్కొ!
యనుకూలవతి నాదు మనసులో వర్తించు, కులకాంత మది నెంత కుందునొక్కొ!
కెడఁ దోడునీడలై క్రీడించు సచ్ఛాత్రు, లింతకు నెంత చింతింతురొక్కొ!
 
తే. యతిథి సంతర్పణంబు లేమయ్యెనొక్కొ!
యగ్ను లే మయ్యెనొక్కొ! నిత్యంబు లైన
కృత్యములఁ బాపి, దైవంబ! కినుక నిట్లు
పాఱవైచితె! మిన్నులు పడ్డచోట!
17
క. నను నిలు సేర్చు నుపాయం
బొనరింపఁగఁజాలు సుకృతి యొకఁ డొదవఁడొకో!
యనుచు\న్‌ జింతా సాగర
మున మునిఁగి భయంబు గదురఁ బోవుచు నెదుర\న్‌.
18
సీ. కులిశధారాహతి పొలుపునఁ బైనుండి, యడుగు మోవఁగ జేగు ఱైన తటులఁ
గనుపట్టు లోయ గంగానిర్ఝరము వాఱఁ, జలువయౌ నయ్యేటి కెలఁకులందు
నిసుకవెట్టిన నేల నేచి యర్కాంశులఁ, జొరనీక దట్టమై యిరులు గవియు
క్రముక పున్నాగ నారంగ రంభా నాళి, కేరాది విటపి కాంతారవీథిఁ
 
తే. గెరలు పిక శారికా కీర కేకి భృంగ
సారసధ్వనిఁ దనలోని చంద్రకాంత
దరులు ప్రతిశబ్ద మీన గంధర్వ యక్ష
గానఘూర్ణిత మగు నొక్క కోనఁ గనియె.
19
క. కనుఁగొని యిది మునియాశ్రమ
మను తహతహ వొడమి, యిచటి కరిగిన నాకు\న్‌
గన నగు నొక తెఱకువ యని
మనమునఁ గల దిగులు కొంత మట్టువడంగ\న్‌.
20
చ. నికట మహీధరాగ్ర తట నిర్గత నిర్ఝరధారఁ బాసి, లో
యకుఁ దలక్రిందుగా మలఁకలై దిగు కాలువ వెంటఁ, బూచు మ
ల్లిక లవలంబనంబుగ నళి ప్రకరధ్వని చిమ్మి రేఁగ, లో
నికి మణిపట్టభంగసరణి\న్‌ ధరణీసురుఁ డేఁగి చెంగట\న్‌.
21
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - dvitIyAshvAsamu ( telugu andhra )