కావ్యములు మను చరిత్రము ద్వితీయాశ్వాసము
మణిమయభవనమున నప్సరస వరూధిని
శా. తావుల్‌ క్రేవలఁ జల్లు చెంగలువ కేదారంబు తీరంబున
న్మావుల్‌ క్రోవులు నల్లిబిల్లిగొను కాంతారంబునం, దైందవ
గ్రావాకల్పిత కాయమాన జటిల ద్రాక్షా గుళుచ్ఛంబుల\న్‌,
బూవుందీవెల నొప్పు నొక్క భవనంబు\న్‌, గారుడోత్కీర్ణము\న్‌.
22
క. కాంచి, తదీయ విచిత్రో
దంచిత సౌభాగ్యగరిమ కచ్చెరువడి, య
క్కంచన గర్భాన్వయమణి
యించుక దఱియంగ నచటి కేఁగెడు వేళ\న్‌.
23
క. మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుత మొలసె\న్‌.
24
మ. అతఁ డా వాత పరంపరా పరిమళ వ్యాపారలీల\న్‌ జనా
న్విత మిచ్చోటని చేరఁ బోయి, కనియెన్‌ విద్యుల్లతావిగ్రహ\న్‌,
శతపత్రేక్షణఁ, జంచరీకచికుర\న్‌, జంద్రాస్యఁ జక్రస్తని\న్‌
నతనాభి\న్‌, నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నము\న్‌.
25
తే. అమల మణిమయ నిజ మందిరాంగణస్థ
తరుణ సహకార మూల వితర్దిమీఁద
శీతలానిల మొలయ నాసీన యైన
యన్నిలింపాబ్జముఖియు నయ్యవసరమున.
26
సీ. తత నితంబాభోగ ధవళాంశుకములోని, యంగదట్టపుఁ గావి రంగువలన
శశికాంతమణిపీఠి జాజువాఱఁగఁ గాయ, లుత్తుంగకుచపాళి నత్తమిల్లఁ
దరుణాంగుళీ ధూతతంత్రీస్వనంబుతో, జిలిబిలిపాట ముద్దులు నటింప
నాలాపగతిఁ జొక్కి, యరమోడ్పుఁ గనుదోయి, రతిపారవశ్య విభ్రమము దెలుపఁ
 
తే. బ్రౌఢిఁ బలికించు గీత ప్రబంధములకుఁ
గమ్రకరపంకరుహ రత్న కటక ఝణఝ
ణ ధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప
నింపు దళుకొత్త వీణ వాయింపుచుండి.
27
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - dvitIyAshvAsamu ( telugu andhra )