కావ్యములు మను చరిత్రము ద్వితీయాశ్వాసము
ప్రవరుని సౌందర్యముఁగని వరూధిని మోహించుట
ఉ. అబ్బురపాటుతోడ నయనాంబుజముల్‌ వికసింపఁ, గాంతి పె
ల్లుబ్బి కనీనికల్‌ వికసితోత్పలపంక్తులఁ గ్రుమ్మరింపఁగా,
గుబ్బ మెఱుంగుఁ జన్గవ గగుర్పొడువన్‌, మదిలోనఁ గోరికల్‌
గుబ్బతిలంగఁ జూచె, నలకూబరసన్నిభు నద్ధరామరున్‌.
28
ఉ. చూచి, ఝళంఝళ త్కటక సూచిత వేగ పదారవిందయై
లేచి, కుచంబులు\న్‌ దుఱుము లేనడుమల్లల నాడ, నయ్యెడన్‌
బూచిన యొక్క పోఁక నునుబోదియఁ జేరి విలోకనప్రభా
వీచికలన్‌ఁ, దదీయ పదవీకలశాంబుధి వెల్లిగొల్పుచున్‌.
29
మ. మునుమున్‌ పుట్టెడుకొంకు లౌల్యము నిడన్‌, మోదంబు విస్తీర్ణతన్‌
జొనుపన్‌, గోర్కులు గ్రేళ్లు ద్రిప్ప, మదిమెచ్చుల్‌ ఱెప్ప లల్లార్ప న
త్యనుషంగస్థితి ఱిచ్చపా టొసఁగ, నొయ్యారంబునన్‌ జంద్రిక
ల్దనుకన్‌ జూచె లతాంగి భూసురుఁ బ్రఫుల్లన్నేత్ర పద్మంబులన్‌.
30
క. పంకజముఖి కప్పుడు మై
నంకురితము లయ్యెఁ బులక లావిష్కృత మీ
నాంకానల సూచక ధూ
మాంకురములు వోలె మఱియు నతనిన్‌ జూడన్‌.
31
ఉ. తొంగలిఱెప్పలం దొలఁగఁ ద్రోయుచుఁ, బైపయి విస్తరిల్లు క
న్నుంగవ యాక్రమించుకొనునో! ముఖచంద్రు నటంచుఁ బోవనీ
కంగజుఁ డానవెట్టి కదియన్‌ గుఱివ్రాసె ననంగ, జాఱి సా
రంగమదంబు లేఁజెమటఁ గ్రమ్మె లలాటము డిగ్గి చెక్కులన్‌.
32
మ. అనిమేషస్థితి మాన్పె బిత్తరపుఁజూ, పస్వేదతావృత్తి మా
న్పె నవస్వేదసమృద్ధి, బోధకళ మాన్పెన్‌ మోహవిభ్రాంతి, తో
డనె గీర్వాణవధూటికిన్‌, భ్రమర కీట న్యాయ మొప్పన్‌ మను
ష్యుని భావించుట మానుషత్వము మెయింజూపట్టె నానత్తఱిన్‌.
33
వ. ఇట్లతని రూపరేఖావిలాసంబులకుంజొక్కి, యక్కమలపత్రేక్షణ యాత్మగతంబున. 34
ఉ. ఎక్కడివాఁడొ! యక్షుతనయేందు జయంత వసంత కంతులన్‌
జక్కఁదనంబునన్‌ గెలువఁ జాలెడు వాఁడు, మహీసురాన్వయం
బెక్కడ? యీతనూవిభవమెక్కడ? యేలని బంటుగా మరున్‌
డక్కఁగొనంగరాదె యకటా! నను వీఁడు పరిగ్రహించినన్‌.
35
సీ. వదన ప్రభాత లావణ్యాంబు సంభూత, కమలంబు లన వీనికన్ను లమరు
నిక్కి వీనులతోడ నెక్కసక్కెములాడు, కరణి నున్నవి వీని ఘనభుజములు,
సంకల్ప సంభవాస్థాన పీఠిక వోలె, వెడఁదయై కనుపట్టు వీని యురము
ప్రతిఘటించు చిగుళ్ళపై నెఱ్ఱవాఱిన, రీతి నున్నవి వీని మృదుపదములు,
 
తే. నేరెటేటియసల్‌ తెచ్చి, నీరజాప్తు
సానఁ బట్టిన రాపొడి చల్లి, మెదిపి
పదను సుధ నిడి చేసెనో పద్మభవుఁడు
వీని; గాకున్నఁ గలదె యీ మేని కాంతి?
36
క. సుర గరుడోరగ నర ఖే
చర కిన్నర సిద్ధ సాధ్య చారణ విద్యా
ధర గంధర్వ కుమారుల
నిరతము గనుఁగొనమె! పోల నేర్తురె వీని\న్‌?
37
మ. అని చింతించుచు మీనకేతనధనుర్జ్యాముక్త నారాచ దు
ర్దిన సమ్మూర్ఛిత మానసాంబురుహయై, దీపించు పెందత్తఱం
బునఁ బేటెత్తిన లజ్జ నంఘ్రికటకంబుల్‌ మ్రోయ, నడ్డంబు ని
ల్చిన నయ్యచ్చరఁ జూచి చేరఁ జని పల్కె\న్‌ వాఁడు విభ్రాంతుఁడై.
38
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - dvitIyAshvAsamu ( telugu andhra )